Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆగస్టు 14న జనజాగృతి జాగరణ
- 22న కలెక్టరేట్ల ముట్టడి, 31న మున్సిపాల్టీల్లో నిరసనలు
- అక్టోబర్ 15న హన్మకొండలో భారీ బహిరంగ సభ : పాలడుగు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
'సఫాయి సైనికుల్లారా సమస్యల పరిష్కారం కోసం దశలవారీ పోరాటాలకు సిద్ధంకండి' అని సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్ పిలుపునిచ్చారు. శుక్రవారం హైదరా బాద్లో తెలంగాణ మున్సిపల్ వర్కర్స్, ఎంప్లాయీస్ యూనియన్ సమావేశాన్ని ఆ యూనియన్ ప్రెసిడెంట్ జనగాం రాజమల్లు అధ్యక్షతన నిర్వహించారు.
ఈ సందర్భంగా భాస్కర్ మాట్లాడుతూ... పీఆర్సీలో నిర్ణయించిన మేరకు మున్సిపల్ కార్మికులకు వేతనాలు అమలు చేయాలనీ, జీవో నెంబర్ 4 ప్రకారం అన్ని మున్సిపాల్టీల్లోనూ ఏరియర్స్ చెల్లించాలనీ, కొత్త కార్మికులకు రూ.15,600 వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు. వీటి పరిష్కారం కోసం ఆగస్టు 8న రాష్ట్రవ్యాప్తంగా నిరసన ప్రదర్శనలు చేయాలని పిలుపునిచ్చారు. 14న 'జనజాగృతి జాగరణ'ను నిర్వహిస్తామన్నారు. కేటగిరీల వారీగా వేతనాలి వ్వాలనీ, పాఠశాలల్లో మున్సిపల్ కార్మికులతో మరుగుదొడ్లు కడిగించొద్దని డిమాండ్ చేస్తూ 22న కలెక్టరేట్లను ముట్టడిస్తామని ప్రకటించారు. 21 వేల రూపాయల కనీస వేతనం, కార్మిక సంక్షేమ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ 30న మున్సిపల్ కేంద్రాల్లో ధర్నాలు చేస్తామన్నారు.
అక్టోబర్ 15న హన్మకొండలోని పబ్లిక్ గార్డెన్లో భారీ బహిరంగ సభ నిర్వహించి సమ్మె కార్యాచరణ ప్రకటిస్తామని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం కార్మికులు, కార్మిక సంఘాలు, కార్మిక చట్టాలపై తీవ్రదాడి చేస్తున్నదని విమర్శించారు. కార్పోరేట్ సంస్థలకు లాభాలు చేకూర్చే విధంగా విధానాల రూపకల్పన చేస్తున్నదన్నారు. చివరకు నిత్యావసర సరుకులపై సైతం జీఎస్టీ పేరుతో భారాలు మోపడం దారుణమని విమర్శించారు. ఈ సమావేశంలో రాష్ట్ర ఆఫీస్ బేరర్స్ గుర్రం అశోక్, వి.నాగమణి, ఎర్ర నర్సింహులు, జుక్కుల రవి, వెంకటస్వామి, పి. సుధాకర్, వాణి, విష్ణు, కిషన్, యాదమ్మ, శ్రావణ్, మల్లేష్, బుజ్జమ్మ, రాజనర్సు, ఉప్పలయ్య, నెమ్మాది వెంకటేశ్వర్లు, సాయిలు, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.