Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తెలంగాణకు బీజేపీ చేసింది గుండుసున్నా : సీపీఐ
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
ఉచిత హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చే పార్టీలు, వాటిని అమలు చేయకపోతే క్రిమినల్ చర్యలు తీసుకోవాలని సీపీఐ జాతీయ కార్యదర్శి కె నారాయణ డిమాండ్ చేశారు. బుధవారం హైదరాబాద్‌లో ఆ పార్టీ రాష్ట్ర కార్యాలయం మగ్దూం భవన్లో కె నారాయణతోకలిసి రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి, అజీజ్‌పాష పల్లా వెంకటరెడ్డితో కలిసి విలేకర్ల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉచిత మామీలను నియంత్రించే అవకాశాలను పరిశీలించాలని సుప్రీంకోర్టు ఛీఫ్ జస్టిస్ ఎన్.వి.రమణ కేంద్ర ప్రభుత్వాన్ని కోరడాన్ని ఆహ్వానించారు. ఉచిత హామీలను అమలు చేయని పార్టీలపై కేవలం 420 సెక్షన్ కింద కేసులు సరిపోవనీ, మరింత కఠినమైన క్రిమినల్ చర్యలకు సుప్రీం కోర్టు సూచించాలన్నారు. బీజేపీ నియంతృత్వ అప్రజాస్వామిక చర్యలకు వ్యతిరేకంగా ఇతర పార్టీలతో జాతీయస్థాయిలో ప్రత్యామ్నాయం కోసం వామపక్షాలు ప్రయత్నం చేస్తున్నాయని తెలిపారు. బీజేపీకిి వ్యతిరేకంగా కేసీఆర్ వాగ్దాటితో మాట్లాడుతున్నప్పటికీ, ఒక్కడితోనే బీజేపీని ఓడించడం సాధ్యం కాదని చెప్పారు. వరదలొచ్చి అనేక మంది నిర్వాసితుల వుతుంటే.. ఆపదలో ఉన్న వారిని ఆదుకోవాల్సిందిపోయి.. వరదలకు కారణం నీవంటే..నీవని కీచులాడుకోవటం ఎంటని ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వ నియంతృత్వానికి వ్యతిరేకంగా, రాష్ట్ర ప్రభుత్వ హమీల అమలు కోసం భవిష్యత్‌లో ఉద్యమాలు చేస్తామని తెలిపారు. రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి మాట్లాడుతూ తెలంగాణకు బీజేపీ చేసింది గుండుసున్నానేనని చెప్పారు. ముఖ్యమంత్రి కేసీఆర్ రాజకీయ అంశాలను పక్కనబెట్టి ప్రజల సంక్షేమంపై దృష్టి సారించాలని సూచించారు.
గతంలో ఇచ్చిన హామీలను అమలు చేయకపోతే రాబోయే రోజుల్లో ప్రత్యక్ష ఆందోళనకు పూనుకుంటామని హెచ్చరించారు. గోదావరి జలాలపై కాళేశ్వరం తదితర ప్రాజెక్టులు పూర్తయ్యాయనీ, కృష్ణా నదిపై పెండింగ్ ప్రాజెక్టులను కూడా పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. జీఓ 58 కింద పేదల ఇండ్ల స్థలాల క్రమబద్ధీకరణ జరగలేదన్నారు. ప్రభుత్వ భూములను రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఆక్రమించుకుంటుంటే రెవెన్యూ, పోలీసు అధికారులు చోద్యం చూస్తున్నారనీ, పేదలు గుడిసెలు వేసుకుంటే పీకేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. పోడు సాగు చేసుకుంటున్న దరఖాస్తుదారులపై అటవీ, పోలీసు అధికారులు దాడులు చేస్తున్నారని చెప్పారు. ప్రభుత్వం ఇప్పటికైనా పట్టాలు ఇవ్వకపోతే మరోసారి పోడు ఉద్యమాన్ని ఉదృతం చేస్తామని ప్రకటించారు. పల్లా వెంకటరెడ్డి మాట్లాడుతూ పల్లా వెంకట్ రెడ్డి మాట్లాడుతూ మునుగోడులో ఉప ఎన్నిక తీసుకువచ్చి, గెలిస్తే తామే టీఆర్ఎస్కు ప్రత్యామ్నాయమనీ, రెండవస్థానం తమదేనని చెప్పుకునేందుకు బీజేపీ ప్రయత్నాలు సాగుతున్నాయని చెప్పారు. అజీజ్‌పాషా మాట్లాడుతూ స్వాతంత్య్ర పోరాటంలో ర్ఎస్ఎస్,బీజేపీలకు ఎలాంటి పాత్ర లేదన్నారు. తనకు క్షమాభిక్ష పెట్టాలని సావర్కర్ బ్రిటీష్ వారిని వేడుకున్నారని గుర్తు చేశారు. ఆగస్టు 15న సీపీఐ కార్యాలయాలన్నిటిలో ఘనంగా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు నిర్వహిస్తామన్నారు.