Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రభుత్వ ఉత్తర్వులను స్వీకరించం
- వీఆర్వో జేఏసీ చైర్మెన్ గోల్కొండ సతీశ్
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
రాష్ట్రం ప్రభుత్వం తమను ఇతర శాఖల్లోకి పంపిస్తే వెళ్లబోమనీ, అసలు ఉత్తర్వులనే స్వీకరించబోమని వీఆర్వో జేఏసీ చైర్మెన్ గోల్కొండ సతీశ్ స్పష్టం చేశారు. తమకు అన్యాయం చేస్తే కోర్టు మెట్లెక్కుతామని రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. గురువారం హైదరాబాద్లోని సీసీఎల్ఏ కార్యాలయంలో జేఏసీ స్టీరింగ్ కమిటీ సమావేశం జరిగింది. అనంతరం జేఏసీ కో-చైర్మెన్ రవినాయక్, అడిషనల్ సెక్రటరీ జనరల్ పల్లెపాటి నరేశ్, వైస్ చైర్మెన్ సురేశ్, నాయకులు మురళి, ప్రతిభ, వెంకన్న, వినరు, రమేశ్, శ్రీహరినాయక్లతో కలిసి గోల్కొండ సతీశ్ మీడియాతో మాట్లాడారు. వివిధ శాఖల్లోకి ప్రభుత్వం తమను సర్దుబాటు చేస్తుందన్న వార్తలతో వీఆర్వోలు తీవ్ర మనోవేదనకు గురవుతున్నారని తెలిపారు. వీఆర్వో పోస్టులను రద్దు చేయడం అశాస్త్రీయ పద్ధతి అన్నారు. ఏకపక్ష నిర్ణయంతో ఏలాంటి ఆలోచన లేకుండా ఇతర శాఖలోకి తమను బదిలీ చేస్తే ఊరుకోబోమని హెచ్చరించారు. వీఆర్వోలను రెవెన్యూలోనే సర్దుబాటు చేయాలని కోరారు. అర్హులైన వారికి సీనియర్ అసిస్టెంట్లుగా ప్రమోషన్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు.