Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
బెల్లంపల్లి మున్సిపల్ కమిషనర్ జీ గంగాధర్ అసంబంద్ధ వైఖరిపై చర్యలు తీసుకోవాలని పురపాలకశాఖ మంత్రి కే తారకరామారావు కమిషనర్ అండ్ డైరెక్టర్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ (సీడీఎమ్ఏ)ను ఆదేశించారు. బెల్లంపల్లి పురపాలక సంఘం ఆధ్వర్యంలో అక్కడి ప్రభుత్వ ఆస్పత్రిలో జరిగిన పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ పుట్టినరోజు వేడుకలకు హాజరు కాలేదని నలుగురు మున్సిపల్ ఉద్యోగులకు అక్కడి కమిషనర్ జీ గంగాధర్ షోకాజ్ నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ నోటీసులు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో మంత్రి దీనిపై స్పందించారు.
రాజకీయాలు, పరిపాలనలో ఇలాంటి సానుభూతి అంశాలను ప్రోత్సహించడంలో తాను చివరి వ్యక్తిగా ఉంటాననీ, అసంబద్ధంగా వ్యవహరించిన బెల్లంపల్లి మున్సిపల్ కమిషనర్‌పై చర్యలు తీసుకోవాలని ట్విట్టర్ వేదికగా సీడీఎమ్ఏను కోరారు. తన పుట్టినరోజు వేడుకలకు హాజరుకాలేదని ఉద్యోగులకు మెమో ఇవ్వడం సరికాదంటూ ట్వీట్ చేశారు. దీనిపై సీడీఎమ్ఏ చర్యలు తీసుకుంటారని ఆశాభావం వ్యక్తం చేశారు.