Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏండ్లు పూర్తవుతున్న సందర్భంగా స్వాతంత్య్ర దినోత్సవం రోజైన 15 అగస్టుకు ముందు ఏడ్రోజులు అనంతరం ఏడ్రోజులు మొత్తం 15 రోజుల పాటు రాష్ట్రంలో 'భారత స్వాతంత్య్ర వజ్రోత్సవ ద్విసప్తాహ' కార్యక్రమాలు నిర్వహించాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు అధికారులను ఆదేశించారు. స్వాతంత్య్ర సమరయోధులు, మహనీయుల త్యాగాలు, పోరాట ఫలాలు నేటి తరానికి అర్థమయ్యేలా, దేశభక్తిని ద్విగుణీకతం చేసేలా రాష్ట్రవ్యాప్తంగా కార్యక్రమాలు రూపొందించాలని చెప్పారు. గడప గడపకూ, వాడవాడలా జాతీయ పతాకాన్ని ఎగురవేయాలనీ, క్రీడాపోటీలు, వక్తృత్వ, వ్యాసరచన పోటీలు, కవిసమ్మేళనాలు, జాతీయ భావాలను రగలించే సాంస్క్రతిక కార్యక్రమాలను నిర్వహించాలని సూచించారు. ఈ వేడుకల నిర్వహణపై శనివారంనాడాయన ప్రగతి భవన్లో ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. భారత దేశం భిన్న సంస్కృతులు, విభిన్న భాషలు, మతాలు, ఆచారవ్యవహారాలు, సాంప్రదాయాలతో అత్యున్నత ప్రాపంచిక సార్వజనీన విలువలతో భిన్నత్వంలో ఏకత్వాన్ని కొనసాగిస్తున్నదని కొనియాడారు. దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత భవిష్యత్ తరాలపై ఉన్నదనీ, ఆ స్ఫూర్తితో కార్యక్రమాల రూపకల్పన చేయాలని ఆదేశించారు. గడప గడపనా జాతీయ జెండా ఎగురేయాలనీ, దానికోసం కోటి 20 లక్షల త్రివర్ణ పతాకాల తయారీకి ఏర్పాట్లు చేయాలని చెప్పారు. ఇందుకు గద్వాల, నారాయణ పేట్, సిరిసిల్ల, పోచంపల్లి, భువనగిరి, వరంగల్ తదితర ప్రాంతాల్లోని చేనేత పవర్ లూమ్ కార్మికులకు ఆర్డర్లు ఇవ్వాలని ఆదేశించారు. సప్తాహ విధి విధానాల రూపకల్పన కోసం ప్రత్యేక కమిటీని నియమించాలని చెప్పారు. ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు సహా సర్పంచ్ స్థాయి ప్రజా ప్రతినిధులతో పాటు, ప్రభుత్వ కార్యదర్శులు, ఉన్నతాధికారులు వారి లెటర్ ప్యాడ్లమీద జాతీయ జెండా బొమ్మను ముద్రించుకోవాలని సూచించారు. అలాగే మీడియా యాజమాన్యాలు కూడా 15 రోజుల పాటు పత్రికల మాస్టర్ హెడ్స్ మీద జాతీయ పతాక చిహ్నాన్ని ముద్రించాలని, టీవీ ఛానల్స్‌లో ఆ 15 రోజులు జాతీయ పతాక చిహ్నాం నిత్యం కనిపించేలా ప్రసారం చేయాలని విజ్జప్తి చేశారు.