Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పలు జిల్లాలకు రెడ్, ఆరెంజ్ హెచ్చరిక
- రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వర్షం
- 20.68 సెంటీమీటర్ల వర్షపాతం
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
వరుసగా వారం రోజుల పాటు కురిసిన భారీ వర్షాలు..ఉప్పొంగిన వాగులు, వంకలు, నదులతో భారీ నష్టపోయిన ప్రజానీకం తేరుకోకముందే మళ్లీ వరుణుడు రాష్ట్రంపై తన విశ్వరూపాన్ని ప్రదర్శిస్తున్నాడు. శుక్రవారం ఉదయం నుంచి రాత్రి వరకు రాష్ట్రంలోని ఎక్కువ ప్రాంతాల్లో వర్షం పడుతూనే ఉన్నది. దీంతో ప్రాజెక్టులకు వరద పోటెత్తుతున్నది. వచ్చే రెండ్రోజులు కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రధాన సంచాలకులు కె.నాగరత్న తెలిపారు. నాలుగు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు. ఆ జాబితాలో మహబూబాబాద్, జనగాం, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి జిల్లాలున్నాయి. ఆరెంజ్ అలర్ట్ జాబితాలో ఖమ్మం, వరంగల్(రూరల్), వరంగల్(అర్బన్), నల్లగొండ, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలున్నాయి. రాష్ట్రంలో శుక్రవారం విస్తారంగా వర్షం కురిసింది. ఉదయం నుంచి రాత్రి వరకు చాలా ప్రాంతాల్లో ముసురేసింది. మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లిలో కుండపోత వర్షం పడింది. అక్కడ (శుక్రవారం రాత్రి 9 గంటల వరకు) 20.68 సెంటీమీటర్ల వర్షపాతం రికార్డయింది. హైదరాబాద్ నగరంలో ఎక్కువ ప్రాంతాల్లో ముసురు పడుతూనే ఉన్నది. పలుచోట్ల మోస్తరు నుంచి భారీ వర్షం కూడా పడింది. రాష్ట్రంలో 14 ప్రాంతాల్లో అత్యంత భారీ, 111 ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. శుక్రవారం రాత్రి తొమ్మిది గంటల వరకు 750కిపైగా ప్రాంతాల్లో వర్షపాతం నమోదైంది. మహబూబాబాద్, జనగాం, భద్రాద్రి కొత్తగూడెం, సూర్యాపేట, యాదాద్రిభువనగిరి, ఖమ్మం, నల్లగొండ జిల్లాల్లో పలుచోట్ల అత్యంత భారీ వర్షాలు పడ్డాయి.