Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి ఏచూరి
- భువనగిరిలో అల్పాహారం కోసం ఆగిన ఏచూరి
- స్వాగతం పలికిన యాదాద్రిభువనగిరి జిల్లా నాయకత్వం
నవతెలంగాణ - భువనగిరి
వీర తెలంగాణ సాయుధ పోరాటానికి వారసత్వంగా ఉన్న రాష్ట్రంలో బీజేపీ మత విద్వేషాలను రెచ్చగొట్టాలని చూస్తోందని సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి అన్నారు. సీపీఐ(ఎం) తెలంగాణ రాష్ట్ర కమిటీ సమావేశాలు హనుమకొండలో జరుగుతున్న నేపథ్యంలో సమావేశాలకు వెళుతున్న సందర్భంగా సోమవారం భువనగిరిలోని స్థానిక వివేరా హోటల్లో అల్పాహారం కోసం ఆగారు.
ఆ పార్టీ యాదాద్రి భువనగిరి జిల్లా నాయకత్వం ఆయనకు స్వాగతం పలికింది. ఈ సందర్భంగా ఏచూరి మాట్లాడుతూ.. తెలంగాణలో ఐక్యత, సమానత్వం, లౌకికతత్వంతో ఉన్న ప్రజల్లో బీజేపీ మతోన్మాదాన్ని ప్రేరేపిస్తూ.. వారి మధ్య ఐక్యతను దెబ్బతీసేలా ఎత్తుగడలు వేస్తోందని విమర్శించారు. ఈ నేపథ్యంలో హనుమకొండలో జరిగే రాష్ట్ర కమిటీ సమావేశాల్లో బీజేపీ అనుసరిస్తున్న మతోన్మాద విధానాలకు వ్యతిరేకంగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం భవిష్యత్తు పోరాట ప్రణాళికను తీసుకోబోతున్నామని తెలిపారు. ఆయట వెంట పొలిట్‌బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు, విజయ రాఘవన్, రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, కేంద్ర కమిటీ సభ్యులు చెరుపల్లి సీతారాములు, జిల్లా కార్యదర్శి ఎండీ జహంగీర్, రాష్ట్ర కమిటీ సభ్యులు కొండమడుగు నరసింహ, బట్టుపల్లి అనురాధ, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు, తదితరులున్నారు.