Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కోవిడ్ టైంలో విశేష సేవలందించారు
- ఏఐసీసీఆర్సీడబ్ల్యూయూ కన్వీనర్ డీ రమేష్‌బాబు
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
కోవిడ్ సమయంలో రైల్వే ఆస్పత్రుల్లో విశేష సేవలు అందించిన కాంట్రాక్ట్ పారామెడికల్ స్టాఫ్‌ను తక్షణం విధుల్లోకి తీసుకోవాలని ఆలిండియా కోఆర్డినేషన్ కమిటీ ఆఫ్ రైల్వే కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్స్ (ఏఐసీసీఆర్సీడబ్ల్యూయూ) కన్వీనర్ డీ రమేష్‌బాబు కేంద్ర రైల్వే మంత్రిత్వశాఖను డిమాండ్ చేశారు. కోవిడ్ టైంలో వీరందరితో సేవలు తీసుకొని, ఇప్పుడు నిర్మోహమాటంగా వారిని తొలగిస్తూ దుర్మార్గమైన ఉత్తర్వులు జారీ చేశారని తెలిపారు. అలాగే 2005 నుంచి రైల్వేలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగులందరి సర్వీసుల్ని రెగ్యులరైజ్ చేయాలని కోరారు. ఆదివారంనాడిక్కడి సీఐటీయూ నగర కార్యాలయంలో రైల్వే ఆస్పత్రుల్లో పనిచేస్తున్న పారామెడికల్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ జాతీయ సదస్సు జరిగింది. హైదరాబాద్ రైల్వే కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు ఎమ్ వెంకటేష్ అధ్యక్షతన జరిగిన ఈ సదస్సుకు దేశంలోని 17 రైల్వే జోన్లు, 53 డివిజన్లకు చెందిన కాంట్రాక్ట్ పారా మెడికల్ సిబ్బంది హాజరయ్యారు. కాంట్రాక్ట్ నర్సింగ్ సూపరింటెండెంట్లు, ల్యాబ్, అసస్తీషియా, డయాలసిస్, ఎక్స్‌రే టెక్నీషియన్లు, ఫార్మసిస్టులు, హెల్త్ ఇన్స్పెక్టర్లు, హెల్త్ అటెండెంట్స్,ఫిజియోథెరఫిస్ట్లు పాల్గొన్నా రు. ఈ సదస్సుకు ముఖ్య అతిధిగా హాజరైన రమేష్‌బాబు మాట్లాడుతూ కోవిడ్ టైంలో సేవలు గొప్పగా అందించారని కొనియాడిన రైల్వే అధికారులు, అవసరం తీరాక వారిని తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేయడాన్ని తప్పుపట్టారు. రైల్వే ప్రయివేటీకరణను నిలుపుదల చేయాలనీ, కాంట్రాక్ట్ వర్కర్ల సర్వీసులు కొనసాగిస్తూ, రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్ చేశారు. రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా ఎంపికై, సుదీర్ఘకాలంగా పనిచేస్తున్న ఉద్యోగుల సర్వీసును కూడా ఇప్పటికీ క్రమబద్ధీకరిం చకపోవడం దురదృష్టకరమన్నారు. కోవిడ్ టైంలో కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ విడుదల చేసిన లేఖలో తాత్కాలిక ప్రాతిపదికన తీసుకొనే సిబ్బంది వంద రోజులు పనిచేస్తే సర్వీసులో పలు కన్సెషన్లు ఇస్తామని పేర్కొన్నారని గుర్తుచేశారు. రైల్వేలో పనిచేస్తూ అసంఘటితంగా ఉన్న కాంట్రాక్ట్ కార్మికులందరినీ ఒకతాటిపైకి తెచ్చి డిమాండ్ల సాధన కోసం కృషి చేస్తామన్నారు. దానికోసం భవిష్యత్ ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తామన్నారు. కేంద్ర ప్రభుత్వం తక్షణం వారి న్యాయమైన డిమాండ్ల పరిష్కారానికి చొరవ చూపాలని విజ్ఞప్తి చేశారు. సదస్సులో వేర్వేరు డివిజన్లు, వివిధ విభాగాలకు చెందిన కాంట్రాక్ట్ ఉద్యోగులు హారతి, అంబిక, అమీరన్, గౌరవ్‌గుప్తా, శ్రవణ్‌కుమార్, ముఖేష్మరాఠే, ప్రీతీజా, సంతోష్‌కుమార్, కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. సదస్సుకు హాజరైన పలువురు కాంట్రాక్ట్ ఉద్యోగులు తమ సాదకబాదకాలను ప్రస్తావించారు. తమకు ప్రభుత్వ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకొనే వయోపరిమితి కూడా దాటిపోయిందనీ, అర్థంతరంగా విధుల నుంచి తొలగిస్తే కుటుంబాలతో సహా రోడ్డున పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణం విధుల్లోకి తీసుకోవాలనీ, ఇప్పటికే పనిచేస్తున్న కాంట్రాక్ట్ వర్కర్ల సర్వీసుల్ని రెగ్యులరైజ్ చేయాలని విజ్ఞప్తి చేశారు. దీనికోసం రైల్వేలోని వివిధ విభాగాల్లో ఉన్న ఖాళీ పోస్టుల్ని వెంటనే గుర్తించి, వాటిలో తమకు స్థానం కల్పించాలని కోరారు.