Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మోడీ పాలనలో లౌకిక, ప్రజాస్వామ్యానికి విఘాతం
- తెలంగాణలో దిగజారుడు రాజకీయాలు
- పోడు సమస్యలపై త్వరలో 350కి.మీ. పాదయాత్ర : తమ్మినేని వీరభద్రం
నవతెలంగాణ- చౌటుప్పల్ రూరల్
కమ్యూనిస్టులు లేకుండా దేశానికి భవిష్యత్ లేదని, ప్రజా సమస్యలను రాజకీయ ఎజెండా మీదకు తెచ్చేది కమ్యూనిస్టులేనని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మున్సిపల్ సీపీఐ(ఎం) ప్లోర్‌లీడర్ గోపగోని లక్ష్మణ్ భార్య. గోపగోని సుజాత ఇటీవల గుండెపోటుతో మరణించారు. గురువారం లక్ష్మణ్ కుటుంబాన్ని తమ్మినేని పరామర్శించారు. అనంతరం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కేంద్రంలోని మోడీ ప్రభుత్వం ఈడీలను ఉపయోగించి ప్రతిపక్ష పార్టీల నాయకులను జైలుకు పంపిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. చివరకు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీని సైతం ఈడీ కేసులో ఇరికించిందన్నారు. కాంగ్రెస్ నాయకులు ఇప్పుడు ధర్నాలు చేస్తున్నారు కానీ వారు అధికారంలో ఉన్నప్పుడు కూడా నరేంద్ర మోడీ అనుసరించిన విధానాలే అనుసరించారని చెప్పారు.
రాష్ట్రంలో మునుగోడు ప్రాంతం రాజకీయ వేడిని రగులుస్తోందన్నారు. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి పార్టీ ఎందుకు మారుతున్నారో స్పష్టమైన వైఖరి చెప్పాలన్నారు. సొంత ప్రయోజనాల కోసమే తప్ప ప్రజా సంక్షేమం కోసం కాదని విమర్శించారు. నేడు కేసీఆర్ పాలనలో డబ్బు రాజకీయాలు మరింత పెరిగిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఒకప్పుడు ప్రజల అభిమానంతో ప్రజాప్రతినిధులుగా ఎన్నికయ్యేవారని, ఇప్పుడు డబ్బు సంచులతో వచ్చిన వారే ప్రజాప్రతినిధులుగా ఎన్నికవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. బూర్జువా విధానాలకు వ్యతిరేకంగా.. ప్రత్యామ్నాయ విధానం కోసం కృషి చేస్తున్నామని తెలిపారు. మునుగోడులో ఉప ఎన్నికలు జరిగితే సీపీఐ(ఎం) పోటీపై పార్టీ కమిటీల్లో చర్చిస్తామని స్పష్టం చేశారు. దేశవ్యాప్తంగా సీపీఐ(ఎం)కు ప్రధాన రాజకీయ శత్రువు బీజేపీ అని, ఆ పార్టీని ఓడించడానికి ఎవరితోనైనా కలిసి పని చేస్తామని చెప్పారు. ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీతో పొత్తు పెట్టుకునే ప్రసక్తే లేదని.. విలేకరులు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు.
పోడు భూములపై అబద్ధాలు
పోడు భూములు సాగు చేసుకుంటున్న గిరిజనులకు పట్టాలు ఇస్తామని చెప్పిన సీఎం కేసీఆర్.. ఇప్పుడు పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారని విమర్శించారు. 2018 ముందు నుంచి సాగులో ఉన్నవారికి పట్టాలిస్తామంటే కేంద్ర ప్రభుత్వం ఒప్పుకోవడం లేదని చెప్పడం హాస్యాస్పదమన్నారు. పోడు భూముల సమస్యల పరిష్కారం కోసం 350కి.మీ. సుదీర్ఘ యాత్ర చేపట్టడానికి సిద్ధమవుతున్నామని తెలిపారు. 57 ఏండ్లు నిండిన ప్రతి ఒక్కరికీ పింఛన్లు ఇస్తామని సీఎం కేసీఆర్ మాట తప్పారన్నారు.
ఆగస్టు 15న సీపీఐ(ఎం) కార్యాలయాలపై జాతీయ జెండాలు
మోడీ ప్రభుత్వం స్వాతంత్య్ర ఉద్యమ స్ఫూర్తికి తూట్లు పొడుస్తుందని తమ్మినేని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడటం కోసం, పౌర హక్కుల రక్షణ కోసం, మానవ హక్కుల పరిరక్షణ కోసం సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో ఆగస్టు 1 నుంచి 15 వరకు దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహిస్తున్నామని తెలిపారు. స్వాతంత్య్రాన్ని రక్షించేది కమ్యూనిస్టులే అని చాటి చెప్పేలా ఆగస్టు 15న సీపీఐ(ఎం) కార్యాలయాలపై జాతీయ జెండాలు ఎగరవేస్తామని స్పష్టం చేశారు. పెద్దఎత్తున సెమినార్లు జరుపుతామన్నారు. విలేకరుల సమావేశంలో సీపీఐ(ఎం) యాదాద్రి భువనగిరి జిల్లా కార్యదర్శి ఎండి.జహంగీర్, రాష్ట్ర కమిటీ సభ్యులు కొండమడుగు నర్సింహా, బట్టుపల్లి అనురాధ, జిల్లా కమిటీ సభ్యులు బూరుగు కృష్ణారెడ్డి, ఎండి పాషా తదితరులు ఉన్నారు.