Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అన్ని వసతులూ కల్పించాలి : సీఎం కేసీఆర్‌కు తమ్మినేని లేఖ
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో ప్రాజెక్టుల కింద భూమి కోల్పోయిన నిర్వాసితులకు తక్షణమే '2013 భూసేకరణ చట్టం' ప్రకారం నష్టపరిహారం చెల్లించాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వారికి చట్టం ప్రకారం అన్ని వసతులూ కల్పించాలని కోరారు. ఈ మేరకు ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావుకు గురువారం ఆయన లేఖ రాశారు. రాష్ట్రంలోని వివిధ నీటి ప్రాజెక్టులు, రిజర్వాయర్ల కోసం రాష్ట్ర ప్రభుత్వం భూసేకరణ చేసిందని ఒక ప్రకటనలో గుర్తు చేశారు. దీనిలో భాగంగా అనేక కుటుంబాలు వారి భూములు, ఇండ్లు, ఇండ్లస్థలాలు, వృత్తులు, ఉపాధితోపాటు సర్వస్వం కోల్పోయి రోడ్డున పడ్డాయని ఆందోళన వ్యక్తం చేశారు. 2013 భూసేకరణ చట్ట ప్రకారం ఈ నిర్వాసితులను ఆదుకోకుండా ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తున్నదని విమర్శించారు. తక్షణమే వారు కోల్పోయిన స్థిర, చర ఆస్తులన్నింటినీ పరిగణనలోకి తీసుకుని పునరావాస చట్టం కింద యుద్ధప్రాతిపదికన నష్ట పరిహారంతోపాటు, అన్ని వసతులనూ కల్పించాలనీ, న్యాయం చేసి ఆదుకోవాలని డిమాండ్ చేశారు. భూములను కోల్పోయిన వారిలో చాలా వరకు సన్న, చిన్నకారు రైతులే ఉన్నారని తెలిపారు. వారి జీవనోపాధి ఈ భూమిపైనే ఆధారపడినప్పటికీ ప్రాజెక్టులకు భూములిచ్చారని పేర్కొన్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని ప్రాజెక్టుల కింద సేకరించిన భూములకు తక్షణమే 2013 భూసేకరణ చట్టం కింద నష్టపరిహారం చెల్లించాలని కోరారు. వారికి పునరావాసం కల్పించాలనీ, చట్టంలో పేర్కొన్న విధంగా భూమి కోల్పోయిన నిర్వాసితులకు, ఆ భూమిపై జీవనోపాధి పొందుతున్న కూలీలను అన్ని విధాలా ఆదుకోవాలని సూచించారు.
భూసేకరణ చేసి నష్టపరిహారం ఇవ్వని ప్రాజెక్టులు :
- వనపర్తి జిల్లా రేవల్లి మండలం బండరాయిపాకుల గ్రామంలో గత ఏడేండ్ల క్రితం ఏదులముంపు రిజర్వాయర్‌లో 976 కుటుంబాలు వారి భూములు, ఇండ్లు, ఇండ్లస్థలాలు, వృత్తులు, ఉపాధి సర్వస్వం కోల్పోయాయి. ఏడేండ్లు దాటుతున్నా నేటికీ 310 కుటుంబాలకు నష్టపరిహారం అందలేదు. 376 కుటుంబాలకు ఇంటి నిర్మాణానికి కనీసం జాగాలనూ కేటాయించలేదు.
- మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల మండలం ఉదండపూర్, వళ్లూరుతాండ గ్రామాల్లో 'ఉదండపూర్ రిజర్వాయర్' కోసం గత ఏడేండ్ల క్రితం భూమిని సేకరించారు. నేటికీ చాలా మందికి నష్టపరిహారం చెల్లించలేదు. ఇండ్లు కోల్పోయిన బాధితులకు నష్టపరిహారం ఎంత ఇవ్వాలో నేటికీ ప్రకటించలేదు. ప్రాజెక్టులోకి నీరు వస్తే ఉదండపూర్, వళ్లూరు, వళ్లూరుతాండ గ్రామాలు పూర్తిగా ప్రాజెక్టులో మునిగిపోతాయి. జడ్చర్ల దగ్గర వారికి పునరావాసం కల్పిస్తామంటూ చెప్పిన ప్రభుత్వం ఆ దిశగా నేటికీ చర్యలు తీసుకోలేదు.
