Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తెగిపోయిన రోడ్లు.. కూలిపోయిన వంతెనలు
- మరమ్మతుల కోసం పైసా ఇవ్వని ప్రభుత్వం
- గ్రామాలకు రోజుల తరబడి నిలిచిన రాకపోకలు
- ప్రయాణం నరకప్రాయం
- పునరుద్ధరించాలని జనం ఆందోళనలు
నవతెలంగాణ- ఆదిలాబాద్ ప్రాంతీయ ప్రతినిధి
ఇటీవల కురిసిన భారీ వర్షాలు బీభత్సం సృష్టించాయి. పచ్చని పంటలన్నీ మట్టికొట్టుకుపోయాయి. పొలాల్లో ఇసుక మేటలు వేశాయి.. పోటెత్తిన వరదల తాకిడికి ఉమ్మడి ఆదిలాబాద్, ఖమ్మం, వరంగల్ జిల్లాలతోపాటు గ్రేటర్ హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో రోడ్లు దెబ్బతిన్నాయి. పలుచోట్ల వంతెనలు కొట్టుకుపోయాయి. ఫలితంగా అనేక గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ఇది జరిగి సుమారు పక్షం రోజులు గడిచినా కోతకు గురైన రోడ్లు, కూలిపోయిన వంతెనలు మరమ్మతుకు నోచుకోవడం లేదు. కొద్దిపాటి వర్షం పడిన మహబూబ్‌నగర్ తదితర ప్రాంతాల్లో రోడ్లు అధ్వానంగా ఉన్నాయి.
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో జిల్లా వ్యాప్తంగా సుమారు రూ.77కోట్లు నష్టం జరిగిందని అధికారులు ప్రాథమికంగా నిర్ధారించారు. నిధుల కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించారు. కానీ ప్రభుత్వం నుంచి పునరుద్ధరణ పనుల కోసం పైసా రాలేదు. రాకపోకలు పునరుద్ధరించాలని ఆయా గ్రామాల ప్రజలు అధికారులను వేడుకుంటుంటే.. అధికారులేమో ప్రభుత్వం వైపు చూస్తున్నారు. అత్యవసర పరిస్థితిలోనూ రాకపోకలకు ఇబ్బందులు తలెత్తడంతో ప్రజలు ఆందోళనబాట పడుతున్నారు.
అటవీ విస్తీర్ణం అధికంగా కలిగిన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఇప్పటికీ అనేక ప్రాంతాలకు రోడ్డు సౌకర్యం లేదు. అటవీ ప్రాంతాల్లో ఉన్న అనేక పల్లెలకు సరైన దారి లేని దుస్థితి. కొండలు, గుట్టలు ఎక్కి వ్యయప్రయాసాల కోర్చి ప్రయాణిస్తే కానీ గమ్యం చేరలేని పరిస్థితి. ఇలాంటి జిల్లాలో ఇటీవల వర్షాలు ఉన్న రోడ్లనూ ఊడ్చేశాయి. ఆదిలాబాద్ జిల్లాలో రోడ్లు భవనాలశాఖ, పంచాయతీరాజ్‌కు చెందిన 67రోడ్లు, వంతెనలు దెబ్బతినగా ఇందుకు రూ.20కోట్ల వరకు నిధులు అవసరమని అధికారులు ప్రతిపాదనలు రూపొందించారు.
కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలో రెండు శాఖల పరిధిలో 45రోడ్లు దెబ్బతినగా రూ.21కోట్ల వరకు నష్టం వాటిల్లింది. నిర్మల్ జిల్లాలో రూ.20కోట్లు, మంచిర్యాల జిల్లాలో 38రోడ్లు తెగిపోగా రూ.20కోట్ల వరకు అవసరమవుతాయని అంచనా వేశారు. ఈ నిధుల కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించారు. ఇటీవల వరద అంచనా వేసిన ప్రభుత్వం, అధికారులు సాయం విషయమై ఎలాంటి ప్రకటన చేయకపోవడం ప్రజలను తీవ్ర నిరాశకు గురిచేస్తోంది. ఇంత నష్టం జరిగినా కేంద్ర ప్రభుత్వం కూడా స్పందించలేదు.
