Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పాలకు గిట్టుబాటు ధర కల్పించాలి
- కేంద్ర సర్కారు చర్యలకు నిరసనగా
- సంతకాల సేకరణ : తెలంగాణపాడి రైతుల సంఘం
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
పాలు, పాల ఉత్పత్తులపై కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ విధించడాన్ని నిరసిస్తూ...తెలంగాణ పాడి రైతుల సంఘం సంతకాల సేకరణ కార్యక్రమాన్ని చేపట్టింది. వెంటనే జీఎస్టీని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేసింది. పాలకు గిట్టుబాటు ధర కల్పించాలని కోరింది. ఆదివారం హైదరాబాద్లోని సుందరయ్య పార్క్ వద్ద ఆ సంఘం ఆధ్వర్యంలో సంతకాల సేకరణ కార్యక్రమాన్ని ప్రొఫెసర్ అరిబండి ప్రసాదరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా అరిబండి మాట్లాడుతూ పెరుగు, లస్సీ, మజ్జిగ వంటి పాకెట్లపై ఐదుశాతం, పాల సేకరణ, శీతలీకరణ, పాల ఉత్పత్తుల తయారీకి వినియోగించే పరికరాలు, యంత్రాలపైన 12 శాతం నుంచి 18శాతం జీఎస్టీ విధించిందని విమర్శించారు. ఈ ప్రతిపాదనలను జీఎస్టీ కౌన్సిల్ అమోదిస్తే సహకార పాడి డెయిరీలపై మోయలేని భారం పడుతుందన్నారు. ఈ భారాన్ని పాలు, మజ్జిగ, లస్సీ, పెరుగు వినియోగించుకునే ప్రజలపై వేయాల్సి వస్తుందన్నారు. పాలు సరఫరా చేసే గ్రామ పాల సొసైటీలపై దీని ప్రభావం పడుతుందని అన్నారు. రైతులకు చెల్లించే పాల ధరలో కోతలు విధించడం, బోనస్ తగ్గించడం తప్పనిసరి అవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఫలితంగా పాడితో జీవిస్తున్న పేద రైతులకు భారమవుతుందనీ, పాల సొసైటీలన్నీ మూతపడతాయన్నారు. జీఎస్టీ రద్దు కోసం రాష్ట్ర ప్రభుత్వం కేంద్రప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని కోరారు. ఇప్పటికే ఖర్చులు పెరిగిపోయి రైతులకు గిట్టుబాటు కాకుండా ఉన్నదని చెప్పారు. అఖిల భారత పాడి రైతుల సమాఖ్య కేంద్ర కమిటీ సభ్యుడు మూడ్ శోభన్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు లీటరుకు రూ నాలుగు రూపాయలు సబ్సిడీ ఇస్తామని ప్రకటించి ఇవ్వడం లేదని విమర్శించారు. పాల ఉత్పత్తులపై, పరికరాలపై పెంచిన జీఎస్టీ రద్దు చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఇస్తామన్న లీటరుకు నాలుగు రూపాయల బోనస్ రైతులందరికీ ఇవ్వాలని కోరారు. పాడి గేదెల కొనుగోలు కోసం 50 శాతం సబ్సిడీ రుణాలు, దాణా, పచ్చిగడ్డి ఇచ్చి జీవనోపాధి కల్పించాలన్నారు. మినీగోకులం షెడ్ల బిల్లుల బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేశారు. రైతు కష్టపడి ఉత్పత్తి చేసిన లీటరు పాల ధర, బహుళజాతి కంపెనీలు అమ్ముతున్న లీటరు నీళ్ల ధర ఒకటేనా? అని ప్రశ్నించారు. ఈ నెల 26న పాలసేకరణ కేంద్రాల్లో రైతులతో సంతకాల సేకరణ చేయాలనీ, ఈనెల 27న పాల కేంద్రాలు వద్ద ధర్నాలు నిర్వహించి అధికారులకు వినతిపత్రాలు ఇవ్వాలని కోరారు. కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు బి. ప్రసాద్, యుటీఎఫ్ రాష్ట్ర నాయకులు డాక్టర్ దామోదర్, సీఐటీయూ నగర నాయకులు మహేందర్, పీడీఎస్యూ రాష్ట్ర నాయకులు రాము, వెంకన్న, సుధీర్ తదితరులు పాల్గొన్నారు.