Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఎస్ఎన్ఆర్ శాస్త్రి
కర్ణుడి చావుకు సవాలక్ష కారణాలు అన్నట్టు... కరెంటు షాక్ మరణాలకూ కారణాలు అనేకం. ఎక్కడైనా ట్రాన్స్ఫార్మర్ వద్ద ఫ్యూజ్‌లు పోతే, వాటిని మార్చాల్సిన బాధ్యత డిస్కంలది. వ్యవసాయ క్షేత్రాల్లో రైతులే ఎలక్ట్రీషియన్లుగా మారుతున్నారు. ఫ్యూజ్ పోయిందనీ, కరెంటు సరఫరా నిలిచిపోయిందని సంబంధిత అధికారులకు ఫోన్ చేస్తే స్పందించరనీ, లేకుంటే బిజీగా ఉన్నామనీ, తర్వాత వస్తామనో చెప్తారనీ, అప్పటికి పంటలు ఎండిపోతాయని తామే ఫ్యూజులు వేసుకుంటున్నామని రైతులు చెబుతున్నారు. దీనితో కరెంటు షాక్‌లకు గురై ప్రాణాలు కోల్పోతున్నారు.
నిలువెల్లా నిర్లక్ష్యం
డిస్కంలు విద్యుత్ పంపిణీ, సరఫరా బలోపేతానికి రూ.34,087 కోట్లు ఖర్చు చేశాయి. ఈ సొమ్మును సబ్స్టేషన్ల నిర్మాణం, ట్రాన్స్ఫార్మర్లు, కొత్తలైన్ల ఏర్పాటు కోసం ఖర్చు చేశారు. అదే సమయంలో గ్రామీణ ప్రాంతాల్లో అప్పటికే ఉన్న నెట్‌వర్క్‌ను రీప్లేస్ చేసి ఉంటే కొన్నయినా ప్రాణాలు నిలిచి ఉండేవి. రాష్ట్రంలో విద్యుత్ పంపిణీ వ్యవస్థ ఎంత అధ్వానంగా ఉందో తెలియాలంటే రాష్ట్రప్రభుత్వం ఏటా నిర్వహిస్తున్న 'పల్లె-పట్టణ ప్రగతి' కార్యక్రమ లెక్కల్ని పరిశీలిస్తే తెలుస్తుంది. వంగిన కరెంటు స్తంభాల మార్పు, ట్రాన్స్ఫార్మర్ల తనిఖీ, లూజు లైన్లు, లూజు కనెక్షన్లను ఎప్పటి కప్పుడు చెక్ చేసి, సరిచేయాలి. కానీ ఏడాదికోసారి అన్నట్టు 'పల్లె-పట్టణ ప్రగతి' సందర్భంగానే గ్రామీణంలో విద్యుత్ లైన్లను మరమ్మతులు చేస్తున్నట్టు గణాంకాలు చెప్తున్నాయి.
తనిఖీలేవీ?
పరిశ్రమల్లో విద్యుత్ ప్రమాదాలు జరిగినప్పుడు ప్రాణనష్టం ఎక్కువగా సంభవిస్తూ ఉంటుంది. వాటిలో ప్రతినెలా జరిగే కరెంటు వినియోగాన్ని బట్టి, అక్కడి లైన్లను తరచూ తనిఖీలు చేయాలి. పరిశ్రమలోని వైరింగ్‌ను పరిశీలించి, తగిన సూచనలు చేయాలి. కానీ ఆ పనిని డిస్కంలు చేయట్లేదు. అధిక విద్యుత్ వినియోగాన్ని పంపిణీ సంస్థలు ఆదాయంగా చూస్తున్నాయే తప్ప, ఆయా ఇండ్లు, దుకాణాలు, షాపుల్లోని వైరింగ్ సామర్థ్యాన్ని ఏమాత్రం తనిఖీ చేయట్లేదు. ఫలితంగా షార్ట్సర్క్యూట్లు సంభవించి, ఆస్తినష్టంతో పాటు ప్రాణనష్టాలు జరుగుతున్నాయి. విద్యుత్ ప్రమాదాలు జరిగాక డిస్కంల అధికారులు తప్పొప్పులను వెతుక్కోవడంలోనే శ్రద్ధ చూపిస్తున్నారు. ఫలానా ప్రమాదం వినియోగదారుడి నిర్లక్ష్యం వల్లే జరిగిందనీ, తాము నిమిత్తమాత్రులం అని ప్రకటించుకుంటున్నారు. ఈ ఏడాది మార్చి 23న సికింద్రాబాద్ బోయిగూడలోని ఓ స్క్రాప్ దుకాణంలో షార్ట్ సర్య్కూట్‌తో జరిగిన అగ్నిప్రమాదంలో 11 మంది మృత్యువాత పడ్డారు. జులై 12న కామారెడ్డి జిల్లా బీడీ వర్కర్స్ కాలనీలో ఆరుబయట తీగపై బట్టలు ఆరేస్తూ పర్వీన్ అనే మహిళ కరెంటు షాక్ తగిలి మరణించింది. ఆమెకు ఏమైందో అని పట్టుకున్న ఆమె భర్త, ఇద్దరు పిల్లలు కూడా అక్కడికక్కడే మరణించారు. అదే జిల్లాలోని బాన్సువాడ మండలం ఖాదలపూర్లో రేకుల షెడ్‌కు కరెంటు ప్రవహించి తల్లీ, కూతురు మరణించారు. అయితే పై మరణాలేవీ డిస్కంల నిర్లక్ష్యం వల్ల జరిగిన ప్రమాదాలుగా గుర్తించలేదు. అవన్నీ వినియోగదారుల నిర్లక్ష్యం వల్ల జరిగిన ప్రమాదాలేనని తేల్చారు.
