Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
చంచల్గూడ ప్రెస్ ప్రాంగణాన్ని పరిరక్షించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని సీఐటీయూ డిమాండ్ చేసింది. ఈ మేరకు ఆ సంఘం రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు చుక్క రాములు, పాలడుగు భాస్కర్ ఒక ప్రకటన విడుదల చేశారు.
'హైదరాబాద్ చంచల్గూడ ప్రభుత్వ ప్రింటింగ్ ప్రెస్ను సుమారు 130 సంవత్సరాల క్రితం ప్రభుత్వం స్థాపించింది.
పోలీసు, వైద్య ఆరోగ్యం, విద్య తదితర సర్వీసు శాఖల వలెనే ఈ ప్రింటింగ్ ప్రెస్ విభాగం కూడా ప్రాధాన్యత కలిగిందిగా భావించి సుమారు 20 ఎకరాల స్థలాన్ని సంస్థకు కేటాయించింది. రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన అనేక ముఖ్యమైన బ్యాలెట్ పేపర్ ముద్రణ, రాష్ట్ర గెజెట్ల ప్రచురణ, ఇతర శాఖలకు అవసరమైన ప్రచురణ పనులను ఈ ప్రెస్ నిర్వహిస్తున్నది. అందులో ప్రస్తుతం 500 మందికి పైగా ఉద్యోగులు పనిచేస్తున్నారు. ప్రెస్కు చెందిన 20 ఎకరాల్లో ట్రాన్స్కో, ఫైర్ సర్వీస్ స్టేషన్కు ఎనిమిదెకరాలు కేటాయించగా, మిగిలిన 12 ఎకరాలను ఆంధ్ర బిల్డింగ్ (స్టేషనరీ), పరిపాలనా విభాగం, కమిషనర్ కార్యాలయం, అకౌంట్స్ వింగ్, ఫ్యాక్టరీ వింగ్, ప్రింటింగ్ టెక్నికల్ వింగ్ ఆఫీసుల కోసం వినియోగిస్తున్నారు. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రెస్ ప్రాంగణంలోని స్థలాన్ని ప్రభుత్వ అవసరాల కోసం వినియోగించాలని యోచిస్తున్నట్టు వస్తున్న ప్రచారం ఉద్యోగుల్లో ఆందోళన కలిగిస్తున్నది. అందువల్ల అత్యంత ప్రతిష్టాత్మకమైన ప్రభుత్వ ప్రింటింగ్ ప్రెస్ను పరిరక్షించేందుకు రాష్ట్ర ప్రభుత్వం స్పష్టమైన నిర్ణయం తీసుకోవాలి ....' అని వారు కోరారు.
'చంచల్గూడ ప్రింటింగ్ ప్రెస్ ఉమ్మడి రాష్ట్రంలోనూ, తెలంగాణ రాష్ట్రంలోనూ ఎంతో గుర్తింపు పొందింది. ఈ ప్రెస్ కేవలం వందలాదిమంది ఉద్యోగుల కోసం మాత్రమే నెలకొల్పలేదు.
రాష్ట్ర ప్రభుత్వ కార్యకలాపాల్లో ముఖ్యంగా సాధారణ ఎన్నికల సందర్భంతో పాటుగా అనేక పరిపాలనా విభాగానికి చెందిన ప్రచురణల కోసం ఇది పని చేస్తున్నది. ఈ నేపథ్యంలో ఈ ప్రెస్ను పరిరక్షించడం తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాల రీత్యా కూడా అవసరం...' అని వారు పేర్కొన్నారు..