Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రజల్లో స్వాతంత్య్ర స్ఫూర్తిని మేల్కొల్పాలి
- వజ్రోత్సవాలపై సీఎం కేసీఆర్ సమీక్ష
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
భారత దేశానికి స్వాతంత్య్ర సిద్ధించి 75 ఏండ్లు పూర్తవుతున్న నేపథ్యంలో ఆగస్టు 8 నుంచి 22వ తేదీ వరకు రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న 'స్వతంత్ర భారత వజ్రోత్సవ ద్వి సప్తాహం' కార్యక్రమాల్లో ప్రజల్ని భాగస్వాముల్ని చేయాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు చెప్పారు. పాఠశాల విద్యార్థులతో పాటు ఉద్యోగులు, ఉన్నతాధికారులు, ప్రజా ప్రతినిధులు యువతీ యువకులు, యావత్ తెలంగాణ సమాజం ఈ ఉత్సవాలల్లో ఉత్సాహంగా పాల్గొనాలని ఆకాంక్షించారు. దీనికోసం రాష్ట్రంలోని 1 కోటీ 20 లక్షల గృహాలకు జాతీయ జెండాలను ఉచితంగా పంపిణీ చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. మంగళవారంనాడాయన ద్వి సప్తాహ కార్యక్రమాల అమలు కమిటీ చైర్మెన్ కే కేశవరావుతో పాటు ఇతర సభ్యులతో ప్రగతిభవన్‌లో సమీక్షా సమావేశం నిర్వహించారు. ప్రతి ఇంటి పై జాతీయ జెండా, ప్రతి గుండెలో భారతీయత ఉప్పొంగాలని చెప్పారు. ప్రతిఇంటిపై జాతీయ జెండా ఆవిష్కరణ కోసం 9వ తేదీనుంచే రాష్ట్రవ్యాప్తంగా జాతీయ పతాకాల పంపిణీ చేపట్టాలని ఆదేశించారు. ఈ పంపిణీ కార్యక్రమం మున్సిపాలిటీలు, గ్రామపంచాయితీల ఆధ్వర్యంలో జరగాలన్నారు. ఆగస్టు 8న వజ్రోత్సవ వేడుకల ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని హైద్రాబాద్ హెచ్ఐసీసీలో ఘనంగా నిర్వహించాలని చెప్పారు. ఆర్మీ లేదా పోలీస్ బ్యాండ్‌తో రాష్ట్రీయ సెల్యూట్, జాతీయ గీతాలాపన, సాంస్కతిక కార్యక్రమాల ప్రదర్శనలు నిర్వహించాలన్నారు. వేడుకల ప్రారంభోత్సవ కార్యక్రమంలో యావత్ అధికారయంత్రాంగం పాల్గొనాలని ఆదేశించారు.
- బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, ఎయిర్ పోర్టులు, స్టార్ హౌటళ్ళు, దవాఖానాలు, షాపింగ్ మాల్స్‌లో ప్రత్యేకాలంకరణలు చేపట్టాలి.
- ప్రభుత్వ భవనాలు ఇతర ప్రతిష్టాత్మక భవనాలను ముఖ్యమైన పబ్లిక్ ప్లేసుల్లో ఈ పదిహేను రోజుల పాటు జాతీయ జెండాలు ఎగురేసి, విద్యుత్ దీపాలు, ప్రత్యేకాలంకరణ చేయాలి.
- ప్రభుత్వ, ప్రయివేట్ పాఠశాల, ఇంటర్, డిగ్రీ విద్యార్థులకు, వక్తృత్వం, వ్యాస రచన, చిత్రలేఖనం, దేశభక్తి గీతాల పోటీలు నిర్వహించాలని ఆదేశించారు.
- ఉపాధ్యాయులు, లెక్చరర్లకు దేశభక్తిపై కవితా రచన పోటీలు నిర్వహించాలి.
- ప్రతిరోజూ ప్రార్థన సమయంలో అన్ని రకాల విద్యాసంస్థల్లో ఎంపిక చేసిన దేశభక్తి గీతాలను మైకుల ద్వారా వినిపించాలి.
- రిచర్డ్ అటెన్ బరో నిర్మించి, దర్శకత్వం వహించిన 'గాంధీ' సినిమాను రాష్ట్రంలోని అన్ని థియేటర్లలో ప్రభుత్వ, ప్రయివేటు విద్యాసంస్థల విద్యార్థినీ విద్యార్థుల కోసం ప్రతిరోజూ ప్రదర్శించాలి.
- గ్రామం మండల జిల్లా రాష్ట్ర స్థాయిల్లో ఫ్రీడం కప్ పేరుతో ఆటల పోటీల నిర్వహించాలి. విజేతలకు బహుమతులు ప్రధానం చేయాలి.
- వజ్రోత్సవాల సందర్భంగా విద్యార్థులు, ఉద్యోగులు, ఇతర వర్గాల వారిని కలుపుకొని ప్రత్యేక ర్యాలీలు నిర్వహించాలి.
- పదిహేను రోజుల వేడుకల్లో ఒక రోజున రాష్ట్రమంతటా ఏక కాలంలో, ఎక్కడివాళ్లు అక్కడ 'తెలంగాణ రాష్ట్ర సామూహిక జాతీయ గీతాలాపన' జరిపించాలి. ఇందుకు పోలీసు శాఖ బాధ్యత వహించాలని డీజీపీ మహేందర్‌రెడ్డిని ఆదేశించారు. వేడుకలను సక్సెస్ చేయడానికి అన్ని వర్గాలప్రజలు, అధికారులు, విద్యార్థులను భాగస్వామ్యం చేస్తూ పలు కార్యక్రమాలకు రూపకల్పన చేశారు. ఏరోజు ఏ కార్యక్రమాలు నిర్వహించాలనే దానిపై అధికారులకు స్పష్టతనిచ్చారు.
స్వతంత్ర భారత వజ్రోత్సవాల నిర్వహణకు జిల్లా కమిటీలు: ప్రభుత్వ ఉత్తర్వులు
స్వతంత్ర భారత వజ్రోత్సవాల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం జిల్లా కమిటీలను నియమించింది. ప్రభుత్వం నిర్ణయించిన మేరకు ఆయా కమిటీలు ఈనెల 8 నుంచి 22 వరకు వివిధ కార్యక్రమాలను నిర్వహించనున్నాయి. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ మంగళవారం ఉత్తర్వులు జారీచేశారు. కమిటీకి జిల్లా మంత్రి చైర్మెన్‌గా, కలెక్టర్ కన్వీనర్‌గా వ్యవహరిస్తారు. జెడ్పీ చైర్మెన్, పోలీసు కమిషనర్, ఎస్పీ, మేయర్, మున్సిపల్ చైర్మెన్, అడిషినల్ కలెక్టర్ (స్థానిక సంస్థలు), జెడ్పీ సీఈవో, డీఆర్డీవో, డీఈవో, మున్సిపల్ కమిషనర్, క్రీడలు యువజన సర్వీసుల శాఖ అధికారి, ఆర్అండ్బి ఎస్ఈ సభ్యులుగా ఉంటారు.