Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- దాన్ని అడ్డుకోవటం తక్షణావసరం : అఖిలేశ్ యాదవ్‌తో భేటీలో సీఎం కేసీఆర్
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
కేంద్రంలోని బీజేపీ సర్కారు అనుసరిస్తున్న రాజ్యాంగ వ్యతిరేక విధానాల వల్ల అంతర్జాతీయంగా భారతదేశ కీర్తి మసకబారుతున్నదని సీఎం కేసీఆర్ ఆందోళన వ్యక్తం చేశారు. నిత్యావసరాల ధరల పెరుగుదలకు మోడీ ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాలే కారణమని ఆయన విమర్శించారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎంతో శుక్రవారం ఉత్తర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్ భేటీ అయ్యారు. హస్తినలోని కేసీఆర్ నివాసంలో రెండు గంటలకు పైగా కొనసాగిన ఈ సమావేశంలో వారిరువురూ జాతీయ రాజకీయాలపై ప్రధానంగా చర్చించారు. బీజేపీ రాజకీయ విలువలను నానాటికీ కాలరాస్తోందంటూ సీఎం ఈ సందర్భంగా విమర్శించారు. తనకు వ్యతిరేకంగా మాట్లాడిన నాయకులపై సీబీఐ, ఈడీలను ఉసిగొల్పుతున్నదంటూ అసహనం వ్యక్తంచేశారు. అందువల్ల ఆ పార్టీని అడ్డుకోవటమనేది దేశానికి తక్షణ అవసరమని నొక్కిచెప్పారు. బీజేపీ వ్యతిరేక పోరాటంలో కలిసిరావాలని అఖిలేశ్‌ను ఆయన కోరారు. యూపీలో యోగి ప్రభుత్వం అరా చకపాలనను కొనసాగిస్తోందని ఈ సందర్భంగా అఖిలేశ్ తెలిపారు. సమావేశంలో సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ రాంగోపాల్ యాదవ్, టీఆర్ఎస్ ఎంపీ సంతోష్ కుమార్ కూడా పాల్గొన్నారు.
నేడు రాష్ట్రానికి కేసీఆర్..?
మరోవైపు తన ఢిల్లీ పర్యటనను ముగించుకుని సీఎం కేసీఆర్... శనివారం హైదరాబాద్‌కు రానున్నట్టు తెలిసింది. ఈనెల 25 రాత్రి ఆయన రాజధానికి బయల్దేరి వెళ్లిన సంగతి విదితమే. అయితే ఆయన పర్యటన, అక్కడ ఎవరెవర్ని కలిశారు..? ఏయే కార్యక్రమాల్లో పాల్గొన్నారనే విషయాలను బయటకు పొక్కకుండా అధికారులు జాగ్రత్త పడ్డారు. ఇదే సమయంలో ఆయన తన ఆరోగ్య, వైద్య పరీక్షల నిమిత్తమే ఢిల్లీ వెళ్లారనే వార్తలు కూడా రావటం గమనార్హం. నూతనంగా ఎన్నికైన రాష్ట్రపతి ద్రౌపతి ముర్మును కేసీఆర్ కలుస్తారంటూ వార్తలొచ్చినప్పటికీ... ఇప్పటి వరకూ సీఎం ఆమెను కలవకపోవటం గమనార్హం. రాష్ట్రపతి అపాయింట్మెంట్ దొరక్కపోవటమే ఇందుకు కారణమంటూ పలువురు అభిప్రాయపడుతున్నారు.