Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- విద్యాశాఖ సంచాలకులకు ఎమ్మెల్సీ నర్సిరెడ్డి లేఖ
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలోని కస్తూర్బాగాంధీ బాలికా విద్యా లయాల (కేజీబీవీ)ల్లో పనిచేస్తున్న ప్రత్యేకాధికారుల (ఎస్వో)కు మోడల్ స్కూల్ హాస్టళ్ల పర్యవేక్షణ బాధ్యతలను అప్పగిస్తూ ఇచ్చిన ఉత్తర్వులను వెంటనే రద్దు చేయాలని ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ సంచాలకులు, తెలంగాణ సమగ్ర శిక్ష స్టేట్ ప్రాజెక్టు డైరెక్టర్ (ఎస్పీడీ) శ్రీదేవసేన గురువారం ఆయన లేఖ రాశారు. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని ఆమెను కోరారు. మోడల్ స్కూళ్లలో ఆరు నుంచి పదో తరగతి వరకు ఒక్కో పాఠశాలలో 500 మంది, ఇంటర్లో మరో 320 మంది కలిపి 820 మంది విద్యార్థులుంటారని తెలిపారు. పదో తరగతి, ఇంటర్‌కు బోర్డు పరీక్షలుంటాయని వివరించారు. ఇంత పనిఒత్తిడితో అదనంగా బాలికల హాస్టళ్ల బాధ్యతను నిర్వహించలేమంటూ మోడల్ స్కూల్ ప్రిన్సిపాళ్లు 2019లోనే హైకోర్టును ఆశ్రయించారని గుర్తు చేశారు. కోర్టులో వస్తున్న ప్రమాదాన్ని తప్పించుకునేందుకు ప్రిన్సిపాళ్లను కాదనీ, కేజీబీవీ ఎస్‌వోలకు బాధ్యత అప్పగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులిచ్చిందని పేర్కొన్నారు. కేజీబీవీల్లోనే భోజనం ఏర్పాట్లు, రాత్రి సమయంలో చూసుకునేందుకు కేర్‌టేకర్‌ను ఇవ్వాలంటూ నాలుగేండ్లుగా ఎస్వోలు, ఉపాధ్యాయులు అడుగుతున్నారని తెలిపారు. ఉపాధ్యాయుల బోధనకు ఆటంకం లేకుండా ఉండేందుకు కేర్‌టేకర్‌ను ఇవ్వాలంటూ తాను సైతం గతంలో లేఖ రాశానని గుర్తు చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో కేజీబీవీ ఎస్‌వోలకు మోడల్ స్కూళ్ల బాలికల హాస్టళ్లను అప్పగించడమంటే రెండోచోట్ల విద్యార్థులకు అసౌకర్యం కలుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఎస్వోలు రెండుచోట్ల విధులు నిర్వహించలేక అనారోగ్యానికి గురయ్యే అవకాశముందని తెలిపారు. సంక్షేమ శాఖల ఆధ్వర్యంలో నిర్వహించే హాస్టళ్లలో వంద విద్యార్థులకు ప్రత్యేకంగా రెగ్యులర్ పోస్టుతో వార్డెన్ ఉంటారని వివరించారు. మోడల్ స్కూళ్ల బాలిక హాస్టళ్లకు రెగ్యులర్ వార్డెన్ పోస్టులను మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. ఆ పోస్టులను భర్తీ చేస్తే శాశ్వత పరిష్కారం లభిస్తుందని సూచించారు. ప్రస్తుత సమస్యను అధిగమించేందుకు జిల్లా కలెక్టర్ల సహాయంతో మోడల్ స్కూళ్లకు దగ్గరగా ఉన్న సంక్షేమ శాఖ హాస్టల్ వార్డెన్లకు అదనపు బాధ్యతలు అప్పగించాలని కోరారు. కేజీబీవీల నిర్వహణ సక్రమంగా ఉండేందుకు ఎస్‌వోలకు మోడల్ స్కూళ్ల బాలిక హాస్టళ్ల బాధ్యతను అప్పగిస్తూ ఇచ్చిన ఉత్తర్వులను రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.