డీఎస్ఎమ్ లేదు...
వ్యవసాయ క్షేత్రాల్లో డిమాండ్ సైడ్ మేనేజ్మెంట్ (డీఎస్ఎమ్) చేపట్టాలని కేంద్ర విద్యుత్ నియంత్రణ మండలి (సీఈఆర్సీ) ఏనాడో ఆదేశించింది. దానికి ఉమ్మడి రాష్ట్రంలో అప్పటి ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్సీ) ఆమోదం తెలిపింది. అదే చట్టాన్ని తెలంగాణ విద్యుత్ నియంత్రణ మండలి (టీఎస్ఈఆర్సీ) అడాప్ట్ చేసుకుంది. డిస్కంలు సమర్పించే వార్షిక ఆదాయ అవసరాల ప్రతిపాదన (ఏఆర్ఆర్)ల సమయంలో డీఎస్ఎమ్ అమలు చేయాలని తన ఆర్డర్లో పేర్కొనడం తప్ప, వాటి అమలుపై ప్రత్యేక శ్రద్ధ చూపిన దాఖలాలు లేవు. డిస్కంలూ పట్టించుకోవట్లేదు. వ్యవసాయ కనెక్షన్లకు ఐఎస్ఐ మార్కు మోటార్లు, పంపులు, వైర్లు, స్విచ్‌లు వాడాలనే నిబంధనలు ఉన్నాయి. వాటి ఖరీదు ఎక్కువగా ఉండటంతో రైతులు నాశిరకం ఎలక్ట్రికల్ వస్తువుల్ని వాడుతున్నారు. దీనివల్లా ప్రమాదాలు జరుగుతున్నాయి. విద్యుత్ వినియోగం కూడా ఎక్కువగా అవుతుంది. డీఎస్ఎమ్ నిర్వహణను డిస్కంలే చేపట్టాలని రైతు సంఘాలు ఇప్పటికి అనేకసార్లు డిమాండ్ చేశాయి. ఖర్చుకు వెరసి పంపిణీ సంస్థలు వాటి జోలికే వెళ్లట్లేదు.
అనధికార మరణాలు
విద్యుద్ఘాతానికి గురై సంభవించే అనధికారిక మరణాలు కూడా ఉంటాయి. అవి రికార్డుల్లోకి ఎక్కవు. అధికారికంగా ప్రకటించిన మరణాల సంఖ్యలో సగం రికార్డులకెక్కని మరణాలు ఉంటాయని క్షేత్రస్థాయి విద్యుత్ సిబ్బంది చెప్తుంటారు. కరెంటు షాక్‌కు గురై మరణం సంభవిస్తే, దానికి సంబంధిత ప్రాంత లైన్మెన్, అసిస్టెంట్ ఇంజినీర్, డివిజినల్ ఇంజినీర్లను బాధ్యుల్ని చేస్తుంటారు. అధికారికంగా డిస్కంలు నష్టపరిహారం (ఎక్స్‌గ్రేషియా) చెల్లించాల్సి వస్తే, వారు సక్రమంగా విధులు నిర్వహించ నందువల్లే మరణం సంభవించిందని సర్వీసు రికార్డుల్లో నమోదు చేస్తారు. దీనితో వారి సర్వీసులో రిమార్కులు పడ తాయి. దీన్నుంచి తప్పించుకొనేందుకు మరణించిన వ్యక్తి, పశువుల వివరాలను తెలుసుకొని, రికార్డుల్లోకి ఎక్కకుండా ఎంతో కొంత ఇచ్చేసి అధికారులు ఈ అపవాదుల్లోంచి బయ టపడుతుంటారని క్షేత్రస్థాయి విద్యుత్ సిబ్బంది చెప్తుంటారు. ఎక్కువగా ఈ తరహా వ్యవహారాలు పశు మరణాల్లో జరగు తుంటాయి. అయితే అన్ని సందర్భాల్లోనూ ఇవి అక్కరకు రావు. విద్యుత్ పంపిణీ సంస్థల నష్టాలను ఉచిత వ్యవసాయ విద్యుత్ సరఫరాలో కలిపేసినట్టే, మరణాల సంఖ్య తక్కువగా చూపేందుకు అధికారులు ఈ తరహా జిమ్మిక్కులకు పాల్పడుతుంటారని పలు సందర్భాల్లో తెలంగాణ విద్యుత్ నియంత్రణ మండలి (టీఎస్ఈఆర్సీ) బహిరంగ విచారణల్లో విమర్శలు వచ్చాయి. అధికారిక లెక్కల ప్రకారమే ఏటా సగటున 737 మంది మనుషులు, 1,600కి పైగా పశువులు మృత్యువాత పడుతున్నాయి.
ఇన్సులేటెడ్ లైన్లే దిక్కు
విద్యుత్ ప్రమాదాల నివారణకు ఇన్సులేటెడ్ లైన్లను వేయాలని ఎలక్ట్రికల్ ఇంజినీర్లు చెప్తున్నారు. అభివృద్ధి చెందిన దేశాల్లో ఈ తరహా లైన్లనే వేస్తారు. కరెంటు తీగలపై ఇన్సులేటెడ్ టేప్‌కు డామేజ్ జరిగితే, తక్షణం సంబంధిత కరెంటు ఆఫీసుకు మెసేజ్ వచ్చే సాంకేతికత అందుబాటులోకి వచ్చింది. దీనివల్ల లైన్ల నిర్వహణ సులభమవుతుంది. విద్యుత్ చౌర్యం తగ్గి, డిస్కంలకు ఆదాయం పెరుగుతుంది. భద్రతతో పాటు పర్యావరణ హితంగానూ ఉంటుందని చెప్తున్నారు.