Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గతంలో సీనియర్ రెసిడెంట్ వైద్యుల ఆగ్రహం
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ఇన్ఛార్జీ డీఎంఈ డాక్టర్ కె.రమేశ్‌రెడ్డిపై రోజుకో రీతిన వివిధ కేడర్లపరంగా అన్నట్టు విమర్శలు పెరుగుతున్నాయి. తాజాగా గత నాలుగు రోజులుగా టీచింగ్ డాక్టర్లు నల్లబ్యాడ్జీలతో నిరసన కొనసాగిస్తున్నారు. గతంలో సీనియర్ రెసిడెంట్ డాక్టర్లకు వేతనాలు అందించడంలో ప్రభుత్వం విఫలమైందని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. నిరసనలు, సమ్మె వరకు విషయం వెళ్లడంతో మంత్రి హరీశ్ రావు జోక్యం చేసుకుని వేతనాలు ఆలస్యం కాకుండా ఆన్లైన్లో చెల్లించాలంటూ ఆదేశించారు.
ఇన్ఛార్జీ రమేశ్‌రెడ్డి వ్యవహారశైలిపై కూడా ఆ విభాగంలో పని చేసే డాక్టర్లు నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఆయన డాక్టర్ల సమస్యలను సానుకూలంగా విని పరిష్కరించాల్సిందిపోయి వైద్యుల మధ్య విబేధాలు తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపిస్తున్నారు. కొంత మంది భజన చేసే వారిని మాత్రం ప్రోత్సహిస్తూ మిగిలిన వారిపై వ్యక్తిగత కక్ష సాధింపులకు పాల్పడుతున్నారంటూ చెబుతున్నారు. సమస్యలు చెప్పుకునేందుకు వచ్చే వారితో తీసిపారేసినట్టుగా మాట్లాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో డాక్టర్ కె.రమేశ్ రెడ్డిని ఉద్దేశిస్తూ తెలంగాణ టీచింగ్ గవర్నమెంట్ డాక్టర్స్ అసోసియేషన్ (టీటీజీడీఏ) పలు ప్రశ్నలు సంధించింది.
వైద్యసేవలపై ప్రభావం....
ప్రజలకు సేవలందించాల్సిన కీలక విభాగం రాష్ట్ర వైద్యారోగ్యశాఖలో ఒక ఉన్నతాధికారికి, డాక్టర్లకు మధ్య జరుగుతున్న ఈ ఘర్షణ వైద్యసేవలపై తీవ్ర ప్రభావం చూపుతున్నది. ఇప్పటికే నాలుగు రోజులుగా నల్లబ్యాడ్జీలతో ఆస్పత్రుల ప్రాంగణాల్లో డాక్టర్లు నిరసన తెలుపుతున్నారు. ఈ సమస్యకు శాశ్వతంగా ఫుల్ స్టాప్ పెట్టాలని అన్ని క్యాడర్ల డాక్టర్లు కోరుతున్నారు.