- నారాయణపేట జిల్లాలో 18 ఏండ్ల క్రితం రాజీవ్‌భీమా ఫేజ్-1 (సంగెంబండ) ప్రాజెక్టుకు భూసేకరణ చేసింది. నేరడుగొమ్మ, భూత్పూర్ గ్రామాలను షిఫ్ట్ చేయాలని నిర్ణయించినా నేటికీ అది అమలు కాలేదు. నష్టపరిహారం ఈ గ్రామాల వారికి ఇవ్వలేదు. రిజర్వాయర్ కింద ఈ గ్రామాలుండడంతో వారి ఇండ్లలోకి నీళ్లు వస్తున్నాయి. సంగంబండ గ్రామ ప్రజలకూ చెల్లించాల్సిన కొంత డబ్బు ఇవ్వకపోవడంతో లోలెవల్ కెనాల్ పనులను ఆ గ్రామ రైతులు ఆపివేశారు.
- జోగులాంబ గద్వాల జిల్లా నెట్టెంపాడు ప్రాజెక్టుకు గతంలో 15 ఏండ్ల క్రితం భూమిని సేకరించారు. ఇంకా కొంత మందికి నష్టపరిహారం నేటికీ ఇవ్వలేదు. చిన్నోనిపల్లి రిజర్వాయర్ వల్ల ఉపయోగం లేనందున ఆ ప్రాజెక్టును రద్దు చేసి ఆ భూములు తిరిగి వారికివ్వాలని రైతులు 120 రోజులుగా ఆందోళనలు చేస్తున్నారు.
- పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు కింద తీసుకున్న భూములకు చాలా మందికి నేటికీ నష్టపరిహారం ఇవ్వకుండా ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తున్నది. మహత్మాగాంధీ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ కింద కొల్లాపూర్, కోడేరు, పెద్దకొత్తపల్లి, వంగూరు, ఉప్పునుంతల, తెలకపల్లి మండలాల్లోని కొన్ని గ్రామాల నుంచి భూమిని సేకరించారు. ఇంకా కొంత మందికి నష్టపరిహారం చెల్లించలేదు.
- సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం గౌరవెల్లి రిజర్వాయర్ ప్రాజెక్టులోని వివిధ విభాగాల కింద రావాల్సిన నష్టపరిహారం ఇవ్వలేదు. ఇల్లు, ఇంటి స్థలం, భూములు, సర్వస్వం ఈ ప్రాజెక్టుకు ఇచ్చిన వారికి తగిన పరిహారం ఇవ్వకపోగా, నిర్వాసితులపైనే దాడులకు పాల్పడుతున్నది. 700 మంది నిర్వాసితులు చాలా కాలంగా ఆందోళనలు చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు.
- ఆదిలాబాదు జిల్లా పిప్పల్‌కోటి రిజర్వాయర్ ఆయకట్టు ముంపు భూములు 1013 ఎకరాలను సేకరించింది. నష్టపరిహారం రూ.ఎనిమిది లక్షలంటూ నిర్ణయించినా నేటికీ చెల్లించలేదు. కరోనా సాకుతో కేవలం రూ.నాలుగు లక్షలు ఇస్తామని అంటున్నది. ఇది సరైందికాదు. దీన్ని రైతులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. కొరాటా, చనాక బ్యారేజ్ ముంపు గ్రామంలో చేసిన భూ సేకరణలో భూమి కోల్పోయిన నిర్వాసితులకు నేటికీ పునరావాసం కల్పించలేదు.
