Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తహసీల్దార్లకు సీసీఎల్ఏ ఆదేశాలు
- పేస్కేలు ఇచ్చేందుకా? సర్దుబాటుకా? అనే అంశంపై సందిగ్ధం
- న్యాయం చేయకుంటే పోరాటాన్ని ఉధృతం చేస్తాం : వీఆర్ఏ జేఏసీ
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
రెవెన్యూ శాఖలో వీఆర్ఏలు నిర్వర్తించాల్సిన విధులు, ఇతర శాఖల్లో సర్దుబాటు అంశాలపై రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. వారికి సంబంధించిన పూర్తి వివరాలతో కూడిన నివేదికలను మండలాల వారీగా ఇవ్వాలని తహసీల్దార్లకు సీసీఎల్ఏ కార్యాలయం శుక్రవారం ఆదేశాలు జారీ చేసింది. తమకు పే స్కేల్ ఇవ్వాలని, వారసత్వ ఉద్యోగాలు, ప్రమోషన్లు ఇవ్వాలని వీఆర్ఏలు సమ్మె చేస్తున్న క్రమంలో ప్రభుత్వం వారి వివరాల సేకరణ నిర్ణయం ప్రాధాన్యతను సంతరించుకున్నది. వీఆర్ఏ పేరు, పని చేస్తున్న మండలం, గ్రామం, తండ్రి పేరు, సామాజిక తరగతి, విద్యార్హతలు, ఉద్యోగంలో చేరిన తేదీ, రిక్రూట్ అయిన పద్ధతి (డైరెక్ట్ పద్ధతిలో రిక్రూట్ అయ్యారా? వారసత్వ కోటాలో చేరారా? ప్రమోషన్ ఆధారంగా వచ్చారా?) పుట్టిన తేదీ, ప్రస్తుత వయస్సు, శాఖాపరంగా వారిపై ఏమైనా క్రమశిక్షణ ఉల్లంఘన కేసులున్నాయా? ఉంటే వాటి వివరాలు, మొబైల్ నెంబర్, ఆ వీఆర్ఏకు సంబంధించి ప్రత్యేక అంశాలు ఏమైనా ఉన్నాయా? అనే ఫార్మాట్‌ను రాష్ట్ర ప్రభుత్వం తహసీల్దార్లకు అందజేసింది. వీఆర్వోలను తీసేసే సమయంలో పూట వ్యవధిలోనే రికార్డులు సబ్మిట్ చేయాలని ఆదేశించినట్టుగానే...శుక్రవారం సాయంత్రం లోగా మండలాల వారీగా రిపోర్టు ఇవ్వాలని ఆదేశించింది.
సర్దుబాటుకా? పరిష్కారానికా?
సీఎం కేసీఆర్ అసెంబ్లీ సాక్షిగా ఇచ్చిన పేస్కేలు, వారసత్వ ఉద్యోగాలు, ప్రమోషన్లు, సొంతూరులో డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను కట్టిస్తామన్న హామీలను నెరవేర్చాలని వీఆర్ఏలు రాష్ట్ర వ్యాప్తంగా 20 రోజులుగా సమ్మె చేస్తున్నారు. కలెక్టరేట్ల ముట్టడి వెళ్లి హక్కుల కోసం ప్రశ్నించడాన్ని, సమ్మెలు చేయడాన్ని సహంచని రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటిలాగే మౌనం దాల్చింది. అసెంబ్లీ సాక్షిగా సీఎం ఇచ్చిన హామీలకే దిక్కులేకుండా పోయింది తమ బతుకులేం అవుతాయో అనే తీవ్ర ఆందోళనతో వికారాబాద్ జిల్లాకు చెందిన వీఆర్ఏ వెంకటయ్య, సంగారెడ్డి జిల్లాకు చెందిన వీఆర్ఏ రమేశ్ సమ్మె శిబిరం కోసం వేసిన టెంట్ల కిందనే గుండెపోటుతో ప్రాణాలు విడిచారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో కలెక్టరేట్ ముట్టడికి వెళ్లి ఇంటికెళ్లే క్రమంలో బొమ్మల రామారం మండలం తిరుమల గిరి గ్రామానికి చెందిన వీఆర్ఏ భిక్షపతి రోడ్డు ప్రమాదంలో చనిపోయాడు. మరోవైపు వీఆర్ఏలు తమకిచ్చే జీతాలు కనీసం అద్దెలకు, నిత్యావసర సరుకులకు కూడా సరిపోక తీవ్ర ఆర్ధిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సమ్మె ప్రకటనకు నెల ముందు కామారెడ్డి జిల్లాకు చెందిన వీఆర్ఏ సీహెచ్ రమేశ్ అప్పుల బాధతో లేఖ రాసి మరీ చనిపోయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రాష్ట్ర సర్కారుపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. తహసీల్దార్లకు సీసీఎల్ఏ కార్యాలయం ప్రస్తుతం జారీ చేసిన ఆదేశాలతో రాష్ట్ర ప్రభుత్వం తమకిచ్చిన హామీలను నెరవేర్చేందుకా? వీఆర్వోలాగానే ఇతర శాఖలకు సర్దుబాటు చేసేందుకా? ఇంటికి సాగనంపేందుకా? అనే విషయం తెలియక వీఆర్ ఏలు డైలమాలో పడ్డారు. మంచి నిర్ణయం వస్తే స్వాగతిస్తామని లేకుంటే సమ్మెను ఉధతం చేస్తామనీ, ఈ నెల 14న హైదరాబాద్‌లో జరిగే మీటింగ్‌లో భవిష్యత్ కార్యాచరణను ప్రకటిస్తామని వీఆర్ఏ జేఏసీ ప్రకటించింది.
ఇచ్చిన హామీలను నెరవేర్చాలి : వీఆర్ఏ జేఏసీ కో కన్వీనర్ వంగూరు రాములు
వీఆర్ ఏలలో నూటికి 90 శాతం మంది దళిత సామాజిక తరగతి చెందిన వారే. వారి జీవితాలతో రాష్ట్ర సర్కారు ఆటలాడుకోవడం సరిగాదు. సీఎం కేసీఆర్ అసెంబ్లీ సాక్షిగా ఇచ్చిన హామీలనే పరిష్కరించాలని వారు కోరుతున్నారు తప్ప గొంతెమ్మ కోరికలేం అడుగట్లేదు. పేస్కేలు అడగకూడదా? అర్హతలకు అనుగుణంగా ప్రమోషన్లు అడగటం నేరమా? వారసత్వ ఉద్యోగాల హామీ నెరవేర్చాలని వేడుకోవడం సబబు కాదా? వారికి డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇస్తానన్నది వాస్తవం కాదా? ఎందుకీ దోబుచూలాట? వీఆర్ ఏలకు ఇచ్చిన హామీలను నెరవేర్చండి.లేకుంటే పోరాటాన్ని ఉధృతం చేస్తాం.