Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆగస్టు7నుంచి సంగారెడ్డిలో కేవీపీఎస్ రాష్ట్ర మూడో మహాసభలు
- పోస్టర్ను ఆవిష్కరించిన జాన్ వెస్లీ, స్కైలాబ్ బాబు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
దళితుల సమస్యల పరి ష్కారం వారి సమగ్రాభివృద్ధి లక్ష్యంగా కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం(కేవీపీఎస్) రాష్ట్ర మూడో మహాసభలను ఆగస్టు7 నుంచి సంగారెడ్డిలో నిర్వహించనున్నట్టు ఆ సంఘం రాష్ట్ర అధ్యక్ష, ప్రధానకార్యదర్శు లు జాన్ వెస్లీ, టి స్కైలాబ్ బాబు తెలిపారు. హైదరాబాద్లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో శుక్రవారం మహాసభల వాల్ పోస్టర్ను వివిధ ప్రజాసంఘాల నాయకులతో కలిసి వారు ఆవిష్కరించారు. మహాసభల సందర్భంగా ఆగస్టు 7న సంగారెడ్డిలో నీలిదండు కవాతు, బహిరంగ సభ నిర్వహించనున్నట్టు తెలిపారు. ముఖ్యఅతిధిగా కేరళ దేవాదాయ శాఖ మంత్రి కె రాధాకృష్ణన్ హాజరవుతున్నట్టు పేర్కొన్నారు. రాష్ట్రంలో రోజురోజుకు కుల దురహంకార హత్యలు, సాంఘీక బహిష్కరణలు, దాడులు, దౌర్జన్యాలు పెరగటం పట్ల వారు ఆందోళన వ్యక్తం చేశారు. బీజేపీ అనుసరిస్తున్న మనువాద విధానాలు, రిజర్వేషన్ల రద్దుకు వ్యతిరేకంగా ఉద్యమాలకు శ్రీకారం చుడతామని చెప్పారు. 8న ప్రతినిధుల సభ ప్రారంభానికి ప్రముఖ సామాజిక వేత్త జేబీరాజు హాజరవుతారని తెలిపారు. డీఎస్ఎంఎం జాతీయ కార్యదర్శి బీవీ రాఘవులు అతిథిగా హాజరవుతారని పేర్కొన్నారు. ఆ కార్యక్రమంలో ఆవాజ్ రాష్ట్ర కార్యదర్శి ఎమ్డీ అబ్బాస్, టీపీఎస్కే రాష్ట్ర కార్యదర్శి కె హిమబిందు, రైతు సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి మూడ్ శోభన్, కేవీపీఎస్ నగర నాయకులు ఎం దశరద్ తదితరులు పాల్గొన్నారు.