Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రౌండ్ టేబుల్ నిర్ణయం
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్
కాళేశ్వరం ముంపుపై నిజనిర్ధారణ చేయాలని తెలంగాణ జర్నలిస్టుల అధ్యయన వేదిక ఆధ్వర్యంలో జరిగిన రౌండ్‌టేబుల్ సమావేశం తీర్మానించింది. ఇందుకోసం ప్రత్యేకంగా నిపుణులతో కూడిన కమిటీ వేయాలని నిర్ణయించింది. వేధిక అధ్యక్షులు బి. వేణుగోపాల్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి సాధిక్ పర్యవేక్షణలో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశానికి ఆయా పార్టీల నేతలు, రిటైర్డ్ ఇంజినీర్లు, సీనియర్ జర్నలిస్టులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఈటల రాజేందర్ మాట్లాడుతూ ప్రాజెక్టులపై జాగ్రత్తలు తీసుకోవాలని అర్థమవుతున్నదన్నారు. నేనే డిజైనర్, నేనే సృష్టికర్త అని సీఎం కేసీఆర్ అనుకునేవారని, ఇంజినీర్లు చెబితే వినేవారు కాదన్నారు. వరదలతో సంబంధం లేకుండా పంటనష్టపోతున్న రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్మెన్, మాజీ ఎంపీ మధు యాష్కిగౌడ్ మాట్లాడుతూ మేఘాలు బద్దలు కాలేదు, మెఘా అవినీతి బద్దలైందని అని వ్యాఖ్యానించారు. సీపీఐ నేత పశ్య పద్మ మాట్లాడుతూ కాళేశ్వరం ప్రాజెక్టుపై అఖిలపక్షం వేయాలని కోరినా, అప్పట్లో సీఎం పట్టించుకోలేదని విమర్శించారు. ఆ ప్రాజెక్టు లక్ష్యాలు నెరవేరాయా ? లేదా ? అనేది ప్రభుత్వమే చెప్పాలని డిమాండ్ చేశారు. తెలంగాణ జన సమితీ రాష్ట్ర అధ్యక్షులు కోదండరామ్ మాట్లాడుతూ కాళేశ్వరం ముంపుపై ప్రభుత్వం విచారణ చేసినా , చేయకున్నా, మనం మాత్రం ఒక నిజనిర్ధారణ కమిటీ వేద్దామని ప్రతిపాదించారు. శాశ్వత పరిష్కారం కోసం ఎదురుచూస్తున్నారని అన్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ రాష్ట్ర కన్వీనర్ ఇందిరాశోభన్ మాట్లాడుతూ కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ చేయాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ చేసిన ప్రతితప్పులో బీజేపీకి భాగస్వామ్యం ఉన్నదని వ్యాఖ్యానించారు. రిటైర్డ్ ఇంజినీర్ల ఫోరం రాష్ట్ర అధ్యక్షులు శ్యాంప్రసాద్‌రెడ్డి మాట్లాడుతూ కాళేశ్వరం ముంపులో ప్రకృతి వైపరీత్యానికి మానవ తప్పిదం తోడైందని చెప్పారు. రెండు పంపులు మునిగేసరికి లక్ష కోట్లు నీళ్లపాలయ్యాయని అనడం సరికాదని వ్యాఖ్యానించారు. ఈ కార్యక్రమంలో రిటైర్డ్ ఇంజినీర్లు లక్ష్మన్, గోవర్థ్న్, రమేశ్‌రెడ్డి,సుబ్బారావు , సీనియర్ జర్నలిస్టులు పీవీ శ్రీనివాస్, సారథి తదితరులు పాల్గొన్నారు.