- రంగారెడ్డి జిల్లాలో కల్వకుర్తి ఎత్తిపోతల పథకం (కేఎల్ఐ) కింద అవురుపల్లి, దొడ్లపాడు, నల్లవారిపల్లి, కొల్కులపల్లి, అప్పారెడ్డిపల్లి గ్రామాల భూములను, డిండి లిఫ్ట్ ఇరిగేషన్ (డీఎల్ఐ) కింద రంగారెడ్డి జిల్లా మాడ్గుల మండలం ఇర్విన్, బ్రాహ్మణపల్లి, ఆర్కెపల్లి, సుద్దపల్లి, అన్నెబోయినపల్లి భూములను గత ఐదేండ్ల కింద ప్రభుత్వం సేకరించింది. రైతులు ఆందోళనలు చేసినప్పటికీ నేటికీ ప్రభుత్వం నష్టపరిహారం ఇవ్వలేదు.
- నిజామాబాద్ జిల్లా మోపాల్ మండలంలో మంచిప్ప రిజర్వాయర్‌కు గత మూడేండ్ల క్రితం భూసేకరణ జరిగింది. కొంత మందికి మాత్రమే అసైన్డ్ భూమి అనే పేరుతో నామమాత్రపు నష్టపరిహారం ఇచ్చింది. మిగతా వారికి ఇవ్వలేదు.
- ములుగు జిల్లా గోవిందరావుపేట మండలంలో గుండ్లవాగు ప్రాజెక్టుకు రాజశేఖరరెడ్డి కాలంలో భూమిని సేకరించారు. ఎవరికీ నష్టపరిహారం ఇవ్వలేదు. ములుగు, వెంకటాపురం మండలాల్లో నుంచి వెళ్లిన దేవాదుల పైపులైన్‌కు 2005లో భూమిని సేకరించారు. కొంతమందికి మాత్రమే నష్టపరిహారం ఇచ్చారు.
- జయశంకర్ భూపాలపల్లి జిల్లా మేడిగడ్డ (లక్ష్మీబ్యారేజ్), అన్నారం (సరస్వతీ బ్యారేజ్), కాళేశ్వరం కన్నెపల్లి పంప్‌హౌస్ ప్రాజెక్టు కింద భూములు సేకరించి కొంతమందికే నష్టపరిహారం చెల్లించింది. మేడిగడ్డ, అన్నారం బ్యాక్ వాటర్ వల్ల పంట పొలాలు నీట మునుగుతున్నాయి. ప్రస్తుతం కన్నెపల్లి ప్రాజెక్టు కింద 12 పెద్ద మోటార్లు కాలిపోయాయి. ఈ సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలి.
- కామారెడ్డి జిల్లాలో కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 21, 22వ ప్యాకేజీ కింద కాలువ కోసం భూమిని సేకరించారు. కొంతమందికే నష్టపరిహారం ఇచ్చింది. ప్రస్తుతం కాల్వ పనులూ ఆపేసింది.
- కొమురంభీం ప్రాజెక్టు కోసం ఆరేండ్ల క్రితం భూసేకరణ చేసింది. కొంతమందికే నష్టపరిహారం ఇచ్చారు. జగన్నాథ్‌పూర్ ప్రాజెక్టు కింద కాల్వలకు సేకరించిన 100 ఎకరాల భూములకు నేటికీ నష్టపరిహారం ఇవ్వలేదు.
- భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సీతమ్మదార బ్యారేజీకి భూసేకరణ చేసినప్పటికీ నష్టపరిహారం ఇవ్వలేదు.
15. నల్లగొండ జిల్లా డిండి, బస్వాపురం రిజర్వాయర్ల కింద భూసేకరణ చేసినప్పటికీ కొంతమందికే నష్టపరిహారం ఇచ్చి చేతులు దులుపేసుకున్నది.
- యాదాద్రి భువనగిరి జిల్లా బస్వాపురం రిజర్వాయర్‌కు భూసేకరణ జరిగింది. ఎస్ఎల్బీసీ డిండి (చర్లగూడెం), ధర్మారెడ్డిపల్లి కాల్వ, పిలాయిపల్లి కాల్వ కింద సేకరించిన భూములకు నేటికీ చాలా మందికి నష్టపరిహారం చెల్లించలేదు. బస్వాపురం రిజర్వాయర్ కింద నాలుగు గ్రామాలు ముంపునకు గురవుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు.