Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
సమయం వచ్చినప్పుడు పార్టీ మారడం చారిత్రక అవసరమని మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి అన్నారు. మునుగోడు ప్రజలు కోరుకుంటే ఉప ఎన్నిక వస్తుందని చెప్పారు.ఆదివారం హైదరాబాద్‌లోని తన నివాసంలో ఆయన విలేకర్లతో మాట్లాడారు. పార్టీ మార్పు ఆరోపణలపై ఈ సందర్భంగా ఆయన స్పందించారు. నేను పార్టీ మారాల్సి వస్తే ప్రజలతో మాట్లాడిన తర్వాతే తగిన నిర్ణయం తీసుకుంటానని చెప్పారు. అంతేకానీ సీఎం కేసీఆర్ వ్యూహంలో పావును కాదల్చుకోలేదని స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ నిర్ణయాలు ఎప్పటికప్పుడు మారతాయనీ, ఆ పార్టీ బలహీనపడిందన్నారు. కేసీఆర్‌ను ఓడించే శక్తి బీజేపీకే ఉందన్నారు. జైలుకు వెళ్లి వచ్చిన వారితో తాను నీతులు చెప్పించుకోలేనన్నారు. 'కాంగ్రెస్ అంటే అభిమానం.. సోనియా అంటే గౌరవం' అన్నారు. కాంగ్రెస్ కొన్ని తప్పుడు నిర్ణయాలు తీసుకున్నా తానేమీ అనలేదన్నారు. ఉద్యమంతో సంబంధం లేని వారికి కాంగ్రెస్ బాధ్యతలు ఇచ్చారని విమర్శించారు. పార్టీ మారుతున్నానంటూ గత నాలుగు రోజులుగా ప్రచారం జరుగుతున్నదన్నారు. అందరి సమక్షంలోనే కేంద్ర హోంమంత్రి అమిత్‌షాను కలిశాననీ, రాజకీయ, రాజీనామా అంశాలు మా మధ్య చర్చకు రాలేదని తెలిపారు. రాష్ట్రాన్ని టీఆర్ఎస్ ప్రభుత్వం అప్పుల పాలుజేసిందని అమిత్‌షాకు చెప్పినట్టు వివరించారు. ఉపఎన్నిక వస్తుందంటూ మీడియాలో ప్రచారం చేయిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మునుగోడు నియోజకవర్గంలోని గట్టుప్పల్‌ను మండలంగా ప్రకటించి, ఆ మండల నేతలను చేర్చుకుంటున్నారని చెప్పారు. హుజూరాబాద్ ఓటమి తర్వాత టీఆర్ఎస్ గ్రాఫ్ పడిపోయిందన్నారు. మునుగోడులో ఉప ఎన్నిక వస్తే గెలవాలని సీఎం కేసీఆర్ సమీక్షలు చేస్తున్నారని చెప్పారు. అక్కడ ఉప ఎన్నిక రావాలని తాను కోరుకోవడం లేదన్నారు.