Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 8 నుంచి నల్లబ్యాడ్జీలతో విధులకు...
- టీఈఈ జేఏసీ కన్వీనర్ ఎన్ శివాజీ
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
కేంద్రప్రభుత్వం పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో విద్యుత్ సవరణ బిల్లు-2022 ప్రవేశపెడితే మెరుపు సమ్మెకు సిద్ధంగా ఉన్నామని తెలంగాణ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ ఐక్య కార్యాచరణ కమిటీ చైర్మెన్ కే ప్రకాశ్, కన్వీనర్ ఎన్ శివాజీ తెలిపారు. కేంద్రం విద్యుత్ సవరణ బిల్లు ముసాయిదాను విడదల చేసిన నేపథ్యంలో కమిటీ అత్యవసర సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మెరుపు సమ్మెలో దేశవ్యాప్తంగా 27 లక్షల మంది విద్యుత్ ఉద్యోగులు పాల్గొంటారని చెప్పారు. దేశ రైతాంగం, విద్యుత్ సంస్థలు, వినియోగద ారులు, ఇతర భాగస్వామ్య పక్షాలతో ఎలాంటి సంప్రదింపులు జరపకుండా, కేంద్రప్రభుత్వం నిరంకుశంగా ఈ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టాలని ప్రయత్నిస్తున్నదని విమర్శించారు. సోమవారం (8వ తేదీ) నుంచి రాష్ట్ర వ్యాప్తంగా విద్యుత్ ఉద్యోగులు అందరూ నల్లబ్యాడ్జీలు ధరించి విధులకు హాజరవ్వాలని పిలుపునిచ్చారు. కార్పొరేట్ కార్యాలయాలు, జనరేటింగ్ స్టేషన్లు, సర్కిల్ కార్యాలయాలు, కార్పొరేట్ ఆఫీసుల వద్ద వివిధ రూపాల్లో నిరసనలు తెలుపుతామన్నారు. ఆజాదీ కా అమృత్ మహౌత్సవ్ పేరుతో దేశ స్వాతంత్య్ర వజ్రోత్సవాలను నిర్వహిస్తున్న సమయంలో కేంద్రప్రభుత్వం ఇలాంటి ప్రజావ్యతిరేక బిల్లును ప్రవేశపెట్టడం దుర్మార్గచర్య అని విమర్శించారు. 75 ఏండ్లుగా దేశ ప్రజల సొమ్ముతో నిర్మించుకున్న లక్షల కోట్లు విలువ చేసే విద్యుత్ సంస్థల ఆస్తులను ప్రయివేటు పెట్టుబడిదారులకు కట్టబెట్టే అతిపెద్ద కుట్ర జరుగుతున్నదని తెలిపారు. ఆలిండియా ఫెడరేషన్ ఆఫ్ ఎంప్లాయీస్ పిలుపు మేరకు తమ ఉద్యమ కార్యాచరణకు భాగస్వామ్య పక్షాలన్నీ మద్దతుగా నిలవాలని విజ్ఞప్తి చేశారు. అత్యవసర సమావేశంలో తుల్జారాం సింగ్, తిరుపతయ్య, శ్రవణ్‌కుమార్ గుప్తా, ఆరోగ్యరాణి తదితరులు పాల్గొన్నారు.