Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- దేశ నిర్దిష్ట పరిస్థితులకు అనుగుణంగా విధానం
- డీవీకే సంతాప సభలో వక్తలు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
పాలకుల ఫాసిస్టు విధానాల రద్దుకోసం ఐక్య కమ్యూనిస్టు ఉద్యమాల అవశ్యకతను దుర్గెంపుడి వెంకట కృష్ణ(డీవీకే) నొక్కి చెప్పారని పలువురు వక్తలు వివరించారు. శనివారం హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో సీపీఐ(ఎంఎల్) ప్రజాపంథా ఆధ్వర్యంలో ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కె.రంగయ్య అధ్యక్షతన సంతాప సభ జరిగింది. సభ ప్రారంభానికి ముందు డీవీకే చిత్రపటానికి పూలమాల వేసి ఆయన అమరత్వాన్ని స్మరిస్తూ రెండు నిముషాలు మౌనం పాటించారు. ఈ సందర్భంగా ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి పోటు రంగారావు మాట్లాడుతూ దేశంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికై ఉద్యమాలు తప్ప మరో మార్గం లేదని చెప్పారు. దేశంలో రోజురోజుకు ఫాసిస్టు దోరణులు పెరుగుతున్నాయనీ, వీటికి వ్యతిరేకంగా ఐక్య ఉద్యమాలను బలోపేతం చేయాలంటూ డివీకే భావించారని గుర్తుచేశారు. ఆయన సమసమాజ నిర్మాణం కోసం నిరంతరం పరితపించిన గొప్ప విప్లవయోధుడని చెప్పారు. సిద్దాంతాన్ని వల్లెవేయటమే కాదు..దాన్ని ఆచరించాలని చెప్పడమే గాక, అందుకనుగుణంగా పనిచేసిన గొప్ప ఆచరణవాదని తెలిపారు. 53ఏండ్లపాటు ప్రజా ఉద్యమంలో పనిచేస్తూ అహర్నిశలు ప్రజల బాగుకోసం పరితపించారని వివరించారు. భారత దేశ నిర్దిష్ట పరిస్థితులకు అనుగుణంగా కమ్యూనిస్టు సిద్ధాంతాన్ని అభివృద్ధి చేయాలనీ, విశేష ప్రజారాశులను ఉద్యమంలో భాగస్వాములను చేసేందుకు తపించారని గుర్తుచేశారు.దేశంలో మారిన పరిస్థితులకు అనుగుణంగా విధానాన్ని రూపొందించుకోవటానికి 40 ఏండ్ల నుంచి పోరాడుతూ వచ్చారని తెలిపారు. రివిజనిస్టు, మితవాదంటూ ఆయనపై రకరకాలుగా ముద్రలేసినా తాను నమ్మిన సిద్ధాంతం కోసం నికరంగా నిలబడ్డారని చెప్పారు.మాటల్లో అతివాదాన్ని వల్లిస్తూ..చేతల్లో అవకాశవాదన్ని అమలు చేస్తున్న విధానంపై రాజీలేని పోరాటం చేశారన్నారు.
సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు డీజీ నర్సింహారావు మాట్లాడుతూ దేశంలో సంక్లిష్ట పరిస్థితులు నెలకొన్నాయని చెప్పారు.మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న మతోన్మాద విధానాలు దేశాన్ని తిరోగమనంలోకి తీసుకుపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో అనుభవం ఉన్న కమ్యూనిస్టు యోధులు డీవీకే లాంటి నాయకులు లేకపోవటం లోటేనన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజాతంత్ర, కమ్యూనిస్టు ఐక్య ఉద్యమాలను బలోపేతం చేయాల్సిన అవశ్యకత పెరిగిందని చెప్పారు. సీపీఐ కార్యదర్శి వర్గ సభ్యులు బాలమల్లేశ్ మాట్లాడుతూ అంటరాని తనానికి వ్యతిరేకంగా, కార్మిక హక్కుల కోసం డీవీకే పోరాడారని చెప్పారు. బీడీ కార్మికోద్యమాన్ని నిర్మించారని చెప్పారు. న్యూడెమోక్రసీ రాష్ట్ర నాయకులు జేవీ చలపతి రావు,సీపీఐ(ఎంఎల్) రెడ్‌స్టార్ రాష్ట్ర నాయకలు సైదులు, ఎంసీపీఐ(యు) రాష్ట్ర కార్యదర్శి రవి, ఎస్యుసీఐసీ రాష్ట్ర కార్యదర్శి మురహరి, సీపీఐ(ఎంఎల్) రెడ్‌ప్లాగ్ రాష్ట్ర కార్యదర్శి ప్రసాద్, ప్రజాకవి జయరాజ్, ప్రజాపంథా రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కె రమ, కేజీ రామచందర్, ఆర్ చంద్రశేఖర్, ఆయా ప్రజాసంఘాల అధ్యక్ష, కార్యదర్శులతోపాటు డీవీకే తమ్ముళ్లు, కూతురు దీప మాట్లాడారు.