Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ఇన్ఛార్జీ డీఎంఈ డాక్టర్ కె.రమేశ్ రెడ్డిని తొలగించాలనీ, అదే విధంగా తమ సమస్యలను పరిష్కరించాలంటూ గవర్నమెంట్ టీచింగ్ డాక్టర్లు కొనసాగిస్తున్న నిరసన శుక్రవారం నాటికి ఐదో రోజుకు చేరుకుంది. ఇందులో భాగంగా రాష్ట్రంలోని ఆయా బోధనాస్పత్రుల్లో తెలంగాణ టీచింగ్ గవర్నమెంట్ డాక్టర్స్ అసోసియేషన్ (టీటీజీడీఏ) ఆధ్వర్యంలో నల్లబ్యాడ్జీలతో నిరసన తెలిపారు. నిరసన కార్యక్రమాల్లో తెలంగాణ ప్రభుత్వ బోధన వైద్యుల సంఘం ప్రధాన కార్యదర్శి డా జలగం తిరుపతి రావు, రాష్ట్ర ఉపాధ్యక్షులు డాక్టర్ కిరణ్ మాదాల, డా ప్రతిభా లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. శాశ్వత ప్రాతిపదికన డీఎంఈ పోస్టును సృష్టించాలి, 56 నెలల పీఆర్సీ బకాయిలను చెల్లించాలి, సాధారణ బదిలీలను చేపట్టాలి, ఈఎల్ ఎన్‌క్యాష్ మెంటు, కెరీర్ అడ్వాన్సుమెంటు స్కీం అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు. శనివారం హైదరాబాద్‌లోని ఉస్మానియా ఆస్పత్రిలో జరిగే నిరసనల్లో ఆ సంఘం కేంద్ర బృందం పాల్గొంటారని నాయకులు తెలిపారు. అనంతరం ట్విట్టర్ ద్వారా మంత్రులు, ఉన్నతాధికారులకు డిమాండ్ల సమాచారం చేరవేస్తామని వారు వెల్లడించారు.