Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాష్ట్ర మంత్రి కె.తారక రామారావు
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా ఈ నెల ఏడున నేతన్నల కోసం నూతన బీమా పథకం ప్రారంభిస్తున్నట్టు రాష్ట్ర మంత్రి కె.తారక రామారావు తెలిపారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా తొలిసారిగా తెలంగాణలోనే నేత కార్మికులకు భీమా పథకం అమలు కానున్నదని చెప్పారు. ఇది రైతు బీమా మాదిరిగా ఉంటుందనీ, దీంతో రాష్ట్రంలోని సుమారు 80,000 మంది నేత కార్మికులకు లబ్ధి చేకూరుతుందని తెలిపారు.. 60 ఏండ్లలోపు ఉన్న ప్రతీ నేత కార్మికుడు ఈ పథకానికి అర్హుడని వివరించారు. దురదృష్టవశాత్తు నేత కార్మికులు మరణిస్తే ఐదు లక్షల బీమా పరిహారం అందుతుందనీ, ఈ బీమాతో నేత కార్మికుల కుటుంబాలకు ఆర్థిక భరోసా కలుగుతుందని కేటీఆర్ వివరించారు. 'బీమా కాలంలో లబ్దిదారులైన చేనేత, మరమగ్గాల కార్మికులు ఎవరైనా దురదష్టవశాత్తు చనిపోతే వారి కుటుంబానికి ఆర్థిక భరోసాగా నామినీకి ఐదు లక్షల రూపాయలను అందచేస్తారు. లబ్దిదారులు చనిపోయిన పది రోజుల్లో ఈ మొత్తం ఖాతాలో జమ అవుతుంది. చేనేత, పవర్ లూమ్ కార్మికుల ఎవరైనా దురదృష్టవశాత్తు చనిపోతే వారి కుటుంబాలకు ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు ఉండకూడదన్న ఉద్దేశంతోనే ఈ పథకాన్ని ప్రారంభిస్తున్నాం. ఈ పథకం అమలుకు చేనేత , జౌళి శాఖ నోడల్ ఏజెన్సీగా ఉంటుంది. నేతన్న బీమా కోసం లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ ఆఫ్ ఇండియా (ఎల్ఐసీ)తో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. వార్షిక ప్రీమియం కోసం చేనేత-పవర్ లూమ్ కార్మికులు ఒక్క రూపాయి కూడా కట్టాల్సిన అవసరం లేదు. రాష్ట్ర ప్రభుత్వమే బీమా ప్రీమియం మొత్తాన్ని చెల్లిస్తుంది. ఇందుకోసం రూ.50 కోట్లు కేటాయించాం.రూ. 25 కోట్ల ను ఇప్పటికే విడుదల చేశాం. ఈ పథకం అమలు చేసేందుకు రాష్ట్ర, జిల్లా స్థాయి కమిటీలను ఏర్పాటు చేస్తాం. అర్హులైన చేనేత, పవర్ లూమ్ కార్మికులు, అనుబంధ కార్మికులందరికీ నేతన్న బీమా పథకాన్ని అమలు చేస్తాం....' అని కేటీఆర్ వివరించారు.