Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బీఎస్ఎన్ఎల్ టవర్లు, ఆప్టికల్ ఫైబర్ కేబుల్‌ను ప్రయివేటుకివ్వొద్దు
- బీఎస్‌ఎన్‌ఎల్‌ఈయూ రాష్ట్ర కార్యదర్శి సాంబశివరావు డిమాండ్
- భోజన విరామ సమయంలో ఉద్యోగుల ప్రదర్శన
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
నేషనల్ మానిటైజేషన్ పైప్‌లైన్ (ఎన్ఎంపీ) విధానాన్ని కేంద్ర ప్రభుత్వం రద్దు చేయాలని బీఎస్ఎన్ఎల్ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి జి సాంబశివరావు డిమాండ్ చేశారు. బీఎస్ఎన్ఎల్ టవర్లు, ఆప్టికల్ ఫైబర్ కేబుల్‌ను ప్రయివేట్ వ్యక్తులకు అప్పగించొద్దని కోరారు. బీఎస్ఎన్ఎల్ 4జీ సర్వీసులను వెంటనే ప్రారంభించాలని చెప్పారు. సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఆల్ యూనియన్స్ అండ్ అసోసియేషన్స్ ఆఫ్ బీఎస్ఎన్ఎల్ పిలుపులో భాగంగా గురువారం తెలంగాణ సర్కిళ్లలో అన్ని జీఎం కార్యాలయాల ముందు, సర్కిల్ కార్యాలయాల ముందు నల్ల బ్యాడ్జీలు ధరించి భోజన విరామ సమయంలో ఉద్యోగులు, అధికారులు పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. సీజీఎం కార్యాలయం ముందు జరిగిన ప్రదర్శనలో బీఎస్‌ఎన్‌ఎల్‌ఈయూ రాష్ట్ర కార్యదర్శి జి సాంబశివరావు మాట్లాడుతూ ఎన్ఎంపీ కింద బీఎస్ఎన్ఎల్కు చెందిన 14,917 మొబైల్ టవర్లను, రెండు లక్షల 80 వేల కిలోమీటర్ల రూట్‌ను ప్రయివేట్ వ్యక్తులకు అప్పగించడానికి కేంద్రంలోని మోడీ ప్రభుత్వం, బీఎస్ఎన్ఎల్ యాజమాన్యం వేగంగా ముందుకుపోతున్నాయని విమర్శించారు. ఈ నిర్ణయాన్ని అమలు చేసేందుకు బీఎస్ఎన్ఎల్ సీఎండీ వేగంగా చర్యలు తీసుకుంటున్నారని చెప్పారు. బీఎస్ఎన్ఎల్ మొబైల్ టవర్లు, ఆప్టిక్ ఫైబర్ కేబుల్ (ఓఎఫ్సీ)ని ప్రయివేటు వ్యక్తలకు అప్పగించడం ద్వారా రూ.40 వేల కోట్లు ఆర్జించొచ్చని బడ్జెట్లో కేంద్ర ప్రభుత్వం స్పష్టంగా ప్రకటించిందని గుర్తు చేశారు. ఎన్ఎంపీ కింద బీఎస్ఎన్ఎల్ టవర్లు, ఓఎఫ్సీని ప్రయివేటు వ్యక్తులకు అప్పగిస్తే, ఆ తర్వాత, అద్దె చెల్లించాల్సి ఉంటుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇది బీఎస్ఎన్ఎల్ను నాశనం చేసే చర్య అని విమర్శించారు. ప్రయివేటు సంస్థలు 5జీ సేవలను ప్రారంభించేందుకు సన్నద్ధమవుతున్న నేపథ్యంలో బీఎస్ఎన్ఎల్ 4జీ సేవలను ప్రారంభించే పని ఇంతవరకు చేయలేదని వివరించారు. బీఎస్ఎన్ఎల్ 4జీ సేవలను సకాలంలో ప్రారంభించలేకపోయినందున వినియోగదారులను కోల్పోతున్నదని అన్నారు. ఈ ఏడాది మేలోనే బీఎస్ఎన్ఎల్ 5.3 లక్షల మంది వినియోగదారులను కోల్పోయిందని వివరించారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఎన్‌ఈఏ రాష్ట్ర కార్యదర్శి సురేష్, ఎన్‌ఎఫ్‌టీఈ రాష్ట్ర సహాయ కార్యదర్శి జి క్రిష్టారెడ్డి, ఏఐజీఈటీఓఏ రాష్ట్ర నాయకులు కోటినాయక్, ఎస్సీఎస్టీ రాష్ట్ర నాయకులు శ్రీనివాస్, ఎఫ్ఎన్టీవో రాష్ట్ర కార్యదర్శి రఫీక్, నాయకులు శ్రీనివాస్, ఓంప్రకాశ్ జైస్వాల్, గీత తదితరులు పాల్గొన్నారు.