Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పట్టాలిచ్చిన వారికి పొజిషన్ చూపించాలి
- సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో సదాశిపేటలోని అన్ని బస్తీల్లో సామూహిక నిరాహార దీక్షలు
- పెద్ద ఎత్తున తరలివచ్చిన పేదలు
నవతెలంగాణ-సంగారెడ్డి
సంగారెడ్డి జిల్లా సదాశివపేట పట్టణంలో ఉన్న పేదలందరికీ ఇండ్ల స్థలాలు మంజూరు చేయాలని, ప్రభుత్వ భూములను కబ్జాల నుంచి కాపాడాలని, గతంలో పట్టాలు ఇచ్చిన వారందరికీ పొజిషన్ చూపించాలని సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరాహార దీక్షలు చేపట్టారు. పట్టణంలో సోమవారం ఒక్క రోజే 30 బస్తీల్లో (కేంద్రాల్లో) సుమారు 1500 పైగా నిరుపేదలు ఇండ్ల స్థలాల కోసం దీక్షలో పాల్గొని ప్రభుత్వంపై తమ నిరసనను తెలిపారు. ఈ సందర్భంగా సదాశివపేట ఏరియా కార్యదర్శి వి.ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ.. సదాశివపేట పట్టణంలో ఇండ్లు లేని నిరుపేదలకు 20 ఏండ్ల నుంచి ఇప్పటివరకు ఏ ఒక్కరికీ స్థలాలు ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఒకవైపు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇస్తామని ప్రచారం నిర్వహిస్తున్నా.. పట్టణంలో కేవలం 300 ఇండ్లు మాత్రమే నిర్మిస్తున్నారన్నారు. పట్టణంలో ప్రభుత్వ ఇంటి స్థలం కావాలని 6000 మంది దరఖాస్తు చేసుకున్నారని, కనీసం ప్రభుత్వ నిర్మిస్తున్న డబుల్ ఇండ్లయినా త్వరితగతిన నిర్మిస్తే కొంతమందికైనా ఇండ్లు అందుతాయన్నారు. కానీ ప్రభుత్వం ఆ దిశగా ఎలాంటి చర్యలు చేపట్టడం లేదని ఆరోపించారు. సిద్దాపూర్ గ్రామ రైతుల నుంచి తీసుకున్న 180 ఎకరాల ప్రభుత్వ భూమిలో పేదలకు ఇండ్ల స్థలాలివ్వాలని డిమాండ్ చేశారు. గతంలో పట్టాలిచ్చిన వారికి పొజిషన్ చూపించాలన్నారు. ప్రభుత్వ స్థలాలను రియల్ ఎస్టేట్ వ్యాపారులు కబ్జా చేసి ప్లాట్లు చేసి అమ్ముతున్నారని, అయినప్పటికీ అధికారులు పట్టీపట్టుగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. కబ్జా చేసిన వారిపై ఎందుకు క్రిమినల్ కేసు పెట్టడం లేదని ప్రశ్నించారు. పేదలకు ఒక న్యాయం, పెద్దలకు ఒక న్యాయమా అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వ భూములను కబ్జాల నుంచి కాపాడి పట్టణంలో పేదలందరికీ ఇండ్ల స్థలాలివ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. దీక్షల్లో సీపీఐ(ఎం) నాయకులు సోఫీ దాస్, యాదవ్ రెడ్డి, సంతోష్ కుమార్, ఖలీల్ పటేల్, టోపీ, అంజద్, పాషా, బాబాను, ఎండీ ఖయ్యూం, భాస్కర్, చంద్రయ్య, స్వరూప, జైన బేగం, రిజ్వానా బేగం, సూల్త్స్నా, యాదమ్మ, నరసమ్మ, తదితరులు పాల్గొన్నారు.