అత్యవసరంలోనూ వెళ్లలేని పరిస్థితి
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో అనేక చోట్ల రోడ్లు, వంతెనలు కోతకు గురికావడంతో ఆయా గ్రామాల ప్రజలకు బయటి ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. కొన్ని గ్రామాలకు అధికారులు స్థానిక గుత్తేదారులతో మాట్లాడి తాత్కాలికంగా మరమ్మతులు చేయించారు. ప్రభుత్వం నుంచి బిల్లులు వచ్చిన తర్వాత అందజేస్తామని భరోసా ఇస్తూ పనులు చేయిస్తున్నారు. పెద్ద మొత్తంలో నిధులు అవసరమయ్యే వాటికి మాత్రం వెనుకడుగు వేస్తున్నారు. పనులు చేయించిన తర్వాత నిధులు రాకపోతే ఇబ్బందులు వస్తాయని భావించి వాటి జోలికి వెళ్లడం లేదని తెలుస్తోంది. దీంతో అనేక గ్రామాల ప్రజలు అత్యవసర పరిస్థితిలోనూ బయటి ప్రాంతాలకు వెళ్లలేక అవస్థలు పడుతున్నారు. చాలా చోట్ల రోడ్లు గుంతలుగా మారడంతో వాటిపై ప్రయాణం నరకప్రాయంగా మారింది. ఇచ్చోడ నుంచి బజార్హత్నూర్ వెళ్లే దారిలో అడెగామ(కె) వద్ద రోడ్డు బాగు చేయాలని ప్రయాణికులు రాస్తారోకో చేపట్టారు. కాగజ్‌నగర్ నుంచి దహెగాం వెళ్లే మార్గంలో అందవెల్లి వద్ద రోడ్డు బాగు చేయాలని బీజేపీ నాయకులు నిరసన వ్యక్తం చేశారు. అనేక చోట్ల ఇలాంటి పరిస్థితి ఉంది. ఇచ్చోడ మండలం బాబ్జీపేట్ గ్రామానికి వెళ్లే దారి ఇలా అధ్వానంగా ఉంది. మొరం రోడ్డు కావడం.. ఇటీవల వర్షాలకు రోడ్డు కోతకు గురికావడంతో ఆయా గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
ఆదిలాబాద్ జిల్లా బేల మండలం సాంగ్వి(జి) గ్రామానికి వెళ్లే దారిలో వంతెనకు అనుసంధానంగా ఉన్న రోడ్డు తెగిపోయింది. దీంతో స్వాంగ్వి(జి)తోపాటు అటువైపు గ్రామాలైన పాటగూడ(కె), పాటగూడ(జి)కు రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. ఆయా గ్రామాలవాసులు బయటకు రావాలంటే ఇబ్బందులు పడుతున్నారు.
కాగజ్‌నగర్ నుంచి దహెగాం వెళ్లే దారిలో అందవెల్లి వద్ద వంతెన కొట్టుకుపోయింది. దీంతో అటు వైపు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. అందవెల్లి- బుట్టపెల్లి మధ్యలో సుమారు అర కిలోమీటరు వరకు రోడ్డు అధ్వానంగా ఉండటంతో మరమ్మతు చేయాలని ఆయా గ్రామాల ప్రజలు రోడ్డెక్కి నిరసన తెలిపారు.
మోకాళ్లలోతు గుంతలతో ఇబ్బందులు
అన్నెల చిన్న లక్ష్మణ్- వాహనదారుడు
ఇచ్చోడ నుంచి బజార్హత్నూర్ వెళ్లే దారిలో అడెగాం వద్ద మోకాళ్లలోతు గుంతలు ఏర్పడ్డాయి. వర్షం నీరు అందులో నిల్వ ఉండటంతో వాహనదారులకు తీవ్ర ఇబ్బంది ఉంది. దీంతో ప్రమాదాలకు గురవుతున్నారు. అధికారులు వెంటనే ఈ రోడ్డును బాగు చేయించాలి.
తాత్కాలికంగా మరమ్మతులు చేపడుతున్నాం
రాజేంద్రనాయక్- రోడ్లు, భవనాల శాఖ ఎస్ఈ
చెడిపోయిన, కోతకు గురైన రోడ్లు, వంతెనలకు సంబంధించి నిధుల కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించాం. ఇప్పటి వరకు నిధులు రాలేదు. కానీ తమ శాఖ పరిధిలో కొన్ని చోట్ల కాంట్రాక్టర్లతో మాట్లాడి తాత్కాలికంగా మరమ్మతులు చేయించి రాకపోకలు పునరుద్ధరించాం. మరికొన్ని ప్రాంతాల్లో చేపట్టాలంటే నిధులు అవసరమవుతాయి. ప్రభుత్వం నుంచి రాగానే బాగు చేసేందుకు చర్యలు తీసుకుంటాం.