Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీఎం కేసీఆర్‌కు జూలకంటి లేఖ
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
గ్రామ రెవెన్యూ అధికారుల (వీఆర్ఏ)కు అసెంబ్లీలో ఇచ్చిన హామీలను అమలు చేయాలని ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావును సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు సీఎంకు శుక్రవారం ఆయన లేఖ రాశారు. రాష్ట్రంలో 23 వేల మంది వీఆర్ఏలు 14,15 ఏండ్ల నుంచి గౌరవ వేతనంపై పనిచేస్తున్నారని తెలిపారు.
వారు గ్రామీణ ప్రాంతాల్లో ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలను అన్ని రకాల రెవెన్యూ సమస్యలనూ పర్యవేక్షిస్తారని పేర్కొన్నారు. వారిలో ఎస్సీ,ఎస్టీ, బడుగు బలహీనవర్గాలకు చెందినవారు ఎక్కువ మంది ఉన్నారని వివరించారు. వారి గౌరవ వేతనం కేవలం రూ.10,500 మాత్రమేనని ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో కుటుంబాలను పోషించుకోలేకపోతున్నారని తెలిపారు. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత అనేకసార్లు ఈ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తెచ్చి పరిష్కరించాలంటూ వారు మొరపెట్టుకున్నారని గుర్తు చేశారు. వీఆర్ఏలకు పేస్కేల్ అమలు చేస్తామనీ, అర్హులైన వారికి పదోన్నతులు ఇస్తామనీ, రెండేండ్ల క్రితం అసెంబ్లీలో స్వయంగా సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారని పేర్కొన్నారు. కానీ ఇంత వరకూ అవి అమలుకు నోచుకోలేదని తెలిపారు. దీంతో ఐదు రోజుల నుంచి రాష్ట్రవ్యాప్తంగా వీఆర్ఏలు రిలే నిరాహారదీక్షలు చేపట్టారని పేర్కొన్నారు. ఇప్పటికైనా సీఎం కేసీఆర్ జోక్యం చేసుకుని అసెంబ్లీలో వారికిచ్చిన హామీలను అమలు చేయాలని జూలకంటి కోరారు.