Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వైల్డ్‌లైఫ్ ఎవిడెన్స్ కలెక్షన్ కిట్ ఆవిష్కరణ
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
వన్యప్రాణుల సంరక్షణతో పాటు వాటి డేటాను భద్రపర్చేందుకు అటవీ శాఖ ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నదని రాష్ట్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు. శుక్రవారం హైదరాబాద్‌లోని అరణ్యభవన్‌లో అంతర్జాతీయ పులుల దినోత్సవం సందర్భంగా వైల్డ్ లైఫ్ కన్జర్వేషన్ సొసైటీ(డబ్ల్యూసీఎస్) ప్రత్యేకంగా రూపొందించిన వైల్డ్‌లైఫ్ ఎవిడెన్స్ కలెక్షన్ కిట్‌ను మంత్రి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నేర పరిశోధన, ఆధారాల సేకరణలో పోలీసులకు ఫోరెన్సిక్ విభాగం ఎంతో కీలకమైందని చెప్పారు. అలాగే అంతరించిపోతున్న వన్యప్రాణుల రక్షణకు ఇలాంటి ఆధునిక శాస్త్రీయ పద్ధతులు ఎంతగానో ఉపయోగపడుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. బయోలాజికల్ ఎవిడెన్స్ ద్వారా వేటగాళ్ళకు కఠిన శిక్షలు పడే అవకాశం ఉంటుందనీ, తద్వారా వారు జంతువులను వధించే ఘటనలు తగ్గుముఖం పడతాయని తెలిపారు. ఈ కిట్ల ద్వారా శాంపిల్ సేకరణ, దాన్ని ఎలా ఉపయోగించాలనే దానిపై అటవీ శాఖ అధికారులకు శిక్షణను ఇచ్చి కిట్లను అందజేస్తామని చెప్పారు. అభయారణ్యాలు, వన్యప్రాణి సంరక్షణ కేంద్రాలు, అన్ని అటవీ డివిజన్లలో ఈ కిట్స్‌ను శాంపిల్ సేకరణకు ఉపయోగించనున్నట్టు వెల్లడించారు. కిట్ పని తీరు, శాంపిల్స్ సేకరణ, వైల్డ్‌లైఫ్ డీఎన్ఏ పరీక్షల విశ్లేషణ, తదితర అంశాలను డబ్ల్యూసీఎస్ ప్రతినిధులు మంత్రికి వివరించారు. వన్యప్రాణులను వధించినప్పుడు నేర పరిశోధనలో భాగంగా ఆ ప్రాంతం నుంచి ఆధారాలను సేకరించడం, అవి సహజ మరణం పొందినప్పుడు వాటి పాదముద్రలు, గోళ్లు, వెంట్రుకలు, పెంట, మాంసాహార అవశేషాల సేకరించి వాటి డీఎన్ఏ పరీక్షల కోసం జెడ్ఎస్ఐ, డబ్ల్యూఐఐ, సీసీఎమ్బీలకు పంపుతామని తెలిపారు. విచారణ సమయంలో న్యాయస్థానాల్లో ఈ పరీక్షల రిపోర్టును సమర్పిస్తే వాటి ఆధారంగా వేటగాళ్ళకు శిక్ష పడే అవకాశం ఉంటుందని ప్రతినిధులు తెలిపారు. ఈ కార్యక్రమంలో అటవీ అభివృద్ధి సంస్థ చైర్మెన్ వంటేరు ప్రతాప్‌రెడ్డి, ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి, అటవీ శాఖ స్పెషల్ సీఎస్ శాంతికుమారి, పీసీసీఎఫ్ ఆర్ఎం. డోబ్రియల్, పీసీసీఎఫ్ (కంపా) లోకేష్ జైస్వాల్, అటవీ అభివృద్ధి సంస్థ వైస్‌చైర్మెన్, మేనేజింగ్ డైరెక్టర్ చంద్రశేఖర్‌రెడ్డి, హైదరాబాద్ టైగర్ కన్జర్వేషన్ సొసైటీ డైరెక్టర్ ఇమ్రాన్, డబ్ల్యూసీఎస్ ఇండియా లీగల్ హెడ్ కె.శ్యామ, తదితరులు పాల్గొన్నారు.
కేవీబీఆర్ పార్కు వాకర్స్, విజిటర్స్ పాసుల వెబ్‌సైట్‌ను ఆవిష్కరించిన మంత్రి
కొత్తగూడ కేవీబీఆర్ బొటానికల్ పార్క్ వాకర్స్ వార్షిక, నెల వారీ పాసుల రెన్యూవల్, కొత్త పాసులకు దరఖాస్తు, సందర్శకుల ప్రవేశ టికెట్ల ఆన్లైన్ సేవల వెబ్‌సైట్‌ను అటవీ, పర్యావరణ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి శుక్రవారం ప్రారంభించారు. బొటానికల్ గార్డెన్ థీమ్ పార్క్ బ్రోచర్‌ను కూడా మంత్రి చేతుల మీదుగా ఆవిష్కరించారు.
అటవీ అభివృద్ధి సంస్థకు హెచ్డీఎఫ్సీ విరాళం రూ.87.75 లక్షలు
కార్పొరేట్ సామాజిక బాధ్యత (సీఎస్ఆర్)లో భాగంగా రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థకు హెచ్డీఎఫ్సీ బ్యాంక్ రూ.87.75 లక్షల విరాళాన్ని ప్రకటించింది.
దీనికి సంబంధించిన చెక్‌ను మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి ఆ బ్యాంకు ప్రతినిధులు శుక్రవారం హైదరాబాద్‌లో అందజేశారు. చిలుకూరు అర్బన్ ఫారెస్ట్ పార్కులో మొక్కల పెంపకానికి ఈ నిధులను వెచ్చించనున్నారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా తమ వంతు బాధ్యతగా మొక్కలు పెంపకానికి విరాళం ఇచ్చిన బ్యాంకు ప్రతినిధులను మంత్రి అభినందించారు.