Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఉభయ తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘాల రౌండ్‌టేబుల్‌లో వక్తలు
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
ప్రజాసమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం వహిస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విధానాలకు వ్యతిరేకంగా ఆగస్టు 1వ తేదీ జరిగే దేశవ్యాప్త ఆందోళనల్లో ప్రజలు పెద్ద సంఖ్యలో భాగస్వాములు కావాలని ఆలిండియా అగ్రికల్చరల్ వర్కర్స్ యూనియన్ (ఏఐఏడబ్ల్యూయూ), భారతీయ ఖేత్ మజ్దూర్ యూనియన్ (బీకేఎమ్‌యూ) తెలంగాణ రాష్ట్ర కమిటీల సంయుక్తాధ్వర్యంలో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశం పిలుపునిచ్చింది. ఆరోజు రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయాల వద్ద ఆందోళనలు నిర్వహిస్తామని తెలిపింది. బీకేఎమ్‌యూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బాలమల్లేష్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఏఐఏడబ్ల్యూయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ వెంకట్రాములు ''అందరికీ సాగుభూమి, ఇండ్లస్థలాలు, ఇండ్లు, రేషన్, విద్యా, ఉపాధి, వైద్యం అందించాలి'' అని డిమాండ్ చేస్తూ తీర్మానం ప్రవేశపెట్టారు. దీనిపై తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి అరిబండి ప్రసాదరావు, మూడ్ శోభన్‌నాయక్, తెలంగాణ గిరిజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ శ్రీరాంనాయక్, ఆవాజ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మహ్మద్ అబ్బాస్, సీఐటీయూ రాష్ట్ర కమిటీ సభ్యులు శ్రీకాంత్, ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి ఎమ్ నర్సింహా, కులవివక్ష పోరాట సంఘం (కేవీపీఎస్) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టీ స్కైలాబ్, దళిత హక్కుల పోరాట సమితి (డీహెచ్‌పీఎస్) రాష్ట్ర నాయకులు కే సహదేవ్, దళిత బహుజన ఫ్రంట్ (డీబీఎఫ్) జాతీయ కార్యదర్శి శంకర్, ఏఐఏడబ్ల్యూయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు బీ ప్రసాద్, బీ పద్మ, బీకేఎమ్‌యూ రాష్ట్ర నాయకులు టీ శంకర్, మహాలక్ష్మి తదితరులు మాట్లాడుతూ, తీర్మానాన్ని బలపరుస్తున్నట్టు ప్రకటించారు. ల్యాండ్ పూలింగ్ పేరుతో ప్రభుత్వాలు రియల్ఎస్టేట్ బిజినెస్ చేస్తున్నాయని విమర్శించారు. ధరల పెంపు ప్రభావం సమాజంపై తీవ్రంగా పడుతున్నదన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ, పోటీపడి అన్ని రకాల ప్రభుత్వ సేవల చార్జీలు పెంచుతున్నాయని తెలిపారు. కేంద్రం గ్యాస్, పెట్రోల్, డీజిల్‌తోపాటు అన్ని వస్తువులపై జీఎస్టీను పెంచుకుంటూ పోతున్నదనీ, సబ్సిడీలను ఎత్తేస్తున్నదని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఆర్టీసీ, కరెంటు చార్జీలతో పాటు అన్ని రకాల ప్రభుత్వ సేవల చార్జీలను పెంచేశారని ఉదహరించారు.
వీటికి వ్యతిరేకంగా ఆగస్టు 1వ తేదీ జరిగే దేశవ్యాప్త ఆందోళనల్లో అందరం భాగస్వాములమవుతామని చెప్పారు. ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చేస్తున్నారని విమర్శించారు. సమగ్ర వ్యవసాయ సంక్షేమ చట్టం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. బీజేపీ కార్పొరేట్ ఆర్ధిక విధానాలకు వ్యతిరేకంగా అన్ని తరగతులను ఐక్యం చేస్తూ పోరాటం కొనసాగించాలని చెప్పారు.