Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
'కళ కళ కోసం కాదు. కళ కాసుల కోసం కాదు. కళ ప్రజల కోసం. ప్రజా ప్రయోజనం కోసం పుట్టింద'ని ప్రముఖ సినీ నటుడు, దర్శకుడు, 'మా' ఉపాధ్యక్షులు మాదాల రవి అన్నారు.తెలంగాణ ప్రజానాట్యమండలి రాష్ట్ర మహాసభల వాల్‌పోస్టర్‌ను సోమవారం హైదరాబాద్ మగ్దూంభవన్‌లో ఆవిస్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజా కళలతోనే ప్రజల్లో చైతన్యం వస్తుందనీ, ఆ దిశగా తెలంగాణ ప్రజానాట్య మండలి పని చేయాలని ఆకాంక్షించారు. తెలుగు రాష్ట్రాల్లో 40 ఏండ్లుగా ప్రజానాట్యమండలి కళాకారులు ప్రదర్శనలిస్తున్నారని తెలిపారు. నాటి నైజాంను గద్దె దించే వరకు పాట, ఆట ద్వారా ప్రజల్లో చైతన్యాన్ని రగిలించారన్నారు. ప్రజా కళాకారులుగా ఎదిగిన వారు సినీ రంగాన్ని సైతం శాసిస్తున్నారని చెప్పారు. రక్త కన్నీరు నాగభూషణం, మిక్కిలినేని రాధాకృష్ణ, అల్లూరి రామలింగయ్య, గుమ్మడి, జమున తదితరులతోపాటు ఆ తర్వాతి తరంలో మాదాల రంగారావు, టి కృష్ణ, పోకూరి బాబూరావు, వందేమాతరం శ్రీనివాస్‌రావు, సుద్దాల అశోక్ తేజ, చైతన్య ప్రసాద్, మద్దినేని రమేష్ లాంటి నటులను, దర్శకులను, రచయితలు, కవులను ప్రజానాట్యమండలి తయారు చేసిందని తెలిపారు. ఈనెల 7న నిర్వహించే తెలంగాణ ప్రజానాట్యమండలి మూడో రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయాలని ఆయన కోరారు కార్యక్రమంలో తెలంగాణ ప్రజానాట్యమండలి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పల్లె నరసింహ, అధ్యక్షులు కే శ్రీనివాస్, వర్కింగ్ ప్రెసిడెంట్ కే ఉప్పలయ్య, ఉపాధ్యక్షుడు రాజేశ్వరరావు, వి కొండలరావు, కే లక్ష్మీనారాయణ, నళిని తదితరులు పాల్గొన్నారు.