Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అలుగుపారుతున్న చెరువులు
- ఉధృతంగా ప్రవహిస్తున్న వాగులు
- తెరుచుకున్న ప్రాజెక్టుల గేట్లు
- పొలాల్లో వరద
- తెగిన రోడ్లు.. రవాణా బంద్
- పాత భవనం కూలి ఇద్దరు మృతి
నవతెలంగాణ- విలేకరులు
ముసురు వర్షం మళ్లీ ముప్పు తెచ్చింది.. గత వారం వర్షం అనంతరం ఇప్పుడిప్పుడే శాంతిస్తున్న చెరువులు, వాగులు, ప్రాజెక్టుల్లోకి మూడ్రోజులుగా మళ్లీ కురుస్తున్న ముసురు, భారీ వర్షంతో నీరు పెద్దఎత్తున చేరింది. చెరువులు అలుగు పోస్తున్నాయి. రోడ్లపై నుంచి వరద ప్రవాహంతో రాకపోకలు బంద్ అయ్యాయి. శిథిల భవనాలు కూలాయి. వరంగల్‌లో ఇద్దరు ప్రాణం కోల్పోయారు. సూర్యాపేట జిల్లాలో నాట్ల కోసం వచ్చి అక్కడే చిక్కుకుపోయిన కూలీలను శనివారం ఉదయానికి అధికారులు పడవల ద్వారా సురక్షితంగా తరలించారు.
ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలం బీరోలు గ్రామంలోని పెద్ద చెరువు అలుగుపడింది. బీరోలు నుంచి బందంపల్లి రోడ్డుపై నుంచి నీరు ప్రవహిస్తోంది. కూసుమంచి మండలంలోని పాలేరు రిజర్వాయర్ అలుగు నీరు జాతీయ రహదారిపై ప్రవహిస్తోంది. మధిర మండల కేంద్రలోని సబ్ రిజిస్టార్, ఫారెస్టు ఆఫీస్, స్త్రీ శక్తి భవనాలకు వెళ్లే దారిలో మోకాళ్ల లోతు నీరు నిలువడంతో సీపీఐ(ఎం) నాయకులు నాట్లువేసి నిరసన తెలిపారు.
ఛత్తీస్‌గఢ్ దండకారణ్యంలో కురుస్తున్న వర్షాలతో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలంలోని తాలిపేరు ప్రాజెక్టుకు భారీగా వరద నీరు వస్తోంది. 25 గేట్లు ఎత్తి 1,78,654 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఆళ్లపల్లి మండలం రాఘవపురం గ్రామానికి చెందిన పాయం సారయ్య తన ట్రాక్టర్లో మార్కోడ్ బీట్ ఆఫీస్‌కు మొక్కలు సరఫరా చేసి శుక్రవారం రాత్రి వస్తుండగా మార్గ మధ్యలో ఉన్న పాల వాగు ప్రవాహంలో కొట్టుకుపోయింది. ఫారెస్టు అధికారులు తనకు కొత్త ట్రాక్టర్ ఇప్పించాలని రైతు శనివారం వాగు వద్ద రోధిస్తూ డిమాండ్ చేశారు. మండలంలోని రాఘవపురం సమీపంలో కాల్వర్టు తెగిపోయింది.
ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో పది రోజులుగా ఎడతెరపి లేకుండా ముసురుగా వర్షం కురుస్తూనే ఉంది. జూరాల 10 గేట్లు ఎత్తారు. శ్రీశైలం ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా, శనివారం డ్యాంలో నీటిమట్టం 882.50 అడుగులకు చేరింది. మూడు గేట్లు ఎత్తి సాగర్, నెట్టెంపాడు ప్రాజెక్టులకు నీటిని వదులుతున్నారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. కుంటలు, చెరువులు అలుగుపారుతున్నాయి. చెక్‌డ్యాంలు నిండి ప్రవహిస్తున్నాయి. పంటలు నీటమునిగాయి. కొన్ని ప్రాంతాల్లో రోడ్లు తెగిపోయి రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. దౌల్తాబాద్ మండల పరిధిలోని చెరువులన్నీ నిండిపోయాయి. కోహెడ మండలం బస్వాపూర్ వద్ద మోయతుమ్మెద వాగు ఉధృతంగా పారుతోంది. మిరుదొడ్డి మండలం కూడవెల్లి వాగు, వెల్దుర్తి మండలంలోని హల్దీ ప్రాజెక్ట్ పొంగిపొర్లుతోంది. కొల్చారం మండలంలో పంటలన్నీ నీటమునిగాయి.
ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో శుక్రవారం రాత్రి నుంచి శనివారం మధ్యాహ్నం వరకు ఎడతెరిపిలేకుండా వర్షం కురిసింది. కామారెడ్డిలో భారీ వర్షపాతం నమోదైంది. నిజాంసాగర్ ప్రాజెక్టు 14 గేట్లు ఎత్తి లక్ష క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. బ్యాక్ వాటర్‌తో నాగిరెడ్డిపేట్ మండలంలోని పలు గ్రామాల్లో పంటపొలాలు నీట మునిగాయి. కౌలాస్ ప్రాజెక్టు గేట్లు ఎత్తడంతో దిగువ ప్రాంతాల్లో పంటలు నీటమునిగాయి.
సూర్యాపేట జిల్లా అనంతగిరి మండలంలో పలు గ్రామాలు జలమయమయ్యాయి. పాలేరు వాగు విస్తారంగా పొంగి పొర్లడంతో వాగు వెంబడి ఉన్న పొలాల్లోని విద్యుత్ మోటార్లు సుమారు వందకు పైగా నీటిలో మునిగాయి. గొండ్రియాల గ్రామంలో పాలేరు వాగుపై నిర్మించిన వంతెనపై నుంచి వరద ప్రవహిస్తుండటంతో ఆవాస గ్రామమైన రంగాపురం గ్రామానికి రాకపోకలు నిలిచిపోయాయి. చనుపల్లి, పాలవరం, మొగలైకోట, కిష్టాపురం, కొత్తగూడెం గ్రామాల్లో నూతనంగా నిర్మించిన చెక్‌డ్యామ్‌లు నీట మునిగాయి. నాగారం మండలంలోని బిక్కేరు వాగును తహసీల్దార్ హరిశ్చంద్రప్రసాద్ పరిశీలించారు.
కూలీలను ఒడ్డుకు చేర్చిన అధికారులు
మహబూబాద్ జిల్లా మరిపెడ బంగ్లా మండలం చౌళ్లతండాకు చెందిన 23 మంది వ్యవసాయకూలీలు సూర్యాపేట జిల్లా మద్దిరాల మండలం ముకుందాపురంలోని రైతు పొలంలో నాట్లు వేశారు. సాయంత్రం తిరుగు ప్రయాణం కాగా, అప్పటికే కురుస్తున్న భారీ వర్షంతో వెళ్లలేని పరిస్థితి నెలకొంది. ముకుందాపురం కొత్తపల్లి మీదుగా భారీ ఎత్తున వరద ప్రవహించడంతో పొలంలోనే చిక్కుకుపోయారు. చివరికి సెల్ ఫోన్ ద్వారా 100కు సమాచారం అందించారు.
సూర్యాపేట ఆర్డీవో రాజేంద్రకుమార్, మద్దిరాల తహసీల్దార్ అమిన్సింగ్, ఎస్ఐ నర్సింగ్ వెంకన్న సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. క్రమక్రమంగా వరద ఉధృతి పెరగడంతో ఫోన్ ద్వారా కూలీలకు ఎప్పటికప్పుడూ ధైర్యం చెబుతూ వచ్చారు. చివరికి అధికారులు డ్రోన్ సహాయంతో 23 మంది కూలీలకు భోజనం అందించారు. సమాచారాన్ని భద్రాచలంలోని ఎన్డీఆర్ఎఫ్ అధికారులకు అందించారు. వారు రెండు పడవలతో రాత్రికి రాత్రే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. పరిసరాలు చీకటిమయంగా ఉండటంతో సహాయ చర్యలకు ఆటంకంగా మారాయి. శనివారం ఉదయం ఐదు గంటల నుంచి కూలీలను రక్షించే చర్యలు చేపట్టిన అధికారులు.. పడవలను ఉపయోగించి రెండు గంటల అనంతరం కొత్తపల్లి ఒడ్డుకు చేర్చారు. అధికార యంత్రాంగమంతా సంఘటనాస్థలంలోనే రాత్రంతా కూలీలను రక్షించే ప్రయత్నం చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలంలో సంగెం వద్ద మూసీవంతెనపై నుంచి నీరు ఉధృతంగా ప్రవహిస్తోంది.
తెగిన రోడ్లు
ఉమ్మడి వరంగల్ జిల్లా పరిధిలోని హనుమకొండ, వరంగల్, మహబూబాబాద్, ములుగు జిల్లాల్లో ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎడతెరిపి లేకుండా వర్షాలు కురిశాయి. వరంగల్ నగరంలో వర్షానికి శుక్రవారం రాత్రి శిథిలావస్థలో ఉన్న ఇల్లు కూలి ఇద్దరు మృతిచెందారు. చెరువులు పొంగి పొర్లుతున్నాయి. ములుగు నుంచి ఏటూరునాగారం వెళ్లే ప్రధాన రహదారిపై తాడ్వాయి మండలంలోని పస్రా వద్ద రోడ్డు తెగిపోవడంతో బస్సులను నార్లాపూర్, మేడారం మీదుగా మళ్లించారు. జనగామ జిల్లాలోని స్టేషన్ ఘన్పూర్ నుంచి పాలకుర్తి మధ్య రోడ్డు తెగడంతో రాకపోకలు నిలిచిపోయాయి.