Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
జేఎల్ఎం పరీక్షకు సంబంధించిన పేపర్ లీకేజిపై సమగ్ర దర్యాప్తు చేపట్టాలని డీవైఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కోట రమేష్, అనగంటి వెంకటేశ్ సోమవారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. లీకేజికి కారణమైన దోషులను కఠినంగా శిక్షించాలనీ, తిరిగి రాత పరీక్ష నిర్వహించాలని విజ్ఞప్తి చేశారు. విద్యుత్ శాఖలో జూనియర్ లైన్మెన్ (జేఎల్ఎం) నియామకాల కోసం జూలై 17న నిర్వహించిన (ఎస్ఎస్పీడీసీ)పరీక్షల్లో పేపర్ లీకౖేెనట్టుగా ఆరోపణలొస్తున్నాయంటూ తెలిపారు. ఈ ఘటనపై యాజమాన్యం, రాష్ట్ర ప్రభుత్వం స్పందించి తగిన విచారణ జరిపించాలని కోరారు. రాత పరీక్షలో కొందరు అభ్యర్థులు సెల్ ఫోన్లతో హాజరై పరిక్ష రాసినట్టు ఇప్పటికే సంబంధిత టాస్క్ ఫోర్స్ అధికారులు, పోలీసులు గుర్తించి దోషులను అరెస్టు చేసినట్టు పేర్కొన్నారు. పోలీసు విచారణలో లక్షల రూపాయలు డబ్బులు తీసుకుని పేపర్ లీకేజీకి సహకరిస్తామంటూ అధికారులు చెప్పినట్టు అభ్యర్థులు ఫిర్యాదు చేశారని తెలిపారు. ప్రభుత్వ సంస్థలో ఉద్యోగం సాధించాలనే లక్ష్యంతో అనేకమంది నిరుద్యోగులు కష్టపడి చదువుకుని పరీక్షలకు హాజరయ్యారని పేర్కొన్నారు. ఈ క్రమంలో అధికారుల కక్కుర్తి మూలంగా కొందరు అభ్యర్ధులను ప్రలోభపెట్టి ప్రశ్నా పత్రం లీకేజీ చేయడంతో కష్టపడి చదివిన అభ్యర్థులకు మరింత అన్యాయం జరిగే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో పరీక్షలను రద్దుచేసి మరలా పరీక్షను నిర్వహించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.