Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- హైదరాబాద్‌లో రక్తదాతల కొరత ...
- బాధితుల అవసరాలను సొమ్ము చేసుకుంటున్న మోసగాళ్లు
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో రాష్ట్రంలో సీజనల్ వ్యాధులు పెరిగిపోతున్నాయి. భద్రాచలం-కొత్తగూడెం, ములుగు తదితర జిల్లాల్లో మలేరియా కేసులు ఎక్కువగా వస్తుంటే, హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ - మల్కాజిగిరి తదితర జిల్లాల్లో డెంగ్యూ కేసులు అధికంగా నమోదవుతున్నాయి. దీంతో మరోసారి ప్రయివేటు ఆస్పత్రులు దందా మొదలు పెట్టాయి. ప్లేట్లెట్ల కొరత పేరుతో రోగులను, వారి బంధువులను పరుగులు పెట్టిస్తున్నాయి. ఇప్పటికే రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి టి.హరీశ్ రావు మొదలు ఆ శాఖలోని ఉన్నతాధికారులు బ్లడ్ సపరేషన్స్, ప్రత్యేక వార్డులతో జిల్లా ఆస్పత్రుల్లో చికిత్సకు ఏర్పాటు చేసినట్టు ప్రకటించారు. భయాందోళనకు గురై ప్రయివేటు ఆస్పత్రులకు వెళ్లొద్దని రోగులకు పిలుపునిచ్చారు.
కోవిడ్-19, లాక్డౌన్ సమయంలో రాష్ట్రంలో రక్తం కొరత ఎక్కువ కావడంతో దాన్ని తీర్చేందుకు అధికారులు ప్రత్యేక శిబిరాలను నిర్వహించారు. స్వచ్ఛంద సంస్థలు సైతం తమ పరిధిలో రక్తదాతలను సమీకరించి బాధితులను ఆదుకునేందుకు ఆసక్తి కనబరిచాయి. ఇప్పటికీ సామాజిక మాధ్యమాల్లో రక్తదాతల గ్రూపులను అందుబాటులో ఉంచుతూ బాధితులకు అవసరమైన సమయంలో ఆదుకుంటున్నాయి. దీంతో ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వంతో పాటు రెడ్ క్రాస్ సొసైటీ తదితర స్వచ్ఛంద సంస్థలు ఎప్పటికప్పుడు రక్తం, ప్లేట్లెట్లు తదితర కాంపొనెంట్ల కొరత లేకుండా ప్రయత్నిస్తున్నాయి. అయినప్పటికీ కొన్ని సంక్లిష్ట పరిస్థితుల్లో డిమాండ్‌కు తగ్గట్టుగా రక్తదాతలు అందుబాటులో లేకపోవడంతో దీన్ని ప్రయివేటు ఆస్పత్రులు, వ్యక్తులు సొమ్ము చేసుకుంటున్నారని ఫేస్బుక్, ఇతర సామాజిక మాధ్యమాల్లో స్వచ్చంధ రక్తదాతల గ్రూపును నడిపిస్తున్న బాధ్యుడొకరు వెల్లడించారు. ప్రతి రోజు కనీసం 25 మంది రోగుల నుంచి ప్లేట్లెట్ల కోసం కాల్స్ వస్తున్నట్టు చెప్పారు. అయితే తమ వద్ద ఉన్న జాబితాలోని రక్తదాతల్లో కొంత మంది వర్క్ ఫ్రం హౌం కారణంగా జిల్లాలకు వెళ్లడంతో కొన్ని బ్లడ్ గ్రూపులకు రక్తదాతలను వెంటనే సమకూర్చలేకపోతున్నట్టు తెలిపారు.
ఇటీవల ఖమ్మం నుంచి వచ్చిన ఒక రోగి హైదరాబాద్‌లోని ప్రయివేటు ఆస్పత్రిలో చేరారు. ఆ ఆస్పత్రి సిబ్బంది అత్యవసరంగా ప్లేట్లెట్లను ఎక్కించాలని సూచించారు. ఇలాంటి వారిని ఆస్పత్రిలోని సిబ్బంది తమ వద్ద అందుబాటులో లేవనీ, తెచ్చుకోవాలని చెబుతుండటంతో రక్తదాతల కోసం వెతికే క్రమంలో మెసగాళ్ల చేతికి చిక్కుతున్నారు. అయితే తమ వద్ద రక్తదాతలున్నారు.
కానీ, అయితే వారిని ఆస్పత్రికి రప్పించేందుకు రవాణా, ఇతర ఖర్చులు ఇవ్వాలంటూ దళారులు మోసగిస్తున్న సంఘటనలు ఇటీవల వెలుగు చూస్తున్నాయి. ఒకవైపు ప్రయివేటు ఆస్పత్రులు డెంగ్యూ పేరుతో చేస్తున్న లక్షల రూపాయల దోపిడీకి గురవుతున్న బాధితులను ఈ నయారకం మోసం మరింత ఒత్తిడికి గురి చేస్తున్నది. ఆయా ఆస్పత్రుల వద్ద రోగులకు తెలిసేలా నిజమైన రక్తదాతల వివరాలను పొందుపరచాలని స్వచ్ఛంద సంస్థల నిర్వాహకులు కోరుతున్నారు.