Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రతిపక్ష పార్టీగా సర్కారు పాత్రను మేము పోషిస్తున్నాం : భట్టి
- శాసన సభ్యులకు రక్షణ కల్పించలేని ప్రభుత్వం..,శాంతి భద్రతలు ఎలా కాపాడుతుంది : ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి
నవతెలంగాణ-దుమ్ముగూడెం
గోదావరి వరదలతో ముంపునకు గురైన భద్రాచలం, దుమ్ముగూడెం, బూర్గంపహాడ్ మండలాల్లో వరద బాధితుల పరామర్శ కోసం వచ్చిన సీఎల్పీ బృందాన్ని అడ్డుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం కుట్ర దాగి ఉందని సీఎల్పీ నేత, మధిర ఎమ్మెల్యే భట్టి విక్రమార్క ఆరోపించారు. గోదావరి వరదలతో నష్టపోయిన ముంపు గ్రామాల పరిశీలన కోసం రావాలని సీఎల్పీ సమావేశంలో భద్రాచలం ఎమ్మెల్యే పొదెం వీరయ్య కోరడంతో ఆయన అభ్యర్ధన మేరకు మంగళవారం ముంపు గ్రామాల పర్యటన కోసం మంగళళవారం సీఎల్పీ బృందం భద్రాచలానికి చేరుకుంది. ఈ సందర్భంగా లచ్చిగూడెం వద్ద ఏఎస్పీ రోహిత్ రాజ్, సీఐ దోమల రమేష్ ఆధ్వర్యంలో సీఆర్పీఎఫ్ బలగాలు వలయంగా ఏర్పడి సీఎల్పీ బృందంతో వచ్చిన వాహనాలను మారాయిగూడెం మీదుగా భద్రాచలం పంపించారు. ఈక్రమంలో లచ్చిగూడెం వద్ద విలేఖరులు అడిగిన ప్రశ్నలకు భట్టితో పాటు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మాట్లాడారు. దుమ్ముగూడెం మండలంలోని సున్నంబట్టి, ఎం. కాశీనగరం గ్రామాల్లో గోదావరి వరదలతో ప్రజలకు జరిగిన ఆస్తి నష్టాన్ని ప్రత్యక్షంగా తెలుసుకునేందుకు వెళుతున్న సీఎల్పీ బృందాన్ని పోలీసులు అడుగడుగునా అడ్డుకోవడంతో పాటు ఆటంకాలు కల్పించారని తెలిపారు. పైగా మావోయిస్టుల ప్రభావిత ప్రాంతం పేరుతో తాము రక్షణ కల్పించలేమంటూ చేతులు ఎత్తేయడంతో ప్రజల కష్టాలు తెలుసుకోకుండానే వెను తిరిగి వెళ్లాల్సి వస్తోందన్నారు. గోదావరి వరదల సమయంలో జరిగిన నష్టాన్ని కేంద్రానికి నివేదిక పంపి ముంపు బాధితులను ఆదుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉన్నా పట్టీపట్టనట్టు వ్యవహరిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అందుకే ప్రభుత్వం పాత్ర తాము పోషిస్తున్నామని, వారికి ఎల్లప్పుడూ అండగా ఉంటామని తెలిపారు. ప్రకృతి వైపరీత్యాలతో నష్టం వాటిల్లినప్పుడు పరిహారం అందించే బాధ్యత పాలక ప్రభుత్వాలపై ఉంటుందని తెలిపారు. పంట బీమా పథకం లేకపోవడం వల్ల రైతులు ఆర్థికంగా నష్టపోయారన్నారు. గోదావరి నదిపై నిర్మించే కరకట్టలను పూర్తి స్థాయిలో నిర్మించకపోవడం వల్ల భద్రాచలం పట్టణంతో పాటు గోదావరి పరివాహక ప్రాంతాలు మొత్తం కొద్దిపాటి వరదలకే నీట మునిగి పోతున్నాయన్నారు. శాసనసభ్యులకు రక్షణ కల్పించలేని ప్రభుత్వం శాంతి భద్రతలు ఎలా కాపాడుతుందని ఎద్దేవా చేశారు. సీఎల్పీ బృందంలో మంథని ఎమ్మెల్యే, ఏఐసీసీ కార్యదర్శి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, భద్రాచలం ఎమ్మెల్యే పొదెం వీరయ్య, ములుగు ఎమ్మెల్యే సీతక్క, మాజీ ఎంపీ పోరిక బలరాం నాయక్, రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు పోట్ల నాగేశ్వరరావు, పీసీసీ సభ్యులు నల్లపు దుర్గాప్రసాద్, బోగాల శ్రీనివాసరెడ్డి, మండల కాంగ్రెస్ అధ్యక్షులు లంకా శ్రీనివాసరావు తదితరులున్నారు.