Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మహిళలు నమ్మకానికి నిదర్శనం
- పట్టుదల సేవా భావన వారిలోనే ఎక్కువ :
బ్యాంకు సఖిలకు బయోమెట్రిక్ పరికరాల పంపిణీలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
'బ్యాంకుల్లో తీసుకున్న అప్పును సకాలంలో చెల్లించడంలో మహిళా సంఘాల్లో సభ్యులు ఎంతో నమ్మకాన్ని సాధించారు. వారు నేడు నమ్మకానికి నిదర్శనంగా మారారు. రాష్ట్ర ఏర్పాటుకు ముందు ఆ సంఘాలకు బ్యాంకులు రూ.2,3 వేల కోట్లకు మించి రుణాలిచ్చేవి కాదు. అదే నేడు రూ.15 వేల కోట్లు ఇస్తున్నారు..ఇంకా ఎక్కువ ఇచ్చేందుకు ముందుకొస్తున్నాయి. మహిళలు ఏదైనా చేయాలని లక్ష్యంగా పెట్టుకుంటే పట్టుదలతో పూర్తిచేస్తారు. వారిలో సేవాతర్పణ, దయాగుణం కూడా ఎక్కువే. మహిళల ద్వారానే గ్రామాల్లో బ్యాంకు లావాదేవీలు నిర్వహించేలా 'బ్యాంకు సఖి' కార్యక్రమాన్ని తీసుకొచ్చాం. గ్రామాల్లో భవిష్యత్ బ్యాంకు సఖిలదే. ఓపికగా పనిచేయండి..అభివృద్ధి చెందండి..నలుగురికీ ఆదర్శంగా నిలబడండి' అని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు పిలుపునిచ్చారు. గురువారం హైదరాబాద్‌లోని ఇంజినీర్స్ భవన్లో డ్వాక్రా సంఘాల ద్వారా, ఆయా సంఘాల మహిళలకు, ప్రజలకు బ్యాంకింగ్ సేవలను విస్తరిస్తూ అందించే కార్యక్రమంలో భాగంగా శిక్షణ పూర్తి చేసుకున్న బ్యాంకింగ్ సఖిలకు బయోమెట్రిక్ పరికరాల పంపిణీ కార్యక్రమాన్ని జ్యోతి వెలిగించి ప్రారంభించారు. ఎంపికైన 424 మంది బ్యాంకింగ్ సఖీలకు బయోమెట్రిక్ మిషన్లను అందజేశారు. డివైస్ పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..తెలంగాణ వచ్చాక ఇక్కడ ఎలాంటి అభివృద్దీ జరగలేదని కొందరు చేస్తున్న ప్రచారాన్ని తిప్పికొట్టారు. రాష్ట్రంలో ప్రతి ఇంటింటికీ తాగునీటిని అందిస్తున్న మాట వాస్తవం కాదా? అని ప్రశ్నించారు. గ్రామపంచాయతీలకు ప్రత్యేకంగా నిధులు కేటాయిస్తూ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం ద్వారా పల్లెల రూపురేఖలు మారిపోయాయనీ, పట్టణాల్లోని వారు కూడా ఊర్లల్లో ఇండ్లు కట్టుకుంటున్నారని చెప్పారు. గ్రామాల్లోని చెరువులన్నీ నిండుకుండల్లా మారాయనీ, భూగర్భజలాలు పెరగడంతో పాటు భూముల విలువలు పెరిగాయని వివరించారు. ఏ మారుమూల పల్లెకుపోయినా నేడు ఎకరా రూ.25 నుంచి 30 లక్షలు పలుకుతున్నదని చెప్పారు. కళ్యాణ లక్ష్మి, కేసీఆర్ కిట్లు, ఆరోగ్య లక్ష్మి వంటి పథకాలు గ్రామీణ ప్రజలకు ఎంతో దోహదపడుతున్నారు. బ్యాంకు సఖీ ద్వారా అనేక బ్యాంకు సేవలు గ్రామంలోనే అందుబాటులోకి రానున్నాయని తెలిపారు. సంఘ సభ్యుల పొదుపులు, అప్పు చెల్లింపులన్నీ సఖీ కేంద్రాల ద్వారానే చేయవచ్చునని చెప్పారు. రైతులు, ప్రజలు సఖిల ద్వారానే ఆర్థిక లావాదేవీలను నిర్వహించుకో వచ్చునని సూచించారు. ఐఐబీఎఫ్(ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్) సర్టిఫికేషన్ కోసం 430 మంది మహిళలు పరీక్ష రాయగా 424 మంది ఉత్తీర్ణత సాధించడం గొప్ప పరిణామన్నారు. ప్రస్తుతం రూ.10 వేలు విత్‌డ్రా చేసుకునే అవకాశం ఉందనీ, రెండు,మూడేండ్లలో దాన్ని రూ.50 వేలకు పెంచుతామని తెలిపారు. నిరుద్యోగ మహిళలకు ఉద్యోగ ఉపాధితో పాటు వారు చేసిన లావాదేవీలపై 5 నుండి 8 శాతం సేవా రుసుము లభిస్తుందని వివరించారు. భవిష్యత్తులో ప్రభుత్వ పథకాలను మహిళల ద్వారా అమలు జరిపే అవకాశాన్నీ పరిశీలిస్తామన్నారు. సాంకేతిక పరిజ్ఞానానికి సంబంధించి వారికి మరింత శిక్షణ ఇస్తామని హామీనిచ్చారు. మన ఊరు మన బడి పథకం ద్వారా 7 వేల కోట్లతో ప్రభుత్వ పాఠశాల లను అభివృద్ధి పరుస్తున్నామని చెప్పారు. గ్రామాల్లోని పిల్లలు సర్కారు బడుల్లో చదివేలా చూడాలన్నారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కార్యదర్శి సందీప్‌కుమార్ సుల్తానియా మాట్లాడుతూ..మహిళలు తమ ఆదాయ మార్గాలను పెంచుకోవాలంటే అందుకనుగుణంగా తమ నైపుణ్యాలను మెరుగుపరుచుకోవాలని సూచించారు. ప్రతి మహిళ, పౌరుడు ఇవ్వాళ ఏదో ఒక బ్యాంక్ తో అనుసంధానం కలిగి ఉన్నారని చెప్పారు. బ్యాంకుల సేవలు మరింత విస్తరించాల్సిన అవసరం ఉందని నొక్కిచెప్పారు. మహిళా సంఘాల సభ్యులతో మారుమూల ప్రాంతాలకు బ్యాంకింగ్ సేవలను విస్తరిస్తున్నామన్నారు. గోపాల మిత్ర తరహాలో పశు మిత్ర వంటి అనేక కార్యక్రమాలు అమలు అవుతున్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న నాబార్డు జీఎం సెల్వమ్, ఎస్బీఐ డీజీఎం నటరాజన్, అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్ రాజ కిషోర్, సెర్ప్ బ్యాంకు లింకేజీ డైరెక్టర్ వైఎన్ రెడ్డి, వివిధ బ్యాంకుల ప్రతినిధులు, అధికారులు, రాష్ట్రం నలు మూలల నుంచి వచ్చిన స్వయం సహాయక సంఘాల బ్యాంకింగ్ సఖీ లు పాల్గొన్నారు.