Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కృష్ణాబోర్డు అనుమతుల్లేకుండా ప్రాజెక్టు నిర్మాణం
- ముంపునకు గురికాని ఎమ్మెల్యే, మంత్రుల పొలాలు
- అఖిల భారత కిసాన్ సభ ఉపాధ్యక్షులు సారంపల్లి మల్లారెడ్డి
నవతెలంగాణ - మహబూబ్‌నగర్ ప్రాంతీయ ప్రతినిధి
బండరాయిపాకుల ముంపు బాధితులకు పరిహారమిచ్చే దాకా పల్లె నుంచి పట్టణాల వరకు ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని అఖిల భారత కిసాన్ సభ ఉపాధ్యక్షులు సారంపల్లి మల్లారెడ్డి అన్నారు. ప్రాజెక్టుల నిర్మాణ సమయంలో ఎమెల్యేలు, మంత్రుల పొలాలు ముంపునకు గురికాలేదని చెప్పారు. వనపర్తి జిల్లా రేవల్లి మండలం బంరాయిపాకుల గ్రామంలో ముంపు బాధితుల పోరాట కమిటీ ఆధ్వర్యంలో గురువారం నిర్వహించిన నిరసనలో ఆయన పాల్గొని మద్దతు తెలిపారు.
కృష్ణాబోర్డు అనుమతుల్లేకుండా ప్రాజెక్టులు ఎలా నిర్మిస్తారని ప్రశ్నించారు. జూరాల నుంచి నీటి కోసం తక్కువ ఖర్చుతో సత్వరమే నిర్మించాల్సిన పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం డిజైన్‌ను మార్చి.. కృష్ణా నుంచి నీరు తీసుకొచ్చేందుకు కొల్లాపూర్ నియోజకవర్గంలోని ఎల్లూరు వద్ద రిజర్వాయర్ నిర్మాణం చేపట్టడం ఏమిటని ప్రశ్నించారు. కాంట్రాక్టర్ల కక్కుర్తి, నాయకుల కమీషన్ కోసమే పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని రీడిజైన్ చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీని వల్ల బండరాయిపాకుల ముంపునకు గురవుతోందన్నారు. పంటలు పండే భూముల్లో ప్రాజెక్టులు కట్టడంతో వేలాది మంది రైతులు నిస్సహాయస్థితిలో ఉన్నారని చెప్పారు. సాగు భూములు, గ్రామాలకు నష్టం వాటిల్లకుండా ప్రాజెక్టులు కట్టే అవకాశం ఉన్నప్పటికీ పాలకులు ఆ విధానాలను తులనాడుతున్నారని విమర్శించారు. భూములు కోల్పోయి నిర్వాసితులైన రైతులు, ప్రజలు వలస బాట పడుతుంటే ప్రాజెక్టుల వల్ల ఎవరికి ఉపయోగం ఉంటుందని ప్రశ్నించారు. గతంలో నిర్మించిన నెట్టెంపాడు, కోయిల్ సాగర్, భీమా ప్రాజెక్టుల్లో ఇదే తరహా పద్ధతిని పాటించారన్నారు. మల్లన్నసాగర్లోనూ ఇదే విధానాన్ని పాటిస్తే రైతులు తిరుగుబాటు చేయడంతో ప్రభుత్వం తోక ముడిచిందని గుర్తు చేశారు.
కొండపోచమ్మ దగ్గర ఎకరాకు రూ.12 లక్షలు, మల్లన్నసాగర కోసం రూ.15 లక్షలు ఇస్తూ పాలమూరు-రంగారెడ్డి దగ్గర 5లక్షలే పరిహారం ఇవ్వడం ఏమిటని ప్రశ్నించారు. ఆస్తులు.. కోటిన్నర విలువగల భూములను వదులుకున్నా.. ఆయా గ్రామాల్లో ఉపాధి కొరవడిందని ఆందోళన వ్యక్తం చేశారు. ముంపు బాధితులకు ప్రతి ఒక్కరూ రాజకీయాలకతీతంగా మద్దతు తెలపాలని కోరారు. అడుక్కుంటే బిక్షమేస్తారని, ఉద్యమిస్తే హక్కులు సాధించుకుంటామని వారిలో ధైర్యాన్ని నూరిపోశారు. సమస్యలు పరిష్కరించకుంటే బండరాయిపాకుల నుంచి వనపర్తికి పాదయాత్ర చేస్తామని హెచ్చరించారు.
అనంతరం గ్రామానికొచ్చిన జిల్లా అదనపు కలెక్టర్ వేణుగోపాల్‌కు వినతిపత్రం సమర్పించారు. కార్యక్రమంలో సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి ఎండీ.జబ్బార్, గొర్రెల కాపరుల సంఘం డైరెక్టర్ దేవేందర్, మాజీ సర్పంచ్ బాలస్వామి, రాములు తదితరులు పాల్గొన్నారు.
నెలలోపు సమస్యను పరిష్కరిస్తాం
నెలలోపు ముందపు బాధితుల సమస్యలు పరిష్కరిస్తామని జిల్లా అదనపు కలెక్టర్ వేణుగోపాల్ తెలిపారు. ఆయన గ్రామానికి వచ్చి బాధితులతో మాట్లాడారు. బాధితుల సమస్యలు అపరిష్కృతంగా ఉన్న మాట వాస్తవమేనని, బడ్జెట్ లేకపోవడంతో సరైన సమయానికి పరిహారం ఇవ్వలేదని చెప్పారు. ఇండ్ల బిల్లులు నెల రోజుల్లో వస్తాయని, కాలనీలకు అందాల్సిన రూ.18 కోట్లు అందుబాటులో లేవని తెలిపారు. ఈ నెలలో ప్రభుత్వానికి నివేదిక పంపి సరైన బడ్జెట్ వచ్చేలా చర్యలు తీసుకుంటామన్నారు. 49 ఎకరాలకు ఖరీదు చేశాం.. 254 మందికి డబ్బులు కూడా ఇచ్చాం.. ఇంకా ఎవరైనా ఉంటే అందరికీ డబ్బులిచ్చేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు.
- జిల్లా అదనపు కలెక్టర్