Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రోడ్లను ఊడ్చిన వీఆర్ఏలు
నవతెలంగాణ- విలేకరులు
తమకు పేస్కేల్ అమలు చేసి, సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ నిరవధిక సమ్మె చేస్తున్న వీఆర్ఏలు బుధవారం రోడ్లను ఊడ్చారు. ఇప్పటికైనా ప్రభుత్వం తమ మొర ఆలకించాలని విన్నవించారు. వారికి వివిధ రాజకీయ పార్టీల నాయకులు మద్దతు తెలిపారు.
వనపర్తి జిల్లా కేంద్రంలోని పాత ఆర్డీఓ కార్యాలయం వద్ద వీఆర్ఏ జేఏసీ జిల్లా అధ్యక్షులు జి.సురేష్ ఆధ్వర్యంలో రోడ్లను ఊడుస్తూ నిరసన తెలిపారు. మహబూబ్నగర్ జిల్లా మిడ్జిల్ మండల కేంద్రంలో చేపట్టిన వీఆర్ఏల ధర్నాకు సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి ఎ.రాములు మద్దతు తెలిపారు. నాగర్కర్నూల్ జిల్లా పెద్దకొత్తపల్లి మండల కేంద్రంలో చేపట్టిన వీఆర్ఏల ధర్నాకు సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్ధం పర్వతాలు మద్దతు తెలిపారు. బల్మూరు మండల కేంద్రంలో వీఆర్ఏల ధర్నాకు డీసీసీ అధ్యక్షులు డాక్టర్ వంశీకృష్ణ మద్దతు తెలిపారు.
ఖమ్మం జిల్లా తల్లాడ, కూసుమంచి, బోనకల్, చింతకాని మండల కేంద్రాల్లో తహసీల్దార్ కార్యాలయ ఎదుట వీఆర్ఏలు రోడ్లు ఊడ్చి నిరసన తెలిపారు. భద్రాద్రి కొత్తగడెం అశ్వారావుపేటలో తహసీల్దార్ కార్యాలయం ఎదుట రోడ్డు ఊడ్చారు. మంచిర్యాల జిల్లా జన్నారం తహసీల్దార్ కార్యాలయం ఎదుట పది రోజులుగా దీక్ష చేస్తున్న వీఆర్ఏలు మధ్యాహ్నం చీపుర్లతో రోడ్డు ఊడ్చి నిరసన తెలిపారు. పెద్దపల్లి జిల్లా రామగుండం తహసీల్దార్ కార్యాలయం ఎదుట పదో రోజు దీక్షలో పాల్గొన్నారు. జేఏసీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు రోడ్లను శుభ్రం చేసి నిరసన తెలిపారు.