Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కుంచిత రాజకీయాల కోసమే ఐటీఐఆర్ రద్దు
- ఆ స్థాయిలో ప్రాజెక్టులు ఇచ్చామంటూ పార్లమెంటులో అబద్ధాలు : బీజేపీపై మంత్రి కేటీఆర్ ఫైర్
నవతెలంగాణ-హైదరాబాద్బ్యూరో
హైదరాబాద్లో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇన్వెస్ట్మెంట్ రీజియన్ (ఐటీఐఆర్) ప్రాజెక్టును రద్దు చేశామంటూ పార్లమెంట్లో కేంద్రం చేసిన ప్రకటన సిగ్గుచేటని రాష్ట్ర పురపాలక, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి, టీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షులు కే తారకరామారావు విమర్శించారు. దానికి తోడు ఐటీఐఆర్ స్థాయిలో రాష్ట్రానికి పలు ప్రాజెక్టులను మంజూరు చేశామంటూ కేంద్రప్రభుత్వం పార్లమెంట్లో నిస్సిగ్గుగా అబద్దాలు చెప్పి దేశ ప్రజలను మోసం చేసిందని ఘాటుగా స్పందించారు. బీజేపీ పార్టీ డీఎన్ఏలోనే ఉన్న అసత్యాలు, అవాస్తవాలు, పచ్చి అబద్దాలను ఎప్పటిలాగే కేంద్రమంత్రి రాజీవ్ చంద్రశేఖర్ అలవోకగా వల్లె వేశారని ఎద్దేవా చేశారు. ఐటీఐఆర్ ప్రాజెక్టుకు సమానస్థాయిలో హైదరాబాద్ ఐటీకి అవసరమైన ఏదైనా పథకాన్ని ప్రకటించాలని కనీసం 50సార్లు కేంద్రాన్ని కోరామని ఈ సందర్భంగా మంత్రి గుర్తుచేశారు. అయినా మోడీ ప్రభుత్వం హైదరాబాద్ ఐటీ ఈకోసిస్టమ్కు నయా పైసా మందం సహాయం చేయలేదన్నారు. ఐటీఐఆర్ రద్దుతో ఎనిమిదేండ్లలో తెలంగాణకు జరిగిన నష్టంపై వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రపంచంలోనే అతిపెద్ద ఇంక్యూబేటర్ టీ హాబ్ -2 నిర్మాణాన్ని రూ.450 కోట్లతో పూర్తి చేస్తే, దానికి కేంద్రం నుంచి పైసా సహాయం లేదని చెప్పారు. కేంద్రం తాజాగా ప్రకటించిన 22 సాఫ్ట్వేర్ పార్కుల్లో తెలంగాణకు ఒక్కటి కూడా కేటాయించని కుట్రపూరిత ప్రభుత్వం కేంద్రంలో ఉందన్నారు. రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం చేస్తున్న అన్యాయాలను తెలంగాణ యువత గమనిస్తున్నదని తెలిపారు. రాజకీయంగా వారితో విభేదిస్తున్నామన్న ఒకే ఒక్క కారణంతో హైదరాబాద్ ఐటీఐఆర్ ప్రాజెక్టును రద్దుచేసి మోడీ ప్రభుత్వం తెలంగాణకు తీరని అన్యాయం చేసిందని పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోడీ అనాలోచిత, అసంబద్ధ నిర్ణయాలైన నోట్ల రద్దు, కరోనా లాక్ డౌన్, విధాన పక్షవాతాలతో ఏర్పడ్డ ఆర్థిక, సామాజిక సంక్షోభంలోనూ దేశ సగటును మించిన అద్భుతమైన ప్రగతిని తెలంగాణ ఐటీ పరిశ్రమ సాధించిందన్నారు. ఈ ధోఖాను కప్పిపుచ్చుకునేందుకు బీజేపీ గల్లీ లీడర్లు పూటకో మాట మాట్లాడి ఇన్ని రోజులు పబ్బం గడుపుకున్నారని విమర్శనాస్త్రాలు సంధించారు. తెలంగాణ ఐటీ గ్రాడ్యుయేట్లు, వత్తి నిపుణులు, యువతకు మోడీ ప్రభుత్వం క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.