Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఐదుగురు కార్మికులు మృతి
నవతెలంగాణ - మహబూబ్‌నగర్ ప్రాంతీయప్రతినిధి
పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టులో భాగంగా చేపట్టిన టన్నెల్ పనుల్లో ప్రమాదం జరిగింది. ఐదుగురు కార్మి కులు మృతిచెందారు. ఈ ఘటన నాగర్‌కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలం ఎల్లూరు గ్రామ సమీపంలోని పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టులో శుక్రవారం తెల్లవారుజామున జరిగింది. ఇందుకు సంబంధించి స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం..
ప్రాజెక్టులో జార్ఖండ్, బీహార్, ఏపీకి చెందిన దాదాపు 12 వేల మంది కార్మికులు పని చేస్తున్నారు. అందులో టన్నెల్, సంపు, సర్జిఫుల్ పనులు చేపట్టారు. కాంక్రీట్ తీసుకెళ్తున్న క్రేన్ తెగి సర్జిఫుల్ పనులు చేస్తున్న కూలీలపై పడింది. దీంతో ఏపీకి చెందిన సూపర్వైజర్ శ్రీనివాసులు (35), జార్ఖండ్‌కు చెందిన కమలేష్(25), ప్రవీణ్(19), బీహార్‌కు చెందిన బోలోనాథ్ యాదవ్(55), గుజరాత్‌కు చెందిన సోను(19) మృతిచెందారు. అయితే, ఈ ఘటన బయటకు పొక్కకుండా ఉండేందుకు కంపెనీ యాజమాన్యం మృతదేహాలను రాత్రికి రాత్రే హైదరాబాద్‌లోని ఉస్మానియా ఆస్పత్రికి తరలించింది. ఈ ఘటనతో కార్మికుల్లో భయాందోళన మొదలైంది. భారీగా పోలీసులను మోహరించి ఎవరినీ లోపలికి రానివ్వకుండా చేసింది. విషయం తెలుసుకున్న సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్ధం పర్వతాలు, నాయకులు బాధితులను పరామర్శించేందుకు వెళ్లారు. కానీ పోలీసులు ప్రాజెక్టుకు కిలోమీటరు దూరంలోనే అడ్డుకుని స్టేషన్‌కు తరలించారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కార్మిక శాఖ జాతీయ చైర్మెన్ శ్రీనివాస్ నాయుడు ప్రమాద ప్రాంతాన్ని పరిశీలించేందుకు రాగా, పోలీసులు అడ్డుకున్నారు. అనంతరం ఉన్నతా ధికారుల నుంచి అనుమతి రావడంతో ఆయన లోపలికి వెళ్లి బాధిత కుటుంబ సభ్యులు, కార్మికులను పరామర్శించి, ప్రమాద ప్రాంతాన్ని పరిశీలించారు. ఘటనకు గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. మేఘా కంపెనీ సభ్యులతో చర్చించారు. ఈ దుర్ఘట బాధాకరమని, ఈ ఘటనపై హైకోర్టుకు వెళతామని తెలిపారు.
రూ.40 లక్షలు చెల్లించాలి : మాజీ మంత్రి జూపల్లి
పాలమూరు-రంగారెడ్డి ప్రమాద బాధితులకు రూ.40 లక్షల చొప్పున పరిహారం అందించాలని మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు డిమాండ్ చేశారు. శుక్రవారం ఆయన హైదరాబాద్‌లోని ఉస్మానియా ఆస్పత్రిలో మృతుల కుటుంబాలను పరామర్శించి మాట్లాడారు. కంపెనీ యాజ మాన్యంతో మాట్లాడి ప్రమాద ఘటనకు బాధ్యత వహించి నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు.