Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు
- సినారె జయంతి సందర్భంగా విశ్వంభర సాహిత్య పురస్కారం అందుకున్న ఒరియా రచయిత్రి ప్రతిభారాయ్
నవతెలంగాణ-కల్చరల్
తెలుగు భాష పరిరక్షణే సినారెకు నిజమైన నివాళి అని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. మాతృ భాష నిర్బంధ బోధన రాజ్యాంగంలోని ఆర్టికల్ 8వ షెడ్యూల్‌ను అనుసరించి ఉండాలని తెలుగు కవితా రారాజు సి.నారాయణరెడ్డి ఆకాంక్షించారని తెలిపారు. హైదరాబాద్‌లోని రవీంద్రభారతి ప్రథమ వేదికపై సుశీల నారాయరెడ్డి ట్రస్ట్ నిర్వహణలో శుక్రవారం సినారె 91వ జయంతి నిర్వహించారు. ఆయన పేరిట ఏర్పరచిన విశ్వంభర జాతీయ సాహిత్య పురస్కారాన్ని ఒరియా రచయిత్రి ప్రతిభారారుకి వెంకయ్య నాయుడు చేతులమీదుగా అందజేసి సత్కరించారు. ఐదు లక్షల నగదు, ప్రశంసా పత్రం, జ్ఞాపికను అందజేశారు. ఈ సందర్భంగా వెంకయ్య నాయుడు మాట్లాడుతూ.. విశ్వంభర కావ్యంలో విశ్వ సాహితీ రంగంలో వెలుగొందిన సినారె మానవత, ప్రకృతి, మానవుడు వంటి కవితా వస్తువులని ఎంచుకున్నారని తెలిపారు. ప్రతిభారారు ఒరియా మాతృ భాష ప్రేమికురాలిగా సామాజిక చింతన, సమకాలీన సమస్యల అంశాలుగా నవలలు, కథలు రాసిన మహా రచయిత్రి అని అభినందించారు. విశ్వంభర కావ్యంలో మనస్సు గురించి సినారె చెప్పిన కవితా పంక్తులను వెంకయ్యనాయుడు ఉదహరిస్తూ.. దేనికైనా మనస్సును సిద్ధం చేసుకున్నప్పుడు నిరాశ నిస్పృహకు తావుండదన్నారు.
పురస్కార స్వీకర్త ప్రతిభారారు మాట్లాడుతూ.. కళలు, సాహిత్యం ప్రాంతాలకు అతీతం అన్నారు. భాష ప్రాంతీయత కావచ్చని, సాహిత్యం విశ్వజనీనమని చెప్పారు. ప్రాంతాలను కలిపేది, పరస్పర స్నేహభావం పెంచేది, భిన్న సంస్కృతుల సమైక్యతను చాటేది సాహిత్యమేనని అన్నారు.
సమావేశానికి అధ్యక్షత వహించిన వ్యవసాయశాఖ మంత్రి సి.నిరంజన్‌రెడ్డి మాట్లాడుతూ.. ప్రగతిశీల మానవతావాది సినారె సాహిత్యంలో చెరగని ముద్ర వేశారని కొనియాడారు. రాజ్యసభ సభ్యునిగా ఆయన అవకాశాన్ని వదులుకోకుండా 624 ప్రశ్నలు వేసి సమాధానాలు రాబట్టారని గుర్తు చేశారు. ఎంపీ నిధుల నుంచి గుజరాత్‌లోని ప్రభుత్వ విద్యాలయం మరమ్మతులకు ఇచ్చి అక్కడి నాయకుల కండ్లు తెరిపించారని చెప్పారు. ఆత్మాభిమానం సినారె ప్రతీక అన్నారు.
రచయిత్రి వోల్గా మాట్లాడుతూ... ప్రతిభారాయ్ భారతీయ రచయిత్రుల అందరిలో మహా శ్వేతాదేవి వరుసలో నిలిచే అగ్రశ్రేణికి చెందిన వారన్నారు. ఆమె రచనలు, వ్యక్తిత్వం ఉన్నత విలువలుతో ఉంటాయన్నారు. ట్రస్ట్ కార్యదర్శి డాక్టర్ చెన్నయ్య స్వాగతం పలుకగా సినారె మునిమనుమరాలు యశస్వినీరెడ్డి ప్రశంస పత్రం చదివారు. పట్టిపాక మోహన్, ఆశాలత వ్యాఖ్యానం చేసిన సభకు తొలుత దీపికా రెడ్డి తన శిష్య బృందంతో చేసిన సినారె గీతాలు, నృత్య రూపకం ఆకట్టుకుంది.