Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆరా తీస్తున్న ఈడీ
- రెండు కోట్లతో ప్రవీణ్ బర్త్‌డే పార్టీ నిర్వహించిన సంపత్?
- ప్రవీణ్ ఫామ్‌హౌజ్‌లో విదేశీ పక్షులు, జంతువుల కోసం అటవీ శాఖ గాలింపు
నవతెలంగాణ-ప్రత్యేక ప్రతినిధి
కోట్లాది రూపాయలతో క్యాసినోను నిర్వహించినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న చీకోటి ప్రవీణ్ కేసులో సంపత్ అనే పేరు కొత్త ట్విస్టుగా చేరింది. సంపత్, మాధవరెడ్డి ఆస్తులపై సోదాలు నిర్వహించిన ఈడీ అధికారులకు సంపత్ అనే పేరుతో కొత్త ఆధారాలు చిక్కాయని తెలిసింది. ముఖ్యంగా, ప్రవీణ్‌కు సంబంధించిన హవాలా, ఇతర ఆర్థిక లావాదేవీలను సంపత్ పర్యవేక్షించేవాడని ఈడీ దృష్టికి వచ్చినట్టు సమాచారం. ఇండోనేషియా, థారులాండ్, నేపాల్, సింగపూర్, శ్రీలంకలలో బిగ్ డాడీ పేరిట క్యాసినోలను ప్రవీణ్ నిర్వహించేవాడని ఇప్పటి వరకు ఆధారాలు సేకరించిన దర్యాప్తు సంస్థ.. ఈ క్యాసినోలకు వ్యాపారులను, రాజకీయ ప్రముఖులను విమానంలో పంపించే బాధ్యతలను సంపత్ నిర్వహించేవాడని ఈడీ సమాచారం సేకరించినట్టు తెలిసింది. అంతేగాక, టాలీవుడ్, బాలీవుడ్‌లకు చెందిన పలువురు ద్వితీయశ్రేణి హీరోయిన్లతో పరిచయాలు కలిగి ఉన్న సంపత్.. తాము నిర్వహించే క్యాసినోలలో డ్యాన్సులు చేయించటానికి వారిని తరలించేవాడని ఈడీ దృష్టికి వచ్చినట్టు సమాచారం. రెండు కోట్ల రూపాయలతో ప్రవీణ్ పుట్టిన రోజు వేడుకలను సంపత్ నిర్వహించనట్టుగా తెలిసింది. దీంతో ఈ సంపత్ ఎవరు? ఏం చేస్తుంటాడు? ఎక్కడివాడు? ప్రవీణ్‌తో ఆయనకున్న సంబంధాలేమిటి? తదితర కోణాల్లో ఈడీ అధికారులు దర్యాప్తు సాగిస్తున్నట్టు తెలిసింది. అలాగే, సంపత్‌కు సైతం నోటీసులు జారీ చేసి ప్రశ్నించనున్నారని సమాచారం.
కర్తాల్లోని ప్రవీణ్ ఫామ్ హౌజ్‌లో అటవీ శాఖాధికారుల సోదాలు
ఇదిలా ఉంటే, క్యాసినో నిర్వాహకుడు చీకోటి ప్రవీణ్‌కు చెందిన ఫామ్‌హౌజ్‌లో అటవీశాఖాధి కారులు శుక్రవారం సోదాలు నిర్వహించారు. నగర శివారులోని కర్తాల్‌లో గల 20 ఎకరాల ఈ ఫామ్ హౌజ్‌లో ప్రవీణ్ పలు విదేశీ జాతులకు చెందిన పక్షులతో పాటు పలు జంతువులను పెంచుతున్నట్టు సమాచారమందుకున్న అటవీ శాఖాధికారులు అక్కడి వెళ్లారు. దక్షిణాఫ్రికా నుంచి మేలు రకాలైన పక్షులను తీసుకొచ్చి ప్రవీణ్ పెంచుతున్నట్టు అటవీ శాఖాధికారుల దృష్టికి వచ్చింది. అంతేగాక, కోబ్రా, పైతాన్ వంటి పాము జాతులనూ ప్రవీణ్ విదేశాల నుంచి తీసుకొచ్చి పెంచుతున్నట్టు అటవీ శాఖాధికారులు అనుమాని స్తున్నారు. అయితే, విదేశీ జాతులకు చెందిన పక్షులను, క్రూర జంతువులను తీసుకొచ్చి పెంచు కోవాలంటే దానికి అటవీ శాఖ నుంచి ముందస్తు అనుమతి తీసుకోవాల్సి ఉంటుందని అధికారులు తెలిపారు. ప్రస్తుతం తన ఫామ్‌హౌజ్‌లో విదేశీ పక్షులను పెంచుకోవటానికి అటవీ శాఖ నుంచి ప్రవీణ్ అనుమతి తీసుకున్నాడా? లేదా? అనేది పరిశీలిస్తున్నట్టు చెప్పారు.