Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి
- సాగర్ ఎడమ కాలువ నీటి విడుదల
నవతెలంగాణ-నాగార్జున సాగర్
రైతులు లక్షాధికారులు కావాలనేది సీఎం కేసీఆర్ కోరిక అని.. అది నెరవేరాలంటే.. అధిక దిగుబడులనిచ్చే పంటల సాగును రైతులు ఎంచుకోవాలని విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి చెప్పారు. నల్లగొండ జిల్లాలోని నాగార్జునసాగర్ ప్రాజెక్టు ఎడమ కాలువకు గురువారం ఆయన నీటిని విడుదల చేశారు. దశాబ్ద కాలం తరువాత నాగార్జున సాగర్ ఎడమ కాల్వకు జులైలో నీటిని విడుదల చేయడం ఇది రెండోసారి అని చెప్పారు. స్వరాష్ట్రం ఆవిర్భావం తరువాత ఇదే ప్రథమమన్నారు. ఎడమకాల్వ పరిధిలోని 6.50లక్షల ఎకరాలకు నీరందించేందుకు ప్రణాళికలు రూపొందించామని చెప్పారు. నల్లగొండ జిల్లాలో 1,45,727 ఎకరాలు, సూర్యాపేట జిల్లా పరిధిలో 1,45,727 ఎకరాలు, ఖమ్మం జిల్లాలో(ఎత్తిపోతలతో కలుపుకుని) 2,41,000 వేల ఎకరాలకు సాగునీరు అందిస్తామని తెలిపారు. టీఎంసీల వారీగా నల్లగొండ జిల్లాకు 18 టీఎంసీలు, సూర్యాపేట జిల్లాకు 18 టీఎంసీలు, ఖమ్మం జిల్లాకు 29 టీఎంసీలు కేటాయించనున్నట్టు చెప్పారు. కృష్ణా జలాల వాటాలో రాష్ట్ర ప్రభుత్వం నిక్కచ్చిగా వ్యవహరిస్తుందని, తద్వారా ఆయకట్టు రైతాంగానికి సకాలంలో నీరు అందించొచ్చని అన్నారు. సాగర్ జలాశయానికి కిందటేడాదితో పోలిస్తే ఈయేడాది అదనంగా నీరు వచ్చి చేరుతుందని, ఆయకట్టు రైతాంగం సంతోషంగా ఉందని అన్నారు. ఎస్ఎల్బీసీ ద్వారా చివరి భూములకు నీళ్లు అందిస్తామని చెప్పారు. సాగర్‌కు కూత వేటు దూరంలో ఉన్న రాజవరం, ముదిమాణిక్యం, సూరేపల్లి, జాన్ పహాడ్ మేజర్ల చివరి భూముల వరకు నీళ్లు అందించామన్నారు. వరి పంటనే కాకుండా నీటిని సరైన పద్ధతిలో వినియోగించుకొని ఇతర పంటలు, అధిక ఆదాయాన్నిచ్చే పంటలను ఎలా పండించాలో ఆలోచించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో నాగార్జునసాగర్ ఎమ్మెల్యే నోముల భగత్, ఎమ్మెల్సీ ఎంసీ కోటిరెడ్డి, ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి, జిల్లా రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు రామచంద్ర నాయక్, పెద్దవూర జెడ్పీటీసీ అబ్బిడి కృష్ణారెడ్డి, ఎంపీపీ భగవాన్ నాయక్, మున్సిపాలిటీ చైర్మెన్ అనూషరెడ్డి తదితరులు పాల్గొన్నారు.