Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పెండింగ్ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్
- రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం ఎదుట బైటాయింపు
నవతెలంగాణ - గోదావరిఖని
పెద్దపల్లి జిల్లా రామగుండం మున్సిపల్ కార్పొరేషన్లో పనిచేస్తున్న సుమారు 400మంది కాంట్రాక్టు పారిశుధ్య కార్మికులు మెరుపు సమ్మెకు దిగారు. జేఏసీ ఆధ్వర్యంలో కార్మికులు పెద్దఎత్తున కార్పొరేషన్ కార్యాలయం ముందు శనివారం ఉదయం 5గంటల నుంచి 10:30గంటల వరకు సమ్మె నిర్వహించారు. ఈ సందర్భంగా జేఏసీ నాయకులు, సీఐటీయూ జిల్లా అధ్యక్షులు వేల్పుల కుమారస్వామి, సీఐటీయూ సీనియర్ నాయకులు వై.యాకయ్య, టీఆర్ఎస్ అనుబంధ కార్మిక సంఘం మున్సిపల్ అధ్యక్షులు ఎన్.మురళీధర్‌రావు మాట్లాడారు.
మూడేండ్ల నుంచి కార్మికులకు బట్టలు, చెప్పులు, కొబ్బరినూనె, బెల్లం, బుట్టలు, చీపుర్లు, పారలు ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. పనిముట్లు లేకుండా కార్మికులు పనులు ఎలా చేయాలని అధికారులను, పాలకవర్గాన్ని ప్రశ్నించారు. వర్షాలను సైతం లెక్కచేయకుండా తడుస్తూనే పనులు చేశారని, కనీసం రెయిన్ కోట్లు ఇవ్వాలనే కనీస సోయి కూడా అధికారులకు లేకపోవడం సిగ్గుచేటన్నారు. వర్షాల కారణంగా అనేకమంది కార్మికులు అనారోగ్యాలపాలైనారని ఆవేదన వ్యక్తం చేశారు. 7నెలలుగా ఏరియల్స్ ఇవ్వాల్సి ఉందని, ఆడిగినప్పుడల్లా అప్పుడు, ఇప్పుడు అంటూ దాటవేస్తున్నారన్నారు. ఇతర జిల్లాల్లోని మున్సిపాలిటీల్లో ఒకేసారి ఏరియల్స్ చెల్లిస్తే.. ఇంత పెద్ద కార్పొరేషన్లో చెల్లిండడానికి డబ్బులు లేవని చెప్పటం ఏంటని ప్రశ్నించారు. దండుకోవడానికి, ఇతర పనులకు కేటాయించడానికి డబ్బులుంటాయి కానీ కార్మికులకు రావాల్సిన ఏరియల్స్ ఇవ్వడానికి డబ్బులు లేవా అని నిలదీశారు.
సొసైటీలో అనేక అక్రమాలు జరుగుతున్నాయని, కార్మికులు దాచుకున్న డబ్బుల లెక్కచెప్పాలని, అవకతవకలను సరిచేయలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలో మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్, మేయర్ కార్మికుల వద్దకు వచ్చి జేఏసీ నాయకులతో చర్చలు జరిపారు. ఏడు నెలల ఏరియల్స్ బకాయిలు 3నెలల్లో చెల్లిస్తామని, ఆగస్టు 6వ తేదీలోపు ఏడాదికి సంబంధించి బట్టలు, రెయిన్ కోట్లు, చెప్పులు, బెల్లం, చీపుర్లు, బుట్టలు, పారలు అందిస్తామని చెప్పారు. మహిళలకు సపరేట్ రెయిన్ కోట్లు, మగవారికి ఖాకీ బట్టలు ఇస్తామని, మిగిలిన 2సంవత్సరాలవి వచ్చే కౌన్సిల్ సమావేశంలో అప్రూవల్ తీసుకుని ఆగస్టు మూడో వారంలో ఇస్తామని హామీ ఇచ్చారు.
సొసైటీకి సంబంధించిన సమస్యలు 3,4 నెలల్లో పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో సమ్మె విరమించి కార్మికులు విధుల్లోకి వెళ్లారు.
ఈ కార్యక్రమంలో జేఏసీ నాయకులు రామన్న, వేల్పుల రాయమల్లు, వి.నాగమణి,కిషన్ నాయక్, రాధ కష్ణ, సత్యం, సునీత, రమణ, కౌసల్య, రవీందర్, అంజయ్య, రాజేందర్, పద్మ, నర్సయ్య తదితరులున్నారు.