Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గిరిజన ఆశ్రమ పాఠశాలలో ఫుడ్ పాయిజన్
- 36మందికి హాస్టల్లో, ఏడుగురికి ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స
- హాస్టల్‌ను సందర్శించిన అదనపు కలెక్టర్, ఎమ్మెల్యే
- అధికారులపై చర్యలు తీసుకోవాలని ఎస్ఎఫ్ఐ ధర్నా
నవతెలంగాణ-మహబూబాబాద్
'వానపాముల పప్పు.. బొద్దింకల అన్నం.. పసుపు నీళ్ల చారు.. కుళ్ళిపోయిన కూరగాయలు.. ఒక గదిలో 25మంది విద్యార్థులకు వసతి.. మరో వైపు.. ఇంట్లో ఇంతకంటే మంచి అన్నం, వసతి దొరుకుతుందా అంటూ వార్డెన్ల చీత్కారాలు.. ఉన్నతాధికారుల బెదిరింపులు.. ఎంతమంది అధికారులు హాస్టల్‌కు వచ్చి తనిఖీ చేసి వెళ్తారే తప్ప ఎలాంటి చర్యలూ తీసుకోరు. వెరసి.. శుక్రవారం ఫుడ్ పాయిజన్ కావడంతో సుమారు 50మందికి పైగా హాస్టల్ విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. ఇదీ మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాల హాస్టల్ పరిస్థితి.
మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని కలెక్టర్ క్యాంపు కార్యాలయం ఎదురుగా ఉన్న గిరిజన ఆశ్రమ బాలికల పాఠశాలలో 957 మంది విద్యార్థులు చదువుతున్నారు. గురువారం మధ్యాహ్నం భోజనంలో హాస్టల్లో వండిన పప్పులో వానపాములు వచ్చాయి. అప్పటికే కొంతమంది భోజనం చేశారు. మరికొందరు బాలికలు చూసి భయాందోళనకు గురై భోజనం చేయలేదు. కొంతమందికి టమాటాలు తీసుకొచ్చి వండి పెట్టారు. అలాగే అన్నంలో బొద్దింకలు రాగా వాటిని తీసేసి తిన్నారు. దాంతో అదేరోజు సాయంత్రం నుంచి పలువురు బాలికలకు వాంతులు, విరోచనాలు అయ్యాయి. రాత్రి 12గంటల వరకు అధికారులు ఎవరూ పట్టించుకోలేదు. ఏఎన్ఎం టాబ్లెట్ ఇవ్వగా వేసుకుని పడుకున్నారు. శుక్రవారం నుంచి వాంతులు ఎక్కువ కావడంతో ఏడుగురు బాలికలను స్థానిక ఏరియా ఆస్పత్రికి తరలించారు. వెంటనే అధికారులు, వైద్యులు, హాస్టల్లోనే వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. సుమారు 36మందికి వాంతులు, విరోచనాలు కాగా ఏడుగురు ఆస్పత్రిలో ఉండగా, ఒకరు ఐసీయూలో, ఆరుగురు ఎమర్జెన్సీ వార్డులో చికిత్స పొందుతున్నారు. కాగా ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ఆశ్రమ పాఠశాల ఎదుట ధర్నా చేసి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
కలెక్టర్, మంత్రి ఇంటికి సమీపంలోనే ఆశ్రమ పాఠశాల
మానుకోట పట్టణంలోని గిరిజన ఆశ్రమ పాఠశాలకు ఎడమవైపు ఏటీడబ్ల్యూ కార్యాలయం, కుడివైపు ఆర్డీవో కార్యాలయం ఉంది. వాటికి ఎదురుగా కలెక్టర్ ఇల్లు, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతిరాథోడ్ ఇండ్లు ఉన్నాయి. వారికి సమీపంలోనే ఆశ్రమ పాఠశాల ఉంది. అయినా బాలికలకు మెనూ ప్రకారం భోజనం అందించడం లేదు. హాస్టల్‌పై అధికారుల పర్యవేక్షణ కొరవడటంతో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఉన్నత హోదాలో ఉన్న వారందరూ అతి సమీపంలోనే ఉన్నా నిర్లక్ష్యం వీడడం లేదు. దాంతో ఫుడ్ పాయిజన్ ఘటన నెలకొంది. ప్రభుత్వ గిరిజన ఆశ్రమ పాఠశాలలపై ప్రభుత్వానికి ఎంత చిత్తశుద్ధి ఉందో ప్రస్తుత ఘటన ద్వారా తేటతెల్లమైందని పలువురు ఆరోపిస్తున్నారు.
అధికారులను సస్సెండ్ చేయాలి : ఎమ్మెల్యే శంకర్‌నాయక్
ఫుడ్ పాయిజన్ ఘటన విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే బానోత్ శంకర్‌నాయక్, అదనపు కలెక్టర్ డేవిడ్ స్థానిక గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలతోపాటు, ఏరియా హాస్పిటల్‌ను సందర్శించారు. విద్యార్థుల ద్వారా వివరాలు అడిగి తెలుసుకున్నారు. బాధ్యులను సస్పెండ్ చేయాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్రస్థాయి ఉన్నతాధికారితో కమిటీ వేసి చర్యలు తీసుకుంటామని తెలిపారు.
ఎవరూ చావరు.. తినండి అని బెదిరించారు : ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాలికలు
పది రోజులుగా ఆహారం సరిగ్గా ఉండటం లేదు. ఇదే విషయమై మేం ప్రశ్నిస్తే పట్టించుకోలేదు. ఆశ్రమ పాఠశాలకు ఎదురుగా ఉన్న ఏటీడబ్ల్యూ కార్యాలయంలో ఏటీడబ్ల్యూఓ సత్యవతికి ఫిర్యాదు చేశాం. మీ ఇంట్లో ఇంతకంటే మంచి అన్నం తింటున్నారా? మేం కూడా అదే అన్నం తింటున్నాం. ఎవరూ చావరు.. తినండి' అంటూ మమ్మల్ని బెదిరించారని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాలికలు తెలిపారు. జాటోత్ భాను, ఇ. భూమిక, ఎన్ గౌతమి, జి చందన, బి అనిత, బి కావేరి, జి అఖిల ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. పప్పులో వానపాములు రాగా వాటిని తీసేసి అదే పప్పు వడ్డించారని తెలిపారు. అన్నంలో బొద్దింకలు ఉన్నప్పటికీ పట్టించుకోలేదు. చేసేదేమీ లేక ఆహారం తిన్న విద్యార్థులందరూ ఫుడ్ పాయిజన్‌కు గురయ్యారు. వాంతులు, విరోచనాలతో ప్రాణాపాయ స్థితిలో పడ్డారు. బాధ్యులపై చర్యలు తీసుకుని పౌష్టికాహారం అందించేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.