Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సాగునీటిరంగ నిపుణుల విశ్లేషణ
- ప్రముఖుల పర్యటనలకు కాంట్రాక్టు సంస్థ చెక్ !?
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్
భారీవర్షాల నేపథ్యంలో కాళేశ్వరం పంప్‌హౌజ్‌లు నీటిమునిగిన కారణంగా ఆర్థికంగా భారీ నష్టం జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. మేడిగడ్డ, అన్నారం పంప్‌హౌజ్‌లు పూర్తిగా వరదపాలయ్యాయి. దాదాపు అన్ని మోటార్లు రెండువారాలకుపైగా నీటిలో ఉన్న సంగతి తెలిసిందే. ప్రపంచంలోనే ఇంజినీరింగ్ అద్భుతం కాళేశ్వరం ప్రాజెక్టు అని ప్రారంభోత్సవంలో సర్కారు పదే పదే చెప్పింది. వేల కోట్ల వ్యయమైన కాళేశ్వరం ప్రాజెక్టు ప్రణాళికలో లోపం కారణంగానే పంపు హౌజుల మునకకు కారణమని సాగునీటిరంగ నిపుణులు సైతం అభిప్రాయపడుతున్నారు. అలాగే రాష్ట్రవ్యాప్తంగా రాజకీయ చర్చా ప్రారంభమైంది. ఈ ప్రాజెక్టును దాదాపు రూ. 85 వేల కోట్లతో నిర్మించారు. ఇంకా కొన్ని పనులు పెండింగ్‌లో ఉన్నాయి. ఇందులో రూ.40 వేల కోట్ల పనులు ఒక్క మెఘా ఇంజినీరింగ్ అండ్ ఇన్‌ఫ్రాస్టక్చ్రర్(మెయిల్)సంస్థకు దక్కిన తెలిసిందే. మెఘా ఇంజినీరింగ్ సంస్థ ఈ రెండు పంపుహౌజులకు మోటార్లను అమెరికా, లిబియా దేశాల నుంచి దిగుమతి చేసుకుని అత్యంత తక్కువ సమయంలో బిగించింది. 2019, జూన్‌కు ముందే ట్రయల్ రన్ వేశారు. అనంతరం సీఎం కేసీఆర్, ఏపీ సీఎం జగన్మోహన్రెడ్డి, అప్పటి తెలుగురాష్ట్రాల గవర్నర్ ఇఎస్ఎల్ నరసింహన్, మహారాష్ట్ర సీఎం పడ్నవీస్ సమక్షంలో కాళేశ్వరం మేడిగడ్డ పంపుహౌజు ప్రారంభమైంది. దాదాపు రెండేండ్లు పూర్తయ్యాయి. ఇటీవల కురిసిన వర్షాలు కాళేశ్వరం ప్రాజెక్టు నాణ్యతను ప్రశ్నార్థకం చేశాయి. పంపుహౌజ్ రక్షణ గోడ పనులతోపాటు ఇతర వాటిల్లోనూ నాణ్యత లోపించడం మూలంగానే నష్టం వచ్చిపడిందని సమాచారం. కాగా ఈ సంగతిని ఇటు సాగునీటి శాఖ, అటు రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించడం లేదు. అలాగే నిర్మాణ సంస్థ మెయిల్ సైతం సాగునీటి నిపుణుల అభిప్రాయాలు, మీడియాలో వస్తున్న కథనాలను తోసిపుచ్చుతున్నది. మేడిగడ్డ, అన్నారం పంపుహౌజుల్లో దాదాపు 17 మోటార్లు బిగించారు. వీటిని 'బాహుబలి' మోటార్లుగా కూడా పిలుస్తున్నారు. ఈ మోటార్ల విలువ దాదాపు రూ. 1500 కోట్లని సమాచారం. తాజా తాత్కాలిక అంచనాల ప్రకారం ఈ మోటార్ల మరమ్మత్తులకు రూ. 500 కోట్లకుపైగా ఖర్చయ్యే అవకాశం లేకపోలేదని సాగునీటిరంగ నిపుణులు అంటున్నారు. అలాగే రిటైర్డ్ ఇంజినీర్లు సైతం ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. అయితే మోటార్ల రిపేర్‌కు కేవలం రూ. 25 కోట్లు మాత్రమే ఖర్చవుతుందనీ, ఈ నిధులను కాంట్రాక్టు సంస్థనే భరిస్తుందనీ, త్వరితగతిన మరమ్మత్తు చేస్తామని సాగునీటిశాఖ ప్రత్యేక ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రజత్‌కుమార్ ప్రకటించడాని నిపుణులు తప్పుబడుతున్నారు. పూర్తిస్థాయి అంచనా లేకుండానే స్పెషల్ సీఎస్ ఈ రకమైన ప్రకటన చేయడం విస్మయం వ్యక్తం చేస్తున్నారు.
వీటి మరమ్మత్తుకు ఆరు నుంచి ఎనిమిది నెలల సమయం పడుతుందని ఇంజినీర్లు అంచనా. సాగునీటి శాఖ అధికారులు మాత్రం వరదల్లో పంపు హౌజులు మునగడం సాధారణమేననీ, శ్రీశైలం జలవిద్యుత్ ప్రాజెక్టు 1998, 2008లో, అలాగే కల్వకుర్తి పంపుహౌజ్‌కు ఇదే పరిస్థితి ఎదురైందని అంటున్నారు. వందేళ్లకు ఒకసారి ఇలాంటి వరదలు వస్తుంటాయని సాగునీటిశాఖ సలహాదారు పెంటారెడ్డి వ్యాఖ్యానించడం గమనార్హం. నిర్మాణ లోపాల నుంచి ప్రజల దృష్టి మరల్చడానికి 'క్లౌడ్ బరస్ట్' పేరుతో కొత్త చర్చకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టిందనే విమర్శలూ పెల్లుబి కుతున్నాయి. కాగా ఈ పంపుహజ్ను సందర్శించేందుకు ప్రయత్నించిన పలువురిని కాంట్రాక్టు సంస్థ నివారిస్తున్నదనే విమర్శలు వస్తున్నాయి. రాష్ట్రమంత్రి సత్యవతి రాథోడ్, రాష్ట్ర జలవనరుల సంస్థ చైర్మెన్ వి. ప్రకాశ్, కాంగ్రెస్ నేత, మాజీ మంత్రి డి. శ్రీధర్‌బాబును సైతం నిర్మాణ సంస్థ ప్రతినిధులు ప్రాజెక్టు స్థలాన్ని సందర్శించరాదని కోరినట్టు సమాచారం. ఇదిలావుండగా మాజీ ఐఏఎస్ అధికారి ఆకునూరి మురళిని కాళేశ్వరం ప్రాజెక్టు వద్దకు వెళ్లకుండా ఏకంగా పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.