Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- భద్రాచలంలో చంద్రబాబు పర్యటన..!
- రాముని దర్శనం, ప్రత్యేక పూజలు
నవతెలంగాణ-భద్రాచలం
గోదావరి వరదలను దృష్టిలో పెట్టుకొని 20 ఏండ్ల కిందటే తమ ప్రభుత్వ హయాంలో కరకట్టను ప్రపంచ బ్యాంకు నిధులతో నిర్మించామని టీడీపీ జాతీయ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. ఏపీ, తెలంగాణ సరిహద్దులోని విలీన మండలాల్లోని వరద ప్రభావిత ప్రాంతాల్లో ఆయన రెండో రోజూ పర్యటించారు. పర్యటనలో భాగంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని భద్రాచలంలో గురువారం రాత్రి ఆయన బస్సులోనే బస చేశారు. శుక్రవారం భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకి ఆలయ అధికారులు, అర్చకులు ఘన స్వాగతం పలికారు. అనంతరం శ్రీ లక్ష్మీ తయారమ్మ వారిని, అభయాంజనేయ స్వామి వారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. తదుపరి కరకట్టకు చేరుకొని కరకట్ట పరిసరాలను వీక్షించి ఆనాటి జ్ఞాపకాలను గుర్తు చేస్తున్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
ముందు చూపుతో కరకట్టను నిర్మించడం కారణంగా నేడు భద్రాచలం పట్టణం సురక్షితంగా ఉందని అన్నారు. ప్రస్తుత ప్రభుత్వం దీర్ఘకాలిక ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని కరకట్ట ఎత్తు పెంచి వరద ముంపు నివారించాలని తెలిపారు. గోదావరి ముంపు బాధితులకు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు తప్పకుండా న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. తెలుగు ప్రజలు ఉన్నంతవరకు తెలుగుదేశం పార్టీ ఉంటుందని, వరద బాధితులకు అండగా నిలుస్తుందని చెప్పారు. కరకట్ట పరిశీలన అనంతరం చంద్రబాబు ప్రత్యేక వాహనంలో ముంపు మండలాలకు బయలుదేరి వెళ్లారు. చాలా సంవత్సరాల తర్వాత మాజీ సీఎం చంద్రబాబు భద్రాచలం రావటం స్థానికుల్లో జోష్ నింపింది. హరిత టూరిజం హౌటల్లో ఉన్న చంద్రబాబును వీక్షించేందుకు ఆయన అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. స్థానిక టీడీపీ నాయకులు చంద్రబాబును కలిసి తమ అభిమానాన్ని చాటుకున్నారు. భద్రాచలం ఎమ్మెల్యే పొదెం వీరయ్య కూడా చంద్రబాబును కలిసి స్థానిక సమస్యలను ఆయన దృష్టికి తీసుకువెళ్లారు.