Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
ప్రజా సంక్షేమం, అభివృద్ధికి చిరునామా తెలంగాణ రాష్ట్రం అని ఎస్సీ అభివృద్ధి శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ చెప్పారు. కేటీఆర్ పుట్టిన రోజు సందర్భంగా ఆదివారం హైదరాబాద్‌లోని చాదర్‌ఘాట్ వద్ద వికలాంగుల ఆర్థిక సహకార సంస్థ చైర్మెన్ కె వాసుదేవరెడ్డి ఆధ్వర్యంలో నరాల బలహీనత, వెన్నుపూస గాయంతో బాధపడుతున్న 71 మందికి మంత్రి బ్యాటరీ వీల్ ఛైర్స్ అందజేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ,వికలాంగుల సమస్యల పరిష్కారం పట్ల కేసీఆర్ సానుకూల దృక్పథంతో ఉన్నారనీ, వీరి సంక్షేమానికి, ఉన్నతికి దేశంలో మరెక్కడా లేని విధంగా పథకాలు ప్రవేశపెట్టి అమలు చేస్తున్నారని తెలిపారు. వికలాంగుల సంక్షేమాని కి గతంలో ఏటా రూ. 5 కోట్ల బడ్జెట్ మాత్రమే ఉండేదనీ, కేసీఆర్ సీఎం అయ్యాక ప్రతి ఏడాది బడ్జెట్‌ను పెంచుకుంటూ పోతున్నారన్నారు. గతంలో నెలకు రూ.500 పింఛను ఇవ్వగా, ఇప్పుడు సుమారు రూ.5లక్షల మందికి 3,016చొప్పున పింఛన్లు ఇస్తున్న విషయాన్ని గుర్తు చేశారు. ఇందుకోసం ఏటా రూ. 1,800 కోట్ల ఖర్చవుతున్నదని కొప్పుల తెలిపారు. ఆరోగ్య పరిరక్షణకు ప్రతి నెల మెడికల్ కిట్ ఇవ్వాలనే డిమాండ్‌ను సీఎం దృష్టికి తీసుకుపోయి సానుకూలంగా పరిష్కరిస్తానని హామీనిచ్చారు. వికలాంగుల సంక్షేమం విషయంలో ఇతర రాష్ట్రాలలో మంచి కార్యక్రమాలు ఉంటే అధికారులతో కలిసి పరిశీలించి తెలంగాణలో కూడా అమలు చేస్తామన్నారు. డాక్టర్ కె.వాసుదేవరెడ్డి మాట్లాడుతూ, వికలాంగులు ఆత్మ స్థైర్యంతో,గౌరవంతో ముందుకు సాగేలా పథకాలు అమలు చేస్తున్నామన్నారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా వికలాంగులకు అవసరమైన ఉపకరణాలను ఉచితంగా అందిస్తున్న విషయాన్ని గుర్తు చేశారు. ఇప్పటి వరకుచ రూ.24కోట్లు వెచ్చించి 17వేల మందికి సహాయ ఉపకరణాలను అందించామని తెలిపారు. నరాల బలహీనత, వెన్నుపూస గాయంతో బాధపడుతున్న 71 మందికి, నలుగురు పరిశోధనా విద్యార్థులకు బ్యాటరీ వీల్ చైర్లు అందజేశారు. అంతకు ముందు సంస్థ ఆవరణలో అంధ బాలికలతో కలిసి మంత్రి, చైర్మెన్ మొక్కలు నాటారు.కార్యక్రమంలో వికలాంగుల అడ్వయిజరీ బోర్డు సభ్యుడు నారా నాగేశ్వరరావు, సంస్థ జనరల్ మేనేజర్ ప్రభంజన్ రావు తదితరులు పాల్గొన్నారు.