Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఢిల్లీకి చేరుకున్న సీఎం కేసీఆర్
- పర్యటనపై ఆద్యంతం గోప్యత పాటిస్తున్న వైనం
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ముఖ్యమంత్రి కేసీఆర్ మరోసారి ఢిల్లీ విమానమెక్కారు. సోమవారం రాత్రి 7.30 గంటల ప్రాంతంలో హైదరాబాద్‌లోని బేగంపేట నుంచి బయల్దేరిన ఆయన రాత్రి 9.54 గంటలకు హస్తినకు చేరుకున్నారు. ఆయన వెంట ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్, ఎంపీలు జోగినపల్లి సంతోశ్‌కుమార్, రంజిత్‌రెడ్డి, ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి, టీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి రావుల శ్రవణ్‌కుమార్‌రెడ్డి, కరీంనగర్ మాజీ మేయర్ రవీందర్‌సింగ్ తదితరులున్నారు. అయితే ముఖ్యమంత్రి కార్యాలయం ఆయన పర్యటనపై ఆద్యంతం గోప్యతను పాటించింది. మరోవైపు ఆయన ఢిల్లీ పర్యటన వెనుక లక్ష్యం ఏంటో కూడా తెలియరాలేదు. ఇటీవల సంభవించిన భారీ వర్షాలు, వరదలకు సంబంధించిన పరిహారాన్ని అంచనా వేయాలంటూ సీఎం కేసీఆర్... కేంద్రాన్ని కోరనున్నట్టు టీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. ఇందులో భాగంగా ఆయన ప్రధాని మోడీనీ, హోం మంత్రి అమిత్ షాను కలుస్తారంటూ ఆయన వర్గాలు తెలిపాయి. కానీ ఇప్పటి వరకూ వారి అపాయింట్మెంట్ ఖరారు కాలేదని సమాచారం. మరోవైపు జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలనీ, అందుకనుగుణంగా పార్టీ ఏర్పాటు చేయాలని భావిస్తున్న తరుణంలో కేసీఆర్... ఆ ప్రక్రియలో భాగంగానే హస్తినకు చేరారనే ఊహాగానాలు సైతం వినిపిస్తున్నాయి. అందుకనుగుణంగా ఆయన వివిధ పార్టీల జాతీయ నేతలు, పలువురు సీఎంలను కలవనున్నట్టు తెలిసింది. ఇదే సమయంలో ఆయన కోసం విజయవాడలో బుల్లెట్ ఫ్రూప్ కార్లను తయారు చేయిస్తున్న నేపథ్యాన్ని పలువురు నేతలు ప్రస్తావిస్తున్నారు. 'ఆయన జాతీయ రాజకీయాల్లో క్రియాశీలకంగా పని చేయబోతున్నారు.. అందుకోసమే వివిధ రాష్ట్రాల పర్యటన నిమిత్తం బుల్లెట్ ఫ్రూప్ కార్లను తయారు చేయిస్తున్నారు...' అంటూ ఒక సీనియర్ నేత వ్యాఖ్యానించటం ఇక్కడ గమనార్హం. మరోవైపు గతంలో హైదరాబాద్‌లో ఉన్నప్పుడు బీజేపీనీ, ప్రధాని మోడీని తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టిన సీఎం... ఆ తర్వాత ఢిల్లీ వెళ్లి ప్రధానికి, ఆయన మంత్రివర్గ సహచరులకు శాలువాలు కప్పిన వైనాన్ని పలువురు గుర్తు చేసుకుంటున్నారు. మరికొన్ని సార్లు కంటి వైద్యం కోసమంటూ ఆయన ఢిల్లీకి వెళ్లొచ్చారు. ఇలాంటి పరిణామాల నేపథ్యంలో కేసీఆర్ హస్తిన పర్యటన వెనుక ఉన్న మతలబేంటో తెలియాలంటే వేచి చూడాల్సిందేనని